Table of Contents
Andhra King Taluka Review.. రావు రమేష్, మురళీ శర్మ, ఉపేంద్ర.. హీరో, హీరోయిన్లు.! ఓ సినిమాకి ఇంతకంటే మించిన తారాగణం ఇంకేముంటుంది.? అనిపిస్తే, అది మీ తప్పు కాదు.!
ఔను, ఉపేంద్ర వున్నాడు కదా.. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసెయ్యగలడు. రావు రమేష్ అయితే, అదరగొట్టేస్తాడు. మురళీ శర్మ, నిలబెట్టేస్తాడు.!
ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోంది.. అది, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మించి.. అనే ప్రచారం హీరో, హీరోయిన్ల మధ్య జరిగింది.! దాంతో, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కావాల్సినంత బజ్ దొరికేసింది.
కథా నేపథ్యమే సినిమా.! ఓ హీరో, ఓ అభిమాని.. ఇంట్రెస్టింగ్ కథాంశం కదా.! పైగా, గోదారి నేపథ్యమంటే, హిట్టు ఖాయమైనట్లే.!
ఇదీ, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా గురించి, విడుదలకు ముందు జనం చర్చించుకున్న విషయాల సారాంశం.
కాస్త ఆలస్యంగా, రివ్యూ ఇచ్చినా నష్టమేమీ లేదులే.. అనుకుని, థియేటర్లో సినిమా చూసినా, ఓటీటీలో వచ్చేవరకూ ఆగి, ఇప్పుడు ఇక్కడ.. ఇలా సమీక్షించుకోవడం జరుగుతోంది.
Andhra King Taluka Review.. 100వ సినిమా అంటే ఎలా వుండాలి.?
సినిమాలో నెంబర్స్‌కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పదో సినిమా, పాతికో సినిమా.. యాభయ్యవ సినిమా.. వందో సినిమా.. వీటికి, ఓ సెపరేట్ రేంజ్ వుంటుంది.
కాంబినేషన్స్ కూడా ఆ నెంబర్స్‌కి తగ్గట్టు వెరీ వెరీ స్పెషల్‌గా సెట్ చేస్తుంటారు. అలాంటిది, ఓ ప్రముఖ హీరో వందో సినిమా, చివరి నిమిషంలో అర్థాంతరంగా ఆగిపోతే.?
అసలు అలా జరుగుతుందా.? ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా.? సినిమా కదా.. దర్శకుడు, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడంతే.!
ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో, పూట గడవడానికే కష్టపడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు, తన అభిమాన హీరోకి మూడు కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడు అనూహ్యంగా.
ఇదేమీ, ఇప్పుడు నడుస్తున్న కథ కాదు, ఎప్పుడో నడిచిన కథ. పాత కాలంలో మూడు కోట్లంటే చిన్నమాటా.? గోదారి లోంచి ఇసుక తోడేసి, మూడు కోట్లు సంపాదించేస్తాడు హీరో.
పడవలేసుకుని లంకలో సినిమా చూసేందుకు థియేటర్‌కి జనాలు రావడమేంటో, పైగా దాన్ని 70 ఎంఎం ఏసీ డాల్బీ డీటీఎస్ థియేటర్.. స్థాయిలో నిర్మించడమేంటో.!
నచ్చినట్టు రాసేసుకున్నాడు కథని..
దర్శకుడు ఎడా పెడా, తనకు నచ్చినట్లు కథ రాసుకుంటూ పోయాడు.! విలన్ ఏమో, థియేటర్ ఓనర్.. తన కూతుర్ని ప్రేమించిన హీరోని చితక్కొట్టేస్తాడు.
అంతే, హీరోగారికి కోపమొచ్చేస్తుంది. తన లవర్ తండ్రి, తనను అవమానించిన కారణంగా, సవాల్ చేస్తాడు.. థియేటర్ కట్టేస్తానని.. అదీ, తన అభిమాన నటుడి సినిమాతో ప్రారంభిస్తానని.
తనకు మూడు కోట్లు పంపిన అభిమానిని వెతుక్కుంటూ, ఆ నటుడు.. బీభత్సమైన వరదని సైతం లెక్క చేయకుండా, లంక గ్రామానికి వెళ్ళిపోతాడు. కథ సుఖాంతమవుతుంది.
తన అభిమానిని చూసి స్ఫూర్తి పొందిన నటుడు, మొదటి నుంచీ మళ్ళీ మొదలు పెడతాడన్నమాట కెరీర్‌ని. ఇది మంచి పాయింటే.
సగటు సినీ అభిమానికి కొంతమేర బాగానే కనెక్ట్ అవుతుందీ సినిమా. అదే, సగటు సినీ ప్రేక్షకుడికి.. మరీ నాసిరకం సినిమాగా.. అనిపిస్తుంటుంది.
రామ్ పోతినేని అంటే, తెరపై బోల్డంత ఎనర్జీ. అది మిస్ అయ్యింది. క్యారెక్టర్ డిజైనింగ్‌లో లోపం. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలో కూడా అదే జరిగింది.
ఉపేంద్రతోనే ఏమీ చేయించలేక..
అసలంటూ, ఉపేంద్రతోనే ఏమీ చేయించలేకపోయాడు దర్శకుడు కొత్తగా.! కొత్తగా ట్రై చేయక్కర్లేదు, ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్‌ని సరిగ్గా వాడుకుంటే సరిపోయేది. అదీ జరగలేదు.
ఆల్రెడీ రావు రమేష్, మురళీ శర్మ గురించి చెప్పేసుకున్నాం కదా. మిగతా నటీనటుల్లో రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగానే నటించారు.
సంగీతం బానే వుంది.. సినిమాటోగ్రఫీ కూడా ఫర్లేదు.! డైలాగ్స్ కొన్ని బావున్నాయ్.. కొన్ని, తేలిపోయాయ్.! ఎడిటింగ్ గనుక, సరిగ్గా చేసి వుంటే, నిడివి బాగా తగ్గిపోయి.. కాస్త సినిమాలో వేగం వుండి వుండేదేమో.
ఎమోషన్స్ నిజానికి, సరిగ్గా పండలేదు. లవబుల్ మూమెంట్స్ హీరో హీరోయిన్ల మధ్య పడలేదు. కామెడీ కొన్ని చోట్ల ఫోర్స్డ్గా అనిపిస్తుంటుంది.
కొన్ని సీన్స్‌లో రామ్ పోతినేని కూడా నీరసంగా కనిపించాడంటే, కథ అలానే కథనాలు ఎంత డొల్లగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఓవరాల్‌గా, హీరోల అభిమానులు కొంతమేర సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశముందంతే. అంతకు మించి, సినిమా సగటు సినీ ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అయ్యేందుకు ఆస్కారం లేదు.
