Bigg Boss Telugu 5 Vulgarity అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతోంది. కంటెస్టెంట్ల మధ్య ‘టాస్క్’ ముసుగులో గొడవలు పెట్టి, పైశాచికానందం పొందేవాడేనా బిగ్ బాస్ అంటే.? అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తేడాల్లేవంటాడు. ఎందుకుండవు.? ఎవరి శరీరాకృతి వారిది. ఒకరి మీద ఒకరు పడి కుమ్మేసుకోవడాన్ని ఏమనుకోవాలి.?
నిజానికి, ఈ తరహా కొట్లాట గత సీజన్లలోనూ కనిపించింది. అప్పటితో పోల్చితే, ఇప్పుడు మరీ అరాచకంగా తయారైంది పరిస్థితి. ఉమాదేవి అయితే ఏకంగా ప్రియాంక సింగ్‌ని లాగి కింద పడేసింది. కాదు కాదు, విసిరేసింది.. అదీ కాదు, లాగి.. విసిరేసి.. నేలకేసి కొట్టిందనడం సబబేమో.
Also Read: బిగ్ బాస్ రియాల్టీ ‘షో’ పెద్దలకు మాత్రమేనా.?
మహిళా కంటెస్టెంట్ల దుస్తుల్లో చేతులు పెట్టి మరీ మేల్ కంటెస్టెంట్లు ‘తమక్కావాల్సినవి’ లాక్కున్నారు. ఇదెక్కడి చోద్యం.? అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారమిది. ‘నేనిప్పుడు దాని గురించి పదే పదే మాట్లాడలేను. కెమెరాలలో రికార్డ్ అయి వుంటుంది కదా.. బిగ్ బాస్ చూసుకుంటాడు.. బిగ్ బాస్ తేల్చుతాడు..’ అంటూ సిరి హన్మంత్, సన్నీ మీద ఫైర్ అయిపోయింది.
ఒక్కరని కాదు.. చాలామంది కంటెస్టెంట్స్ తాము ఆడ, మగ అన్న సంగతి మర్చిపోయారు. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఇలాంటివే.. ఇంతకు మించిన కొట్లాటలు కావాలంటున్నారు బిగ్ బాస్ వీక్షకులు కొందరు. ఇంకొందరేమో, బిగ్ బాస్ స్థాయిని మరింత దిగజార్చేశారంటూ ‘షో’ చూడటం మానేస్తున్నారు.
ఫైవ్ మచ్ ఎంటర్‌టైన్‌మెంట్.. అంటే హోస్ట్ అక్కినేని నాగార్జున పదే పదే చెబుతున్నాడుగానీ.. ఇది ఫైవ్ మచ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు.. అంతకు మించి.. టెన్ మచ్.. హండ్రెడ్ మచ్ జుగుప్స.. అరాచకం (Bigg Boss Telugu 5 Vulgarity) కూడా. ఫిజికల్ టాస్క్ అయినంతమాత్రాన.. ముష్టియుద్ధాలకు దిగడమా.? ఆడా మగా కలబడిపోవడమా.?