Aryan Khan.. సినిమాల్లోకి రాకుండానే తాను సూపర్ స్టార్.. అనిపించేసుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. ఔను, ఆర్యన్ ఖాన్ నటించిన ‘సినిమా’ సూపర్ హిట్ అయ్యింది.
అదొక లగ్జరీ క్రూయిజ్ షిప్.. అందులో ఓ పార్టీ.. ఆ పార్టీపై అత్యంత వ్యూహాత్మకంగా దాడి చేసి, ‘డ్రగ్స్’ గుట్టు రట్టు చేసిన అధికారులు. ఇదీ అసలు కథ.
ఇంతకీ ఆర్యన్ ఖాన్ పోషించింది ఏ పాత్ర.? కథానాయకుడా.? ప్రతినాయకుడా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరోలు నెగెటివ్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు.
ఆ మాటకొస్తే, షారుక్ ఖాన్ కూడా కొన్ని సినిమాలో నెగెటివ్ రోల్స్ చేశాడు. సో, ఆర్యన్ ఖాన్.. తన తొలి ప్రయత్నంలోనే భిన్నమైన కోణాల్ని ప్రదర్శించేశాడన్నమాట.

Aryan Khan హీరోయిజం
అటు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ని దోషిగా నిరూపించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ప్రయత్నిస్తే, ఇంకోపక్క బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. చివరికి ఆర్యన్ ఖాన్ బెయిల్ తెచ్చుకున్నాడు.
ఈ కథలో రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు పోషించిన పాత్ర తక్కువేమీ కాదు. అక్కడ జరిగిందేంటో ఎన్సీబీకీ, ఆర్యన్ ఖాన్‌కి మాత్రమే తెలుసు. కానీ, రాజకీయ నాయకులు కథలు అల్లేశారు.. మీడియా అల్లిన కథల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మీడియా పైత్యం.. రాజకీయ ఉన్మాదం..
ఆర్యన్ ఖాన్ ఏం తిన్నాడు.? జైల్లో అతని మానసిక పరిస్థితి ఏంటి.? అంటూ నిత్యం కథనాల్ని వండి వడ్డించేసింది మీడియా. నేషనల్ మీడియా, లోకల్ మీడియా.. అంతా కలిసి కట్టుగా ఓ పెద్ద హైడ్రామా నడిపించేశారు తమ తమ ఛానళ్ళలో, పత్రికల్లో.
Also Read: ఆర్యన్, రియా.. సినీ ‘జైలు పక్షుల’ వింత కథ!
ఓ రాజ్ కుంద్రా, ఓ రియా చక్రవర్తి.. అంతకు ముందు ఓ షల్మాన్ ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే, సెలబ్రిటీల క్రైమ్ కథలు ఎప్పుడూ సూపర్ హిట్టే. ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కథ కూడా ఇప్పుడు సూపర్ హిట్టే మరి.
అసలు కథ అప్పుడే అయిపోలేదు.. బెయిల్ రావడమంటే క్లీన్ చిట్ వచ్చినట్లు కాదు. అలాగని, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దోషి అనీ అప్పుడే నిర్ధారించేయడం తగు. విచారణ జరగాలి, న్యాయస్థానం తీర్పు చెప్పాలి.
న్యాయస్థానాల తీర్పు కంటే ముందే మీడియా, రాజకీయం తీర్పులిచ్చేస్తోంటే.. ఇదిగో ఇలాగే క్రైమ్ స్టోరీస్ సూపర్ హిట్ అయిపోతుంటాయి.. అవి సమాజానికి చేటు చేసేవి అయినాసరే.!