Table of Contents
Bhama Kalapam Review.. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ‘భామా కలాపం’ సినిమానా.? ఓటీటీ బొమ్మనా.? పేరేదైతేనేం.! ఇదొక క్రైమ్ థ్రిల్లర్.
ఓ గృహిణి అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేయాల్సి వస్తే, దీన్ని ఓ 200 కోట్ల విలువైన ‘కోడిగుడ్డు’ వ్యవహారంతో లింక్ చేసి, నడిపించాల్సి వస్తే, అదే ‘భామా కలాపం’.
Bhama Kalapam Review.. పక్కింట్లో భంచిక్.!
ఎదురింట్లో, పక్కింట్లో.. కాదు కాదు, మొత్తంగా తానుండే అపార్టుమెంటులోని ఏ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం అనుపమది. భర్త వారిస్తున్నా.. తన పద్థతి మార్చుకోదామె. ఓ సారి తన అత్యుత్సాహం కారణంగా ఆమె ఓ హత్య చేయాల్సి వస్తుంది.
కట్ చేస్తే, హతుడి దగ్గర 200 కోట్ల రూపాయల విలువైన కోడిగుడ్డు మాయమైపోతుంది. ఇంతకీ, అనుపమ ఎవర్ని హత్య చేసింది.? ఆ 200 కోట్ల విలువైన కోడిగుడ్డు ఏమైంది.? అది తెలియాలంటే ‘భామా కలాపం’ చూడాలి.
పాత్రలే కనిపించాయ్‌గానీ.!
ఈ కథలో ఓ పాస్టర్ వుంటాడు. ఓ పనిమనిషి, హత్య కేసు విచారిస్తున్న ఓ పోలీస్ అధికారిణి (గర్భిణి ).. వీళ్లందరితో పాటు కోడిగుడ్డు కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ఓ కామెడీ విలన్.. ఇంకా కొన్ని పాత్రలున్నాయ్.
‘భామా కలాపం’లో (Bhama Kalapam) ప్రతి పాత్రా హుషారుగానే వుంటుంది. ఆసక్తికరంగానే కనిపిస్తుంది. దాంతో తర్వాత ఏం జరుగుతుంది.? అనే ఉత్కంఠ సహజంగానే కలుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటాయ్. లాజిక్కులు అస్సలు అడక్కూడదు.
ప్రియమణి (Priyamani) నటనకి వంక పెట్టలేం. కానీ, ఆమెని సరిగ్గా వాడుకోలేకపోయారు. హాఫ్ బేక్‌డ్ అన్నట్లుగా అనిపిస్తుంది ఆమె పాత్ర. మిగతా పాత్రలూ అంతే. అందరూ బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ, ప్రతి పాత్రలోనూ ఏదో ఒక లోటు కనిపిస్తుంది. ప్రియమణి భర్త పాత్రతో సహా.
Bhama Kalapam Review.. ప్రియమణి చుట్టూనే తిప్పేశారు.!
టైటిల్ ‘భామా కలాపం’ కాబట్టి హీరోగా ఆమె భర్త పాత్ర కనిపించకూడదు అన్నట్లుంది వ్యవహారం. ప్రియమణి ఓ యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతుంది. అందులో ఆమె వంటలు చేస్తుంటుంది. వంటకి ఉపయోగించే కత్తి యూ ట్యూబ్ వీడియోలో చూసి, ఆమే ఆ హత్య చేసిందని పోలీస్ అధికారిణి నిర్ధారణకు రావడం శోచనీయమే మరి.
చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్ ఇలాంటివి. అయినా జస్ట్ ఓకే. టైమ్ పాస్ కోసమైతే ‘భామా కలాపం’ చూడొచ్చు. కానీ, రక్తపాతం, పైశాచికత్వం విషయంలో అసహ్యం వుండకూడదు. మరీ అంత ఘోరంగా చూపించలేదు కానీ, చూస్తే ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంతలా ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దాల్సిన అవసరమే లేదు.
Also Read: Samyuktha Menon: ‘పవర్’ అన్‌లిమిటెడ్.!
సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెర పదును వుంటే బాగుండేదనిపిస్తుంది. మ్యూజిక్ ఓకే. ఓటీటీకి తగ్గట్లుగా క్వాలిటీతోనే రూపొందింది. కేపబుల్ నటి, ఇంట్రెస్టింగ్ పాయింట్ వున్నప్పుడు ఇంకాస్త డెప్త్‌గా ఆలోచించాల్సి వుండాల్సింది.
చివరగా, ఈ సినిమాలో ఏ పాత్రనీ చంపెయ్యకుండా కూడా కావాల్సింత ఫన్, థ్రిల్ రాబట్టొచ్చు. కానీ, దర్శకుడు ఏమనుకున్నాడో, మేకర్స్ ఏం ఆలోచించారో.. అనవసరంగా హత్యలు జరిగాయ్.. రక్తపాతమూ బీభత్సం సృష్టించేసింది. అదో ముఖ్యమైన డ్రా బ్యాక్.!