పులిహోర తాళింపు కోసం కరివేపాకు వుండాల్సిందే.. అన్నట్టు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్. అస్సలేమాత్రం పస లేకుండా సాగుతోన్న ఈ రియాల్టీ షోలో కాస్తో కూస్తో ఊపు వచ్చిన ఎపిసోడ్ అంటే, ఈ రోజు.. అదీ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ మాత్రమే.
అయితే, సూపర్బ్ ఫన్ నడుమ సాగిన షో ఒక్కసారిగా గందరగోళం అయిపోయింది. ‘నేను స్ట్రాంగ్.. సో, వీక్ కంటెస్టెంట్స్‌తో ఏం పోటీ పడతాం.? అందుకే నన్ను నేను డిఫెండ్ చేసుకోలేదు..’ అని తెగేసి చెప్పిన ‘సీక్రెట్ రూం స్టార్’ అఖిల్ సార్థక్, అనూహ్యంగా హౌస్‌లోకి అడుగు పెట్టాడు.
ఎలిమినేషన్ లేదు, తొక్కా లేదు.. అంటూ సీక్రెట్ రూం నుంచి, అతన్ని హౌస్‌లోకి తీసుకొచ్చేశారు. దీనికో పెద్ద డ్రామా మళ్ళీ. ఎవరూ నమ్మలేదు అఖిల్ ఎలిమినేషన్‌ని.. ఆఖరికి హౌస్‌మేట్స్ కూడా. అఖిల్ మాత్రం, తానెక్కడ హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందోనని తెగ ఏడ్చేశాడు ‘ప్యాక్ యువర్ బ్యాగ్స్’ అంటూ నాగ్ ఆర్డర్ వేయగానే.
‘మమ్మీ..’ అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఈ సింపతీ స్టార్, అసలు దునియాలో సింపతీ అన్న మాటే లేదని చెప్పడం ఇంకో ఆసక్తికరమైన విషయం. అసలు అఖిల్, బిగ్ హౌస్‌లో ఏం ఉద్ధరించాడని.? ఏదో ఏడ్చాడు కదా అని.. డైరెక్ట్‌గా కెప్టెన్‌ని చేసేశారు.
సో, వచ్చేవారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి అఖిల్ సార్థక్ సేవ్ అయిపోయినట్లే. ‘మనోడే, చివరి వారం వరకు వుంచేద్దాం..’ అని నిర్వాహకులు అనుకుంటున్నారేమో.. అన్న డౌట్లు చాలామంది నుంచి వస్తున్నాయి అఖిల్ విషయంలో. హౌస్‌లో పులిహోర కలపడంలో దిట్ట అయిన అఖిల్, ఒకరితో కాదు.. చాలామందితో కలిపేస్తున్నాడు.
సోహెల్, మెహబూబ్‌లతో ఎమోషనల్‌గా ఆడుకుంటున్నాడు.. మోనాల్‌తో అఖిల్ ‘ఆట’ సంగతి సరే సరి. అవసరం కోసం అబిజీత్ పంచన కూడా చేరాడు. సరే, ఇవన్నీ ఆటలో భాగమేననుకుంటే చెప్పడానికేముంది.? అఖిల్ రియల్ యాంగిల్ ఏంటి.? అన్నది పక్కన పెడితే, బిగ్‌బాస్ ఇవన్నీ అతనితో చేయిస్తున్నాడనే విషయమైతే అర్థమవుతోంది.
దానికి అఖిల్ పూర్తిగా సహకరిస్తున్నాడు. అబిజీత్‌లా, దేన్నీ వ్యతిరేకించలేకపోతున్నాడు. ఆఖరికి అరియానాలా కూడా, బిగ్‌బాస్‌ని సవాల్ చేయలేకపోతున్నాడు అఖిల్. అందరూ అఖిల్‌ని ‘కరివేపాకు’ అంటున్నారుగానీ, అఖిల్‌కి చాలా ‘బిగ్’ పవర్ వుంది.. ఆ పవర్ సపోర్ట్ తప్ప, అఖిల్ రియల్‌గా ఈ రియాల్టీ షోలో చేసిందేమీ లేదు.