Table of Contents
ఆమెకు 45 ఏళ్ళు పైనే.. అంటే ఎవరైనా నమ్మగలరా.? త్వరలో ఆమె 50 ఏళ్ళ వయసుకు చేరుకుంటుందంటే ఒప్పుకోగలమా.? వయసు పెరిగే కొద్దీ, తన అందాన్ని మరింతగా పెంచేసుకుంటోన్న ఆ అందాల భామ ఇంకెవరో కాదు, ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai Birth Day).
హేమమాలిని (Hema Malini), రేఖ (Rekha).. ఇలా చాలామంది బాలీవుడ్ నటీమణులు.. వయసుతో తమ అందానికి పోటీ పెట్టారు. చాలావరకు వీరి అందం ముందు వయసు ఓడిపోయిందని చెప్పొచ్చు. ఆ బాటలోనే శ్రీదేవి (Sridevi) కూడా వయసును మించిన అందంతో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఆ తర్వాతి పేరు ఖచ్చితంగా ఐశ్వర్యారాయ్‌దే.
అందాల పోటీలు, సినిమాలు.. వెరసి, ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) పేరు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ మార్మోగిపోతోందనడం అతిశయోక్తి కాదేమో. ఐశ్వర్య ఏం చేసినా అందమే.. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో హాట్ హాట్‌గా నటించి మెప్పించిన ఘనత ఐశ్వర్యారాయ్‌కి దక్కుతుంది. ఇప్పటికీ ఐష్‌కి సినిమా ఆఫర్లు తగ్గలేదు. టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో ఐష్ పేరు విన్పిస్తూనే వుంది. అదీ ఐశ్వర్యారాయ్ అంటే.
అందమే ఐశ్వర్యం.. (Aishwarya Rai Birth Day)
పేరులోనే ఐశ్వర్యముంది.. నిజానికి, ఆమె అందమే ఆమెకు ఐశ్వర్యం. సూపర్ హిట్ సినిమాలు, పలువురు బాలీవుడ్ హీరోలతో ఎఫైర్లు, హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు.. ఇలా ఐశ్వర్యారాయ్ పేరు గడచిన రెండు దశాబ్దాల్లో దేశమంతటా మార్మోగిపోయిందంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. ఒకటా, రెండా.? లెక్కలేనని హిట్ చిత్రాలున్నాయి ఐశ్వర్యారాయ్ కెరీర్‌లో. బాలీవుడ్‌తోపాటు, సౌత్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ.
ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘జీన్స్’ (Jeans), ‘రోబో’ (Robo) తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ఐశ్వర్యారాయ్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘విలన్’, ‘ఇద్దరు’ సినిమాలూ తెలుగులోకొచ్చాయి.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి.
బాలీవుడ్‌లో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించి మెప్పించేసింది ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai Birth Day). దాదాపు అందరితోనూ సూపర్ హిట్స్ వున్నాయామెకి. అందానికి నిర్వచనం చెప్పమంటే, ఆత్మవిశ్వాసమే అందం.. అని చెబుతుంటుంది ఐశ్వర్య. అంతే కాదు, ఆ ఆనందమే ఐశ్వర్యమని చెప్పడం ఈ భామకే చెల్లిందేమో.
తెలుగులోనూ నటించిందిగానీ..
ఐశ్వర్యారాయ్ తెలుగులో ఓ సినిమాలో నటించింది తెలుసా? అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా అది. ‘రావోయి చందమామ’ ఆ సినిమా పేరు. అందులో ఐశ్వర్యారాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కన్పించింది. నాగార్జునతో ఆడిపాడింది. ‘లవ్ టు లివ్’ అంటూ సాగే ఆ పాటలో ఐశ్వర్యారాయ్ డాన్సుల్ని ఎలా మర్చిపోగలం.? సి. అశ్వనీదత్, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందించారు ఈ చిత్రాన్ని. అంజలా జవేరి హీరోయిన్.
రెడ్ కార్పెట్‌పై అందమైన ‘అమ్మ’
ఈ మధ్య రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యతోపాటుగా ఆమె కుమార్తె ఆరాధ్య (Aradhya) కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తనలానే తన కుమార్తెనూ అందంగా ముస్తాబు చేసి, ఐశ్వర్యారాయ్.. కుమార్తెతోపాటు ర్యాంప్‌పై నడుస్తోంటే, అభిమానులకు లభించే ఆ కిక్కే వేరప్పా. క్యూట్ ఆరాధ్య.. క్యూట్ ఐశ్వర్య.. అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
పెళ్ళయ్యాక ఐష్ సినిమాలు మానేస్తుందని అంతా అనుకోవడానికి కారణం.. ఆమె, బిగ్-బి కోడలు కావడమే. కానీ, బిగ్-బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) కుటుంబం నుంచి, ఆమెకు పూర్తిస్థాయి ‘స్వేచ్ఛ’ లభించింది సినిమాల్లో నటించడానికి. అత్తమామలు, భర్త అభిషేక్ బచ్చన్ (Abhishek Bachan) ప్రోత్సాహంతో సినిమాల్లో ఇంకా కొనసాగుతోంది ఐశ్వర్యారాయ్.
డాన్సింగ్ సెన్సేషన్
ఐశ్వర్యారాయ్ అనగానే ముందుగా ఆమె డాన్సులు గుర్తుకొస్తాయి. క్లాసికల్ డాన్సుల్లో ఎంతటి ప్రతిభ చూపుతుందో.. మోడ్రన్ డాన్సుల్లోనూ అంతే. ఆమె అందం, డాన్సుల్లో రెట్టింపవుతుందనడం అతిశయోక్తి కాదేమో. ఐష్ అందానికే కాదు, ఆమె డాన్సులకు ఫిదా అయ్యేవారెందరో వున్నారు. వయసు మీద పడ్తున్న ఆమె డాన్సుల్లో పదును తగ్గలేదు.. అందంలో మాత్రం తగ్గిందా ఏంటి.?