Table of Contents
Anupama Parameswaran Paradha Review.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పరదా’. ఇందులో తెలిసిన నటీనటులు తక్కువమందే వున్నారు.!
ఒకప్పటి హీరోయిన్ సంగీత, ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ ఇంట్రెస్టింగ్ రోల్లో నటించాడు.
కథేంటంటే, అదొక చిన్న గ్రామం. అక్కడ చిత్రమైన కట్టుబాట్లుంటాయి. ఊళ్ళో దేవత జ్వాలమ్మ విగ్రహానికీ ‘పరదా’ వేసి వుంటుంది. ఊళ్ళో మహిళలంతా, ‘పరదా’ చాటునే జీవితాన్ని గడిపేస్తుంటారు.
ఒకవేళ పరదా తీస్తే మాత్రం, పిల్లలు పుట్టరనే భయం ఊరి జనాల్లో వుంటుంది. పరదా తీసినవాళ్ళు, ఆత్మబలిదానం చేసుకుంటేనే, శాపం పోతుందన్నది వారి నమ్మకం.
Anupama Parameswaran Paradha Review.. గాలికి ఎగిరిపోతే..
ఓ సందర్భంలో కథానాయిక ‘పరదా’ గాలికి ఎగిరిపోతుంది. ఎవరూ చూడలేదనుకుంటుందామె. కానీ, ఓ ఫొటోగ్రాఫర్ ఆమెని ఫొటో తీసి, మ్యాగజైన్లో ప్రచురించేస్తారు.
దాంతో, ఊళ్ళో గలాటా.. కథానాయికని బలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. కానీ, ఆ ప్రయత్నానికి ఆటంకం కలుగుతుంది. ఊరి జనం, ‘నీ సచ్ఛీలతను నిరూపించుకో’ అని ఊరి నుంచి పంపేస్తారు.
గడువు లోపు, నిరూపించుకోలేకపోతే.. ఆత్మబలిదానానికి సిద్ధం కావాలనీ, లేని పక్షంలో.. కథానాయిక సోదరి బిడ్డ కడుపులోనే చనిపోతుందని ఊరి జనం భయపెడతారు.

ఎప్పుడూ ఊరు దాటని కథానాయిక (అనుపమ పరమేశ్వరన్) ఏకంగా, దేశ రాజధాని ఢిల్లీకి పయనమవుతుంది. అక్కడి నుంచి, ఏకంగా మంచు కొండల వైపు ప్రయాణం సాగిస్తుంది.
ఇంతకీ, కథానాయిక తన సచ్ఛీలతను నిరూపించుకుంటుందా.? సోదరి బిడ్డను కథానాయిక కాపాడగలిగిందా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
స్మార్ట్ ఫోన్స్ యుగంలోనే, సినిమా కథ నడుస్తుంటుంది. మరి, ఈ రోజుల్లో ‘పరదా’ స్థాయి మూఢ నమ్మకాలున్న గ్రామం అనే కాన్సెప్ట్ అస్సలేమాత్రం నమ్మదగినట్లు అనిపించదు.
సహనానికి పరీక్షే.. కానీ..
అక్కడక్కడా సాగతీత, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. కథానాయిక ఏదో ఒక సందర్భంలో తిరగబడి, వీరనారిలా మారిపోతుందేమోనని అనుకుంటాంగానీ, అదేదీ జరగదు.
కాకపోతే, సినిమాటోగ్రపీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. మంచి మంచి డైలాగులు, సినిమాలో మనం లీనమయ్యేలా చేస్తాయి.

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని బాగానే చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎక్కడా కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విషయంలో దర్శకుడ్ని అభినందించి తీరాలి.
కథని, ఓ పాతికేళ్ళ క్రితం జరిగినట్లుగా చూపించి వుంటే ఇంకా బాగా వర్కవుట్ అయి వుండేదేమో. ఓటీటీలో టైమ్ పాస్ కోసం చూడొచ్చు నిరభ్యంతరంగా.
ఎక్కడా అసభ్యతకు తావు లేదు. మహిళలకు సంబంధించిన కొన్ని సమస్యలపై దర్శకుడు కాస్త బోల్డ్‌గానే ప్రస్తావించాడు.
లోకం ఎంతలా మారినా..
లోకం ఎంతలా మారినా, ఇంకా మహిళల్ని ఏదో ఒక రకంగా పరదా చాటున వుంచేస్తున్న కాలమిది. పరదా అంటే, ఆంక్షలన్నమాట.
ఆ ఆంక్షల్ని దాటుకుని అద్భుతాలు సృష్టిస్తున్న మహిళల్నీ చూస్తున్నాం.. ఆంక్షలనే పరదాల వెనుక నలిగిపోతున్న మహిళల్నీ చూస్తున్నాం.
Also Read: కింగ్డమ్ రివ్యూ: గజిబిజి గందరగోళమ్.! టోటల్ బోర్డమ్.!
అలాంటి ఓ ‘పరదా’ గురించే దర్శకుడు ఈ సినిమాతో ఓ మంచి సందేశం ఇద్దామనుకున్నాడు. అతని ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.
అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. ఆ విషయం ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంతే. సంగీత కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. హర్షవర్ధన్ కొన్ని నవ్వులు పూయించాడు.