అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చాయట. పవన్ కళ్యాణ్, చిరంజీవికి దూరమైపోయాడట. నాగబాబుకు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ద్వేషం కలిగిందట. అన్నయ్య మీద ఆగ్రహంతో తన పవర్ చూపించాలనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్ (Chiranjeevi Birthday Pawan Letter). పనీ పాటా లేని ఇలాంటి రాతలు ఎన్నో.. ఎన్నెన్నో. చిరంజీవి, అతని సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు మీద వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
చిరంజీవికి నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ్ముళ్లు మాత్రమే కాదు అంతకుమించి. పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా అంతే. అన్నయ్య ఫోటో పెట్టుకుని సినిమాల్లో ఎదగాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఏం చేసినా అన్నయ్య గౌరవం తగ్గకూడదు.. అనే ఆలోచిస్తారు. చిరంజీవి ప్రస్థావన వస్తే, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తండ్రి సమానుడు.. అనడం చూస్తుంటాం. గుండె లోతుల్లోంచి వచ్చే మాటలు ఇలానే ఉంటాయి.
మేం ముగ్గురం కలిసే ఉన్నాం.. అని ప్రతిసారీ నిరూపించుకోవల్సిన అవసరం ఏ అన్నదమ్ములకూ రాకూడదు. అలా వాళ్లు నిరూపించుకోవాలని ఆశించేవాడెవడూ అసలు మనిషే కాడు. అసలు విషయానికి వస్తే, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Birthday Pawan Letter) పట్ల తనకున్న అశేషమైన ప్రేమాభిమానాలు, భక్తి, గౌరవం చాటుకుంటూ, ఉద్వేగానికి లోనవుతూ, ఓ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో పంచుకున్నాడు.
ఆయన ఆకాశం.. నేనొక పరమాణువు
నేనొక చిరంజీవి స్ఫూర్తినందుకున్న లక్షలాది మంది యువతరంలో నేనొక పరమాణువును.. అనే మాట పవన్ కళ్యాణ్ నోట కాక ఇంకెవరి నుండైనా వినగలమా.? ఇది అన్నయ్య పట్ల తమ్ముడికి ఉన్న అసలు సిసలు భక్తి, గౌరవం.
నాకు స్ఫూర్తి ప్రధాత చిరంజీవిగారి జన్మదినం. అభిమానులందరికీ పండుగ రోజు. చిరంజీవిగారంటే కేవలం ఒక మెగాస్టార్ కాదు. మూర్తీభవించిన స్ఫూర్తి. అబ్ధుల్ కలాం గారు చెప్నిట్లుగా పెద్ద కలలు కనడం, ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపపడం అనే జీవన వేదానికి చిరంజీవి గారి ప్రస్థానం నిదర్శనం. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత, నిగర్వంగా, నిరాడంబరగా ఉండడం, తన మూలాలను మరిచిపోని స్పృహతో ఉండడం.. లాంటి విలువలకు ప్రతీక.
చిరంజీవి ఓ సందోహం.. ఆయన జీవితమొక సందేశం..
చిరంజీవి గారు.. తానే.. ఒక సందోహం. తన జీవితమొక సందేశం. ఆ సందేశాన్ని అంది పుచ్చుకున్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకు మించి ఆయనకు తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం. అన్నయ్య చిరంజీవి గారు నరసాపురంలో విద్యార్ధిగా ఎన్‌సీసీలో ఉన్న నాటి నుండీ, మద్రాసులో యాక్టింగ్ విద్యార్ధిగా ఉన్న రోజుల నుండి, ఇవాళ్లి వరకూ అదే ఉక్కు క్రమశిక్షణ. అదే స్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం.
అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురు దెబ్బలు. కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ, ఉన్నత శిఖాలకు ఎగబాకిన ధీరత్వం ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం. అనుసరణీయం.
ఇవాళ యావత్ భారతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసరుడు.. అగణ్య ధీరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆసేతు హిమనగమూ భళీ భళీయని ప్రతిధ్వనించేలాగా, ‘సైరా’ అంటూ ప్రజలకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరపున జన సైనికుల తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఆయన జీవితం, మరింత మందికి ఎప్పటికీ, స్ఫూర్తిదాయకంగానే ఉండాలని ఆశిస్తున్నాను.
ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవిగారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది.
అవును, మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ స్ఫూర్తి.. ఆయన ఆకాశం.. సాక్షాత్తూ.. పవన్ కళ్యాణే తనను తాను పరమాణువుతో పోల్చుకున్నారు చిరంజీవి అభిమానిగా. ఇకపై ఎప్పుడైనా, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలంటూ అడ్డగోలు రాతలు రాసే ధైర్యం ఎవరైనా చేయగలరా.?