Table of Contents
Amaravati Vs Visakhapatnam.. ఇంకోసారి ‘విశాఖ రాజధాని’ అంశంపై మీడియా, రాజకీయ వర్గాల్లోనూ.. జన బాహుళ్యంలోనూ చర్చ జోరుగా సాగుతోంది. తప్పొప్పుల పంచాయితీ కూడా నడుస్తోంది.
అసలు విశాఖపట్నం అనే నగరానికి వున్న ప్రత్యేకతలేంటి.? రాజధానిగా విశాఖ అర్హతలేంటి.?
అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించగలిగినప్పుడు, విశాఖపట్నం నగరానికి వున్న రాజధాని అర్హతల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి దశాబ్ద కాలమవుతోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్న తలెత్తడం.. సిగ్గుచేటు.
అప్పటి, ఇప్పటి అధికార పార్టీలు సిగ్గుపడాల్సిన సందర్భమిది. కానీ, నిస్సిగ్గుగా ఇంకా ఈ విషయమ్మీద రాజకీయాలు చేస్తున్నారు.
అసలు సమస్య అదే.!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. మూడు రాజధానుల అంశంపై చేసిన చట్టం చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కొత్త చట్టమేదీ ఇంతవరకూ చెయ్యేలేదు.
అమరావతి మీద ‘కమ్మరావతి’ అంటూ బురద చల్లి, గొంతు కోస్తే.. రేప్పొద్దున్న విశాఖకో, కర్నూలుకో.. ఆ గతి పట్టదన్న గ్యారంటీ ఏంటి.?
Mudra369
వైఎస్ జగన్ ప్రభుత్వం, రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాలన్న ఆలోచనతో వుంటే.. అది మళ్ళీ వేరే చర్చ. వైసీపీ నేతలు మూడు రాజధానుల గురించి మాట్లాడితే అది రాజకీయం.
వాస్తవమేంటంటే, రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే.. అదీ ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం.
పాలకుడు మారితే.. రాజధాని మారిపోవాలా.?
ఔను.! ఇదే అత్యంత కీలకమైన ప్రశ్న. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని.. దాంతో, వైఎస్ జగన్ హయాంలో అమరావతిని మీద ‘కుల ముద్ర’ వేసి, మరో రెండు రాజధానులు అదనంగా.. అంటున్నారు.

ఇక్కడ ‘కమ్మరావతి’ అని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదం. ఎందుకంటే, ఆ అమరావతిని శాసన రాజధానిగా ఆ వైసీపీనే అభివర్ణిస్తోంది. పైగా, అలాగని చట్టం చేసేందుకు ప్రయత్నించారు కదా.?
Amaravati Vs Visakhapatnam.. విశాఖ ప్రత్యేకతలు వేరు..
హైద్రాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరం, అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం మాత్రమే. అక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలూ కనిపిస్తాయి.
అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం.. వాట్ నాట్.. చాలా వున్నాయి విశాఖలో. ఏమాత్రం ఆలోచించకుండా మొట్టమొదటే విశాఖను రాజధానిగా ప్రకటించేసి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు.
వెనుకబాటుతనం.. ఎవరి శాపం.? ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించీ.. రాయలసీమ వెనుకబాటుతనం గురించీ దశాబ్దాలుగా చర్చించుకుంటూనే వున్నాం.
Mudra369
పాలకులు మారుతున్నారు తప్ప.. వెనుకాబటుతనం అలాగే వుంది. ఈ పాపం పాలకులందరిదీ.. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు..
కానీ, ఇప్పుడు అమరావతి గొంతు కోసేసి.. విశాఖ నెత్తిన రాజధాని కిరీటం పెట్టాలనుకుంటే.. అది రాష్ట్రానికి మంచిది కాదు.
వ్యక్తుల ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారితే.. శాపగ్రస్తమయ్యే రాష్ట్రానికి ఎప్పటికీ ఓ శాశ్వత రాజధాని అనేది వుండదు. పాలకుడు మారిన ప్రతిసారీ రాజధాని మారిపోతూ, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైపోతుంది.
– yeSBee