Baahubali The Epic Review.. ‘బాహుబలి ది బిగినింగ్’ చూశాం. ‘బాహుబలి ది కంక్లూజన్’ కూడా చూశాం. మరి, ఈ ‘బాహుబలి ది ఎపిక్’ ఏంటి.?
ప్రపంచ వ్యాప్తంగా సగటు సినీ అభిమాని, ‘బాహుబలి’ చూసే వుంటాడు.! ఓటీటీలో అందుబాటులో వున్నాయి గనుక, ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్లూజన్’ ఎప్పుడో చూసేశారంతా.
జక్కన్న రాజమౌళి చెక్కిన వెండితెర అద్భుతంగా ‘బాహుబలి’ని ప్రపంచమంతా కొనియాడింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు ‘బాహుబలి’తో.
శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క శెట్టి, కట్టప్పగా సత్యరాజ్, భళ్ళాల దేవుడిగా రాణా దగ్గుబాటి.. తమ కెరీర్‌లోనే అత్యద్భుతమైన పాత్రలు ఈ ‘బాహుబలి’లో చేశారు.
ప్రతి టెక్నీషియన్.. తమ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్.. అని చెప్పుకోదగ్గ సినిమా ‘బాహుబలి’.! సినిమా కాదు, సినిమాలు.!
Baahubali The Epic Review.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.?
‘బాహుబలి ది బిగినింగ్’ చూశాక, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న, సగటు ప్రేక్షకుడిలో తీవ్ర ఉత్కంఠకు కారణమయ్యింది.
అదే, ‘బహుబలి ది కంక్లూజన్’ సినిమాకి ప్రాణంగా మారింది. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ‘బాహుబలి ది కంక్లూజన్’ కోసం సినీ అభిమానులు.
అంతా బాగానే వుందిగానీ, ‘బాహుబలి ది ఎపిక్’ని ఎందుకు చూడాలి.? ఎందుకు చూడాలంటే, రెండు పార్టుల్నీ కలిపేసి, ఒకే సినిమాగా తీశారు గనుక.!
కొత్తగా ఏమీ, ‘బాహుబలి ది ఎపిక్’లో చూపించలేదు. కాకపోతే, ఆల్రెడీ వున్న కొంత పార్ట్‌ని తీసెయ్యాల్సి వచ్చింది. అక్కడికే, మూడున్నర గంటల పైన నిడి వచ్చింది ‘ఎపిక్’ కోసం.
థియేటర్లలోకి ‘బాహుబలి ది ఎపిక్’ వచ్చేసింది. కొందరు అద్భుతః అన్నారు. కొందరు పెదవి విరిచారు. అడ్డగోలుగా ఎడిటింగ్ చేసుకుంటూ పోయారన్న విమర్శలూ వచ్చాయి.
రివ్యూలు కూడా వచ్చేశాయండోయ్..
చిత్రమేంటంటే, ‘బాహుబలి ది ఎపిక్’కి రివ్యూలు కూడా వచ్చేశాయ్. ఇదే పెద్ద కామెడీ అంటే.! హెడ్డింగ్‌లో ‘సమీక్ష’ అని పెట్టాల్సి వచ్చింది.. ఇందుకే.!
సమీక్షించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. సౌండింగ్, పిక్చర్ క్వాలిటీ.. ఇవేవీ మారలేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది కాబట్టి, ఆ ఉత్కంఠ కూడా లేదు.
రాజమౌళి కోసం, ప్రభాస్, అనుష్క, రాణా దగ్గుబాటి, సత్యరాజ్, రమ్యకృష్ణ.. తదితరుల కోసం ఇంకోసారి ‘బాహుబలి ది ఎపిక్’ చూడాల్సి వచ్చింది.
బానే వుంది.. బావుంది. అంత వరకే. సినిమాని విశ్లేషించుకోవడానికేమీ లేదు.. ముందే చెప్పుకున్నట్లు. జస్ట్ రీ-రిలీజ్ తరహాలోనే చూడాలి.! చూశాం కూడా.
అదీ, ‘బాహుబలి ది ఎపిక్’ కథా కమామిషు.
