బిగ్‌బాస్ రియాల్టీ షోలో (Bigg Boss Telugu 3) టాస్క్‌లు ఒకింత ఫన్నీగా వుంటాయి. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టడం.. మళ్ళీ వాళ్ళంతా ఒకే చోట కలిసి వుండాలని చెప్పడం. ఈ పరిస్థితుల మధ్య దృఢంగా ఎవరు నిలబడగలిగితే, వారే విజేతలు. ఆగండాగంండీ.. దృఢంగా వాళ్ళు వున్నారని, జనం ఫీలయితేనే.. అలా పడ్డ పాజిటివ్ ఓట్లతో మాత్రమే బిగ్‌బాస్ రియాల్టీ షో విజేతలుగా నిలవగలరు.
తాజా టాస్క్ ‘గుడ్డు’ చుట్టూ డిజైన్ చేశారు. దాంతో ఆ ‘గుడ్డు’ని కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్ అంతా తమ శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి వచ్చింది. గత టాస్క్‌లో శ్రీముఖి కారణంగా గాయపడ్డ రవి కృష్ణకి టాస్క్‌లో పాల్గొనకుండా బిగ్‌బాస్ వెసులుబాటు కల్పించాడుగానీ, ‘బస్తీ మే సవాల్’ అంటూ అతనూ రంగంలోకి దిగాడు.
శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక షెరు, రోహిణి, పునర్నవి భూపాలం, మహేష్ విట్టా.. ఇలా అందరూ ‘గుడ్డు’ని కాపాడుకునే ప్రయత్నంలో కష్టపడ్డారుగానీ, చివరికి ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. ఆ ముగ్గురిలో రవికృష్ణ కూడా ఒకడు. అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్ మిగతా ఇద్దరూ. వరుణ్ షరామామూలుగానే తన అమాయకత్వంతో గుడ్డుని పోగొట్టుకున్నాడు.
అప్పటిదాకా గట్టిగా పోరాడిన వరుణ్ చిత్రంగా మహేష్ విట్టా చేతిలో దెబ్బతినేశాడు. చాకచక్యంగా వరుణ్ అప్రమత్తతో లేని సమయంలో మహేష్ గుడ్డు లాగేసుకున్నాడు. నీటిలో దూకినాగానీ పునర్నవి గుడ్డుని కాపాడుకోలేకపోయింది. వితికా షెరు చాలా గట్టిగా పోరాడి ఓడిపోవడం గమనార్హం. రోహిణి కూడా గట్టిగానే ఫైట్ చేసింది.
అందరిలోకీ చెత్త గేమ్ ఆడింది మాత్రం నూటికి నూరుపాళ్ళూ శ్రీముఖి అనే చెప్పాలి. డ్రాగన్ ఎగ్ అనీ, రాజ్యాలనీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఈ టాస్క్‌ని బిగ్‌బాస్ డిజైన్ చేయడం జరిగింది. ఫిజికల్‌గా పనిచెప్పే టీమ్ కావడంతో, ఒకర్నొకరు తోసుకోవడం, లాక్కోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినాగానీ, అందరూ గేమ్‌ని పెర్‌ఫెక్ట్‌గా ఆడేందుకు ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం.
బాబా భాస్కర్ కూడా తనదైన స్టయిల్లో గేమ్‌ని రక్తి కట్టించాడు. అషు రెడ్డి కూడా ఈసారి కాస్త కష్టపడినట్లు కన్పించింది. గాయం కారణంగా రవికృష్ణ పట్ల కొంత సానుభూతి చూపించారు హౌస్‌లో ఇతర హౌస్ మేట్స్ ఈ టాస్క్ వచ్చేసరికి. అయినాగానీ, రవి కృష్ణ టాస్క్‌లో నిలబడేందుకు బాగానే కష్టపడ్డాడు. అదీ ఒంటి చేత్తో.
ఈ టాస్క్‌కి (Bigg Boss Telugu 3) కొనసాగింపు కూడా వుంది. ఓ లెవల్ దాటారంతే. వితిక విషయంలో రాహుల్ చూపించిన సాఫ్ట్ కార్నర్‌ని అషు రెడ్డి క్వశ్చన్ చేయడం గమనార్హం. మరోపక్క రాహుల్ విషయంలో శ్రీముఖి చూపిన అత్యుత్సాహాన్ని రోహిణి ప్రశ్నించడంతో కాస్సేపు వాతావరణం హాట్ హాట్‌గా మారింది.
అయితే, అంతలోనే సర్దుకుంది. ఓవరాల్‌గా బిగ్‌బాస్‌లో ఈ గుడ్డు టాస్క్ ఒకింత ఫన్ ఇచ్చింది చూసే వ్యూయర్స్‌కి. వరుణ్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయినా, అతని అమాయకత్వమే అతని బలహీనత అని ఇంకోసారి తేలిపోయింది. ఇదే విషయాన్ని వితిక ప్రస్తావిస్తూ వరుణ్‌ని ఆటపట్టించడం గమనార్హం.