Bigg Boss Telugu.. హమ్మయ్య.. ఓ పనైపోయింది. సోషల్ మీడియాలో ఇకపై కంటెస్టెంట్ల అభిమానుల పేరుతో రచ్చ వుండదు. ఆయా కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్ని కించపర్చుతూ జుగుప్సాకరమైన కామెంట్లకు శుభం కార్డు పడినట్లే. ఎవరో గెలుస్తారు.. ఇంకెవరో ఓడుతారు. వీటి చుట్టూ బోల్డంత విశ్లేషణ. ప్రతిరోజూ రచ్చే.. వీకెండ్ రచ్చ ఇంకాస్త ప్రత్యేకం.
మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకూ.. రచ్చ పెరుగుతోంది.. బిగ్ బాస్ రియాల్టీ షో మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తోంది. మరి, సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల మద్దతుదారుల హంగామా ఎలా పెరుగుతోందట.? అదే చిత్రం. సోషల్ మీడియా మేనేజిమెంట్ వ్యవహారమిది.
Bigg Boss Telugu.. ఆ పవర్ ఎవరికి వుంటే వాళ్ళే విన్నర్..
ఎవరు సోషల్ మీడియా వేదికగా తమ సత్తా చాటగలుగుతారో వాళ్ళే విన్నర్స్. కౌశల్ నుంచి ఇప్పటిదాకా జరిగింది అదే. అలాగని, పోటీలో గెలిచిన కంటెస్టెంట్లను తక్కువ చేసి మాట్లాడలేం. వాళ్ళలో ఏదో ప్రత్యేకత వుంది కాబట్టే, బిగ్ బాస్ రియాల్టీ షో వరకూ వచ్చారు.. అందులో చివరి వరకూ నిలబడ్డారు.

అయినాగానీ, సోషల్ మీడియా ప్రమోషన్స్ లేకుండా అయితే, బిగ్ బాస్ విన్నర్ అయ్యే ప్రసక్తే లేదు. అందుకే, ఒక్కసారి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందంటే, తమ సోషల్ పవర్ ఎంత.? అన్నది ఆయా సెలబ్రిటీలు ముందుగానే చెక్ చేసుకోవాల్సి వస్తోంది.
ఎంత గెలిచారు.? ఎంత ఖర్చు చేశారు.?
ప్రైజ్ మనీ ఎంత.? కంటెస్టెంట్లకు ఎంతెంత రెమ్యునరేషన్ దక్కుతోంది.? అన్న విషయాల్ని పక్కన పెడితే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏ కంటెస్టెంట్ ఎంత ఖర్చు చేశాడన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఆ స్థాయికి బిగ్ బాస్ రియాల్టీ షో దిగజారిపోయింది మరి.
కరోనా జోరులోనూ బిగ్ బాస్ రియాల్టీ షో ఆగలేదు. రెండు సీజన్లు కరోనా పాండమిక్ సమయంలోనే నడిచేశాయి. వచ్చే సీజన్ ఎలా వుంటుందో ఏమో. ఈసారి డబుల్ ధమాకా.. అంటే, ముందుగా ఓటీటీ.. ఆ తర్వాత టెలివిజన్ ఛానల్‌లో.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఏమో, ఇదెంత నిజమో చెప్పలేం.
Also Read: Ashu Reddy కాన్ఫిడెన్స్.. హాటుగా ఘాటుగా.?
‘మేమంతా ఒక్కటే..’ అని బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu) ముగిశాక, కంటెస్టెంట్లంతా పార్టీలు చేసుకుంటారు.. కానీ, వారిని గుడ్డిగా అభిమానించే.. లేదా, గుడ్డిగా ఎవరో విసిరిన కాసులకు కక్కుర్తి పడే నెటిజన్లు.. కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తుండడం మాత్రం క్షమించరాని విషయం.