బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణం వెనుక మిస్టరీ (CBI Enquiry On Sushant Death) ఎప్పుడు వీడుతుందో ఏమో.! తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించినప్పటికీ, సవాలక్ష అనుమానాలు సుశాంత్ మరణం చుట్టూ వినిపిస్తున్నాయి.
సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, పోలీసులను ఆశ్రయించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. మరోపక్క, సుశాంత్ (Sushant Singh Rajput) ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty), సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేసింది. ఆమె కోరుకున్నట్టే, ఇప్పుడు సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు సీబీఐ చేతికి వెళ్ళింది.
సుప్రీంకోర్టు ఈ విషయమై సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. సుశాంత్ మరణానికి కొంత కాలం ముందు నుంచీ రియా, అతనిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చిందనీ, అతని నుంచి భారీగా డబ్బు కొల్లగొట్టిందనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దాదాపు 15 కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలో సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి మాయమయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ డబ్బు అంతా రియా కొల్లగొట్టేసిందని సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు. మరోపక్క, సుశాంత్ సోదరి మద్యం మత్తులో తనతో ఓసారి అసభ్యకరంగా ప్రవర్తించిందనీ, ఆ తర్వాత నుంచే సుశాంత్ కుటుంబ సభ్యులతో వివాదాలు మొదలయ్యాయని రియా చక్రవర్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.
రియా చక్రవర్తి (Rhea Chakraborthy) సంగతి పక్కన పెడితే, పలువురు బాలీవుడ్ ప్రముఖులపైనా సుశాంత్ అభిమానులు, తమ అభిమాన హీరో మృతికి బాధ్యులంటూ ఆరోపిస్తుండడంతో ఇప్పటికే అందులో కొందరు ప్రముఖుల్ని పోలీసులు విచారించారు కూడా. ఇప్పుడు సీబీఐ విచారణ షురూ అవడంతో, మళ్ళీ వారందరినీ సీబీఐ విచారించే అవకాశాలూ లేకపోలేదు.
ఏదిఏమైనా, మంచి భవిష్యత్తు వున్న ఓ యంగ్ హీరో, అత్యంత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం దురదృష్టకరం. ‘బాలీవుడ్‌లో నెలకొన్న నెపోటిజం అనే విష సంస్కృతి సుశాంత్‌ని బలి తీసుకుంది’ అని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ ఆ దిశగానూ జరగాల్సి వుందన్నది చాలామంది సినీ ప్రముఖుల వాదన.
అయితే, కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. ఏదిఏమైనా, సుశాంత్ మర్డర్ మిస్టరీ (CBI Enquiry On Sushant Death) వీడాలి. ఆ దిశగా సీబీఐ, సుశాంత్ మరణం వెనుక అసలు కారణాన్ని బయటపెడ్తుందని ఆశిద్దాం.