Chiranjeevi Anil Ravipudi Movie.. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న సినిమా లాంఛనంగా ’ఉగాది‘ పండుగనాడు ప్రారంభమైంది.
2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే సన్నాహాల్లో వున్నారు. సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాత. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. సుస్మితకి చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి.
Chiranjeevi Anil Ravipudi Movie.. క్లాప్ కొట్టిన వెంకటేష్..
విక్టరీ వెంకటేష్, ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై, తొలి క్లాప్ కొట్టారు. చిరంజీవి – వెంకటేష్ అత్యంత సన్నిహితులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి – వెంకటేష్ మధ్య సరదా సంభాషణ సాగింది. వెంకటేష్ తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు అయితే చిరంజీవిని ‘రాజా’ అని పిలిచేవారు.
ఇక, ఈ చిత్రానికి సంబంధించి బోల్డన్ని కథలు, రకరకాల టైటిళ్ళు ప్రచారంలో వున్నాయి. వాటిల్లో ’సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం‘ అనేది ప్రముఖంగా వినిపిస్తోన్న టైటిల్.
రఫ్ఫాడించేస్తారా మరి.?
సినిమా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వేసిన ట్వీటులోనూ ’రఫ్ఫాడిద్దాం‘ అనే ప్రస్తావన వుంది.
తాజాగా, దర్శకుడు అనిల్ రావిపూడి ఇంకో అడుగు ముందుకేసి, ’సౌండ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం‘ అంటూ ట్వీటేశాడు.. అదీ, చిరంజీవి ట్వీటుకి స్పందనగా.
సో, టైటిల్ ‘రఫ్ఫాడిద్దాం’ అనేది దాదాపుగా ఖాయమైపోయినట్లే. దానికి ముందు ‘సంక్రాంతికి’ అనే జోడింపు వుంటుందా.? వేచి చూడాల్సిందే.!
Also Read: హార్దిక్ పాండ్యా.! ఎందుకు చేతులెత్తేశావ్? అసలు నీకేమైంది?
ఇంతకీ, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.? ఒకరి కంటే ఎక్కువ హీరోయిన్లకు ఛాన్స్ వుంటుందా.? ఇలాంటి ప్రశ్నలకు ముందు ముందు సమాధానం దొరుకుతుంది.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికే ‘విశ్వంభర’ విడుదల కావాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.