ట్యాబ్లెట్లు పుట్టడానికంటే వేల ఏళ్ళ క్రితమే మూలికా వైద్యంలో మందు గుళికలు చాలా రోగాల్ని నయం చేశాయి. ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేదు.. ఆయా దేశాల్లో ప్రాచీన వైద్యం చాలా చాలా అద్భుతాల్నే సాధించింది. ఎప్పుడైతే ప్రపంచానికి మోడ్రన్ వైద్యం పరిచయమైందో.. ఆ తర్వాత ప్రాచీన వైద్యం మీద విషం చిమ్మే ప్రక్రియ (Ayurvedic Medicine Vs Modern Medicine) మొదలైంది.
మూలికా వైద్యం.. ఆయుర్వేద వైద్యం.. నాటు వైద్యం.. పేరేదైనా ఒకప్పుడు సత్ఫలితాలనే ఇచ్చింది. కాలగమనంలో అది కూడా ‘ఫేక్’ అయిపోతూ వచ్చింది. దానిక్కారణం మోడ్రన్ వైద్యమేనంటారు చాలామంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తే.. వెంటనే జ్వరం తగ్గిపోతుంది. అదే, ఆయుర్వేద వైద్యమంటే కొంత సమయం పడితే పట్టొచ్చుగాక.
ఎప్పుడైతై తక్షణ ఫలితం (Instant Result) కోసం తాపత్రయపడటం మొదలైందో, ఆ తర్వాత దేహం ‘కుక్కలు చింపిన విస్తర’లా తయారవడం మొదలైందంటారు చాలామంది. మన శరీరం మందులమయమైపోయింది. తల్లి కడుపులో వుండగానే మందులు మింగేస్తున్నాం మనం. అలాంటప్పుడు, సహజంగా శరీరానికి వుండాల్సిన రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది.? ఛాన్సే లేదు.
ఆవిరి పడితే మంచిదంటాడు ఓ డాక్టరు.. అబ్బే, దాని వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటాయని చెబుతాడు మరో డాక్టరు. ఇద్దరూ నేటితరం వైద్యులే. ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. కానీ, ఓ చిన్న వైరస్.. ప్రపంచానికి సవాల్ విసురుతోంది.
మోడ్రన్ వైద్యాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే, దానికి అన్ని రకాల ఆధారాలూ వున్నాయి. కానీ, కరోనా వైరస్ మీద మోడ్రన్ వైద్యం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కొందరికి ఇంట్లోనే నయమైపోతోంది.. కొందరికి ఆసుపత్రుల్లో అత్యధునిక వైద్య చికిత్స అందించినా ఫలితం లేకుండా పోతోంది. అద్భుతంగా పనిచేస్తుందనుకుంటున్న మెడిసిన్, వైద్య చికిత్సల వల్ల ప్రయోజనం లేదనీ తేలుతోంది. మరెలా.?
మనిషి జీవితమంటేనే సవాళ్ళతో కూడుకున్న పని. మేమే గొప్ప.. అని ఎవరు అనుకున్నా అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఆయుర్వేదం, మోడ్రన్ వైద్యం.. రెండూ ఓ చక్కటి అవగాహనతో పనిచేస్తే, మెరుగైన ఫలితాలుంటాయ్. కానీ, అది జరగని పని. తూర్పు – పడమర (Ayurvedic Medicine Vs Modern Medicine) ఎప్పటికీ కలవవ్.. అలాంటిదేనేమో ఇది కూడా.