Compulsory Vaccinations For Children.. ఒకప్పుడు పసి పిల్లల పొట్ట మీద, ఎర్రగా కాల్చిన ఇనుముతో వాతలు పెట్టేవారు.
అలా చేయడం వల్ల కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు రావనే మూఢ నమ్మకాలుండేవి.
అలాగని.. అన్నీ, మూఢ నమ్మకాలని అనలేం. కానీ, చాలా మూఢ నమ్మకాలు.. పసి పిల్లల్ని చిదిమేసేవి.
ఆధునిక వైద్యం, అందరికీ అందుబాటులోకి వచ్చాక.. చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది.
పోలియో వ్యాధినే తీసుకుంటే, ఇప్పుడు ఆ వ్యాధి జాడ పెద్దగా కనిపించడంలేదు. పోలియో వ్యాక్సిన్.. డ్రాప్స్ రూపంలో వేయడం మొదలయ్యాక, పెద్ద మార్పు కనిపించింది.
పసి పిల్లల్లో సాధారణంగా కనిపించే అనేక ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు సరైన పరిష్కారం. అందుకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా కొన్ని వ్యాక్సిన్లను అందిస్తున్నాయి.
అయినాగానీ, ఇంకా వ్యాక్సిన్ల విషయమై అపోహలు వున్నాయి.
అలాంటి అపోహలకు తావివ్వకూడదన్న కోణంలో, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ తెలుగు వైద్యులు (మానసిక వైద్య నిపుణులు) శ్రీకాంత్ మిర్యాల.. సోషల్ మీడియా వేదికగా కీలక అంశాల్ని ప్రస్తావించారు.
ఆయా టీకాలు, అవి వేసుకోకపోతే కలిగే అనర్థాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మాట కాస్త కఠినంగా వున్నా, ప్రతి మాటా వాస్తవం.
Compulsory Vaccinations For Children.. తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత..
పిల్లలకి భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్లు ఇస్తుంది. అన్నీ ఉచితంగా. అవి వేసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం.
బీసీజీ- ఇది క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్) రాకుండా ఆపుతుంది. క్షయ అంటే లోపల్నుంచి కొరుక్కుతినడం అని అర్థం. వేసుకోకపోతే మిలిటరీ ట్యుబర్సైలోసిస్ అని ఒకటి వస్తుంది.
అంటే మాములుగా ఊపిరితిత్తులో లేక ఎముకలో ఏదో ఒకదానికి వచ్చే క్షయ ఒళ్లంతా వస్తుంది అన్నమాట. వైద్యం చేస్తే నలుగుర్లో ఒకరు, చెయ్యకపోతే నలుగురికి నలుగురూ పోతారు ఇది వస్తే.
పోలియో- ఇది మీకు తెలిసిందే. ఈ చుక్కలు పోలియో రాకుండా నివారిస్తాయి. మన పక్క దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్న దృష్ట్యా మనదేశంలో కూడా ఇది ఇవ్వవలసిన పరిస్థితి.
ఇది సోకిన వందలో ఒకరికి శాశ్వత అంగవైకల్యం వస్తుంది. పక్షవాతం వచ్చిన పిల్లల్లో నోటికి ఒకరు చనిపోతారు, పెద్దలైతే పదిమంది చనిపోతారు.
టెటనస్ టాక్సాయిడ్- ఇది ధనుర్వాతాన్ని నివారిస్తుంది. ఇది వస్తే ఒళ్లంతా కట్ట కట్టేస్తుంది.
ఇది వచ్చిన పిల్లలు వైద్యం లేకపోతే నూటికి నూరుపాళ్లు చనిపోతారు. ఐసీయూలో వైద్యం చేస్తే ఐదుగురిలో నలుగురు బ్రతికే అవకాశం ఉంది.
హెపటైటిస్ బి- ఇది కామెర్లు రాకుండా నివారిస్తుంది. లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఒక్క 2019 లో ప్రపంచ వ్యాప్తంగా 8,20,000 మంది చనిపోయారు దీంతో.
చనిపోకుండా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కోకొల్లలు.
డిప్తీరియా- కంఠరోహిణి అంటారు. ఒకటే దగ్గు. శ్వాసనాళానికి అడ్డంగా ఒక పొర ఏర్పడి ఊపిరి ఆడక చచ్చిపోతారు పిల్లలు. సోకిన ఐదుగురిలో ఒకరు చనిపోతారు.
ఒకదాన్ని మించి ఇంకొకటి ప్రాణాంతకం..
పెర్టసిస్- కోరింత దగ్గు. ఇది కూడా బాగా చిన్నపిల్లలు దగ్గి దగ్గి చనిపోతారు. నూటికి ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది.
హిబ్ – బాక్టీరియా వలన మెదడు వాపు వ్యాధి రాకుండా నివారిస్తుంది. ఇది వస్తే ఐదుగురిలో ఇద్దరు చనిపోతారు.
న్యూమోకోక్కల్- నెమ్ము, మెదడువాపు వ్యాధి మొదలైనవి రాకుండా ఆపుతుంది. ప్రపంచంలో ఏటా పది లక్షలమంది చనిపోతున్నారు దీంతో.
రోటావైరస్- అతిసారం రాకుండా ఆపుతుంది. ఈ వైరస్ వలన వచ్చే అతిసారం వలన వచ్చినవాళ్ళలో నూటికి ముగ్గురు చనిపోతున్నారు.
ఇన్ఫ్లూయెంజా- నెమ్ము రాకుండా ఆపుతుంది. ఏటా ప్రపంచంలో మూడు నుంచి ఆరు లక్షలమంది చనిపోతున్నారు దీంతో. ఇందులో 90 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలే.
ఇవికాకుండా టైఫాయిడ్, గవదబిళ్లలు, మీజిల్స్ (ఆటలమ్మ), రుబెల్లా (మూడురోజుల తట్టు), గర్భాశయ క్యాన్సరు ఇలాంటివి రాకుండా మిగతా టీకాలు ఉన్నాయి.
Also Read: బంగారమ్.. భారతమ్.! 25 వేల టన్నుల గోల్డ్.. మనదే.!
ఈ టీకాల వలన పిల్లల్లో మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇవి లేకపోయుంటే ఎక్కువమంది అంగవైకలురు అయ్యేవాళ్లు. అలాగే భారతీయ ఆయుప్రమాణం కూడా ముప్ఫై నలభై లోపు ఉండిపోయేది.
వ్యాక్సిన్ల వలన ఆటిజం వస్తుందని కచ్చితమైన ఆధారాలు లేవు. ఆటిజానికి కారణాలు కోకొల్లలు, అయితే ఏదీ కూడా కచ్చితంగా కలుగజేస్తుందని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల్లో తేలలేదు.
కాన్స్పిరసీ సిద్ధాంతాలు నమ్మే మానసిక దుర్బలులు లేనిపోనివి ప్రచారం చేసి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు. ఆ మాయలో పడకండి.
జైహింద్.
– శ్రీకాంత్ మిర్యాల, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, ఆస్ట్రేలియా
