Andhra Pradesh MLC Elections ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాల్ని వైసీపీ దక్కించుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ నెగ్గింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీనే ఎక్కువ స్థానాల్ని గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ ఓ స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది.
మొత్తంగా 23 మంది ఎమ్మెల్యేలున్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే, అందులో నలుగురు వైసీపీలోకి దూకేశారు చాలాకాలం క్రితమే. ఆ లెక్కన 19 మంది ఎమ్మెల్యేలతోనే బరిలోకి దిగింది టీడీపీ.
గెలవడానికి 22 ఓట్లు కావాల్సి వుండగా, వైసీపీ నుంచి ఓ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సాయపడ్డారు. వారంతా టీడీపీకి అమ్ముడుపోయారన్నది వైసీపీ ఆరోపణ.
Andhra Pradesh MLC Elections అమ్ముడుపోవడమే నిజమైతే..
ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారన్న వైసీపీ ఆరోపణ నిజమైతే, టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు.. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అమ్ముడుపోయారన్నమాట.
వాస్తవానికి టీడీపీ గెలుచుకున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, ఓ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం.. మొత్తం నాలుగు ఎమ్మెల్సీలూ ఆ పార్టీకి బోనస్.!
Also Read: బతికే వున్నాను మహాప్రభో: సీనియర్ నటుడు ‘కోట’ ఆవేదన.!
ఈ నాలుగింటినీ వైసీపీ చేజేతులా చేజార్చుకుందంటే, వైసీపీ వున్నపళంగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలి. కానీ, వైసీపీ మాత్రం బుకాయింపులు, ఎదురుదాడితోనే సరిపెడుతోంది.
వైసీపీలో కోవర్టుల్ని ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా గుర్తించాల్సిందే. లేదంటే, 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బలు.. ఈ కోవర్టుల వల్లనే తగులుతాయ్.!
వేటుకి వేళాయెరా.. కానీ.?
కాగా, క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన ఎమ్మెల్యేలను గుర్తించామనీ, తగిన సమస్యంలో వారిపై కఠిన చర్యలుంటాయని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు.
మరోపక్క, ఫలానా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు కొందరు, తమ పార్టీ నేతలపైనే దారుణమైన దూషణలకు దిగుతున్నారు.
వైసీపీ కార్యకర్తలైతే మరింత అధ్వాన్నమైన భాషలో మహిళా ప్రజా ప్రతినిథుల్నీ తూలనాడుతున్నారు. ముందైతే వైసీపీ పరంగా క్రాస్ ఓటింగ్ చేసిన ప్రజా ప్రతినిథులపై చర్యలు తీసుకోవాలి. కానీ, వైసీపీ అందుకు సాహసిస్తుందా.?