Table of Contents
Barbarik Director Mohan Srivatsa.. అతనో సినీ దర్శకుడు. రెండున్నరేళ్ళు కష్టపడి ఓ సినిమా తీశాడు. కానీ, సినిమా చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రాలేదు.!
దాంతో, తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు.! ఈ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
సక్సెస్, ఫెయిల్యూర్.. అనేవి మన చేతుల్లో వుండవు.. అని, పలువురు సినీ ప్రముఖులు చాలా సందర్భాల్లో చెప్పారు. మొన్నీమధ్యనే, ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ కూడా ఇదే చెప్పాడు.
Barbarik Director Mohan Srivatsa.. చెప్పుతో కొట్టుకుంటే..
నిజమే, దర్శకుడిగా అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. అవకాశం వచ్చినా, సినిమా పూర్తయి, థియేటర్లలోకి తీసుకురావడం మామూలు విషయం కాదు.
సినిమాని తెరకెక్కించి, థియేటర్లలో విడుదల చేసి.. ఇంత కష్టమూ పడ్డాక, సినిమా ఫలితం తేడా కొడితే.. ఆ బాధ వర్ణనాతీతం.
పెద్ద హీరోల సినిమాలు సైతం, థియేటర్లలో తొలి రోజే నిలబడలేని పరిస్థితుల్ని చూస్తున్నాం. ఇప్పుడిక్కడ మినిమమ్ గ్యారంటీ అన్న కాన్సెప్ట్ లేదు.
లెక్కలు మారిపోయాయ్..
సినిమాకి ఎంత హైప్ వున్నా, చిన్న నెగెటివ్ టాక్.. సినిమాని చంపేస్తున్న రోజులివి. మరి, ఏం చేయాలి సినిమా థియేటర్లలో ఆడాలంటే.?
సినిమా టిక్కెట్ల ధరలు తగ్గాలి.. మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గాలి.. అబ్బో, ఇంకా చాలా వున్నాయ్. అన్నిటికీ మించి, ఓటీటీ రూల్స్ మారాలి.
‘ఓటీటీలో చూస్కుందాం లే’ అన్న భావన ప్రేక్షకుల్లో పెరిగిపోయాక, థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం ఏ దర్శక నిర్మాతకైనా కష్టమైన వ్యవహారమే.
పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..
‘నేనేమైనా ఆత్మహత్య చేసుకుంటానేమోనని నా భార్య భయపడింది..’ అంటూ వాపోయాడా దర్శకుడు, ‘చెప్పుతో కొట్టుకున్న వీడియోను’ విడుదల చేస్తూ.
‘సినిమా బావుంది..’ అని థియేటర్లకు వెళ్ళిన, ఆ కొద్ది మందీ చెప్పారనీ, బాగున్న సినిమాకే జనాలు ఎందుకు రావడంలేదని సదరు దర్శకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సినిమా పేరేమో ‘బార్బరిక్’. దర్శకుడి పేరేమో మోహన్ శ్రీవత్స. పబ్లిసిటీ కోసమే ఈ ‘చెప్పుతో కొట్టుకునే డ్రామా’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.
ఈ స్థాయికి సోషల్ మీడియా నెగెటివిటీ దిగజారిపోయింది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. అన్న తేడా లేకుండా, పరిశ్రమ యావత్ ఒక్కతాటిపైకి వచ్చి, సమస్య పరిష్కారానికి నడుం బిగించాలి.