Table of Contents
Ante Sundaraniki.. మొన్నామధ్య సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై సెటైర్ వేసి, అడ్డంగా బుక్కయిపోయాడు నేచురల్ స్టార్ నాని. ‘నీకెందుకయ్యా ఈ రాజకీయం.?’ అని చాలా మంది హిత బోధ చేశారు నానికి.
తన సినిమాకి ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో నాని అలా మాట్లాడాల్సి వచ్చింది. అయినా కానీ, విపరీతమైన పొలిటికల్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
అంతకు ముందు ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో విడుదల కావల్సి రావడంతో, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా విషయంలో ఆందోళన పెరిగి, అలా వచ్చిన ఆవేదనతో నాని మాట్లాడిన మాటలివి.
Ante Sundaraniki.. ఏవండోయ్ నానీగారూ.!
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నాని (Natural Star Nani) తన తాజా సినిమా ‘అంటే సుందరానికీ..’ రిలీజ్ విషయమై ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో 22 ఏప్రిల్ నుంచి, 10 జూన్ వరకూ మొత్తం ఏడు రిలీజ్ డేట్స్ వున్నాయ్.
ఇదే విచిత్రంగా వుందంటే, ఇందులో మరో ఇంట్రెస్టింగ్ టచ్, ‘సుందర్ బ్లాక్స్.. ఈ ఆవకాయ్ సీజన్..’ అని పేర్కొన్నారు.
కోవిడ్ మూడో వేవ్.. దాంతో పాటుగా ఏపీలో సినిమా టికెట్లు, ధియేటర్ల విషయమై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో చాలా సినిమాలు తమ విడుదలని వెనక్కి నెట్టుకోవల్సి వచ్చింది.
నాని మార్క్ ర్యాగింగ్ అనుకోవచ్చా.?
ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ దాదాపుగా రెండేసి డేట్స్ ప్రకటించుకున్నాయ్. వాటిల్లోంచి ఒక్కో దాన్ని ఫైనలైజ్ చేసుకుంటున్నాయ్ పెద్ద సినిమాలు. మిగతా సినిమాలతో సర్దుబాట్ల వల్లే ఈ పరిస్థితి.
రెండు డేట్ల వరకూ ఓకే. ఏకంగా ‘సుందరం’ ఏడు డేట్లు అంటున్నాడు. కామెడీగా తీసుకోవాలా.? సెటైరికల్ అనుకోవాలా.? నిఖార్సయిన ర్యాగింగ్ అనుకోవాలా.? ఎవరికి ఎలా అర్ధమైతే అలా.!
ఏం కరోనా కష్టకాలమో, సినిమాలిలా విడుదల విషయంలో నానా తంటాలూ పడుతున్నాయి. ఎలాగైనా తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలనుకుంటోన్న సినీ జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కోవిడ్ కష్టాలు ఎప్పుడు పూర్తిగా తీరతాయో ఏమో.!
Also Read: ‘బొమ్మ’ ఓటీటీలో పడేయ్ బాసూ.. ఓ పనైపోద్ది.!
ఓ వైపు కోవిడ్ కష్టాలు, ఇంకో వైపు రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు.. వెరసి సినీ పరిశ్రమ పరిస్థితి అడ కత్తెరలో పోకచెక్కలా తయారైంది.!
ఆవకాయ్ సీజన్.. అదిరింది గురూ.!
ఏది ఏమైనా, ‘వి’ (V Movie), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాల్సి రావడంతో ఒకింత ఆవేదన, అసహనానికి గురైన నాని, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసి ఒకింత ఊరట పొందాడు.
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇచ్చిన విజయంతో నానిలో కొత్త జోరు కనిపిస్తోంది. ఆ జోరులోనే, తన తాజా సినిమాల ప్రమోషన్ కూడా ఒకింత ప్రత్యేకంగా వుండేలా నాని డిజైన్ చేయించుకుంటున్నట్టున్నాడు. ‘అంటే సుందరానికీ..’ సినిమాలో నాని సరసన నజ్రియా ఫహాద్ (Nazriya Fahaad) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆవకాయ్ సీజన్‌లో వస్తానంటున్న ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) తెలుగు ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో వేచి చూడాల్సిందే.