Table of Contents
Chintamani Natakam.. ఎద్దు ఈనిందిరా.. అంటే దూడని కట్టేయమన్నాడట ఎనకటికొకడు.. ఎద్దు ఏంటీ.? ఈనడమేంటీ.? ఇప్పుడీ ప్రస్థావన ఎందుకంటే, ‘చింతామణి’ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నిషేధించారు. అసలు ఈ ‘చింతామణి’ కథేంటీ.? ఈ కథ చుట్టూ జరుగుతున్న వివాదమేంటీ.?
‘చింతామణి’ వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. 1937లో తమిళ నాట ‘చింతామణి’ అనే సినిమా వచ్చింది. అంతకన్నా చాలా ముందు అంటే 1920 నాటికే ‘చింతామణి’ నాటకం దాదాపు 500 సార్లు ప్రదర్శితమైంది. ‘చింతామణి’ ఓ సాంఘిక నాటకం.
‘చింతామణి’ని తెలుగులోనూ సినిమాగా తీశారు. ఆ సినిమాలో నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao), భానుమతి (Bhanumathi), రేలంగి (Relangi Narasimha Rao) తదితర మేటి నటులు నటించి మెప్పించారు.
Chintamani Natakam.. అసలేంటి కథ.?
వేశ్య మోజులో పడి, జీవితాన్ని నాశనం చేసుకునే వారి కళ్లు తెరిపించే గొప్ప కథాంశం ఇందులో వుంది. ‘చింతామణి’ ఓ పాత్ర ఇందులో. ‘బిల్వమంగళం’ మరో ప్రధాన పాత్ర. ‘సుబ్బిశెట్టి’ అనేది ఇంకో పాత్ర. ఇలా పలు పాత్రలు ఇందులో వుంటాయ్.
‘చింతామణి’ (Chinthamani) మోజులో పడి సుబ్బిశెట్టి, భవానీ శంకరుడు అనే ఇద్దరు వ్యక్తులు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. ఆర్ధికంగా నష్టపోతారు. ఆ తర్వాతి బాధితుడు బిల్వమంగళుడు. ఆస్థిని, సమాజంలో పేరు, ప్రఖ్యాతల్ని కోల్పోతాడు. చివరికి భార్యను కూడా కోల్పోతాడు. భార్యను కోల్పోవడం అనేది హృదయ విదారకమైన ఘటన.

ఓ వర్షపు రాత్రి దుంగను ఆసరాగా చేసుకుని, వాగు దాటి చింతామణి దగ్గరకు వెళతాడు బిల్వమంగళుడు. అక్కడికెళ్లాకా, ఓ తాడు సహాయంతో చింతామణి ఇంట్లోకి వెళతాడు. వాస్తవానికి తాడు కాదది.. పాము. దుంగగా దేన్నయితే ఉపయోగించాడో అది అతని భార్య పార్ధివ దేహం. వాస్తవం తెలుసుకుని బిల్వమంగళుడు కుంగిపోతాడు. ఆ తర్వాత ఆశ్రమ స్వీకారం చేసి ‘లీలాశుఖ యోగీంద్రుడు’గా మారి, ‘శ్రీ కృష్ణ కర్ణామృతం’ అనే సంస్కృత గ్రంధాన్ని రచిస్తాడు.
చింతామణికి కూడా శ్రీ కృష్ణ భగవానుడి ద్వారా జ్ఞానోదయం అవుతుంది. అలా ఆమె సన్యాసం స్వీకరిస్తుంది. తల్లి పెంపకం వల్ల చింతామణి వేశ్యా వృత్తిలోకి వస్తే, చెడు స్నేహాల వల్ల బిల్వ మంగళుడు జీవితాన్ని కోల్పోతాడు. ఇది ‘చింతామణి’ చెప్పిన సత్యం.
సినిమాల్లేవ్.. నాటకాలే వినోదం, విజ్ఞానం.!
ఇప్పట్లోలా అప్పుడు సినిమాలు లేవు కనుక, సమాజంలో కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనల ఆధారంగా నాటకాలు రూపొందాయి. వాటిల్లో కొన్ని చారిత్రక అంశాలు కూడా వుంటాయ్.
కానీ, ఇది కలికాలం. ‘చింతామణి’ (Chintamani Drama) నాటకంలోని మంచి క్రమంగా తెరమరుగైంది. బిల్వమంగళుడి పాత్ర ప్రాధాన్యం తగ్గింది. సుబ్బిశెట్టి చుట్టూ కొత్త కథ అల్లబడింది. ‘చింతామణి’ నాటకం అంటే చింతామణి, శుబ్బిశెట్టి మాత్రమే అయిపోయింది. బోలెడంత అశ్లీలత పెరిగిపోయింది.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
నేటి తరానికి అసలు నాటకం అంటేనే తెలియదు. నిజానికి నలభై, యాభయ్యేళ్ల క్రితమే నాటక రంగం పతనావస్థలోకి జారిపోవడం మొదలైంది. బూతులతో ‘చింతామణి’ని ఇంకా ఇంకా ముంచేశారు. సుబ్బిశెట్టి పాత్రకు పెరిగిన క్రేజ్, ఆ పాత్ర చుట్టూ మరింత ఛండాలం సృష్టించబడడానికి కారణం.
నిషేధించడం కాదు, పూర్వ వైభవం తీసుకురావాలి.!
నిజానికి ‘చింతామణి’ (Chinthamani Drama) నాటకాన్ని నిషేధించడం కాదు, దానికి పూర్వ వైభవం తీసుకురావాలి. అశ్లీలత జాడ లేని చింతామణిని నేటితరానికి పరిచయం చెయ్యాలి. అది మన నాటక రంగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. దురదృష్టం.. కొన్ని రాజకీయ అవసరాల కోసం ‘చింతామణి’ అనే అపూర్వమైన నాటక సంపద కాల గర్భంలో కలిసిపోతోంది.
చివరిగా, ఇంటర్నెట్‌లో అశ్లీలాన్ని బ్యాన్ చేయలేకపోతున్నాం. సమాజంలో ఎన్నో దురలవాట్లున్నాయ్. వాటినీ అడ్డుకోలేకపోతున్నాం. కానీ, మనోభావాల పేరుతో ‘చింతామణి’ని సమాధి చేయడం దురదృష్టకరం. ఓ రాజకీయ నాయకుడు అవినీతిపరుడనో, ఓ రాజకీయ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందనో.. మొత్తం రాజకీయ వ్యవస్థపై నిషేధం విధించలేం కదా.?