మనం ఎప్పుడైనా ఊహించామా.. ఇంట్లోంచి అసలు బయటకు రాలేని పరిస్థితి వస్తుందని.? ఒక వైరస్, ఓ మనిషి ఇంకో మనిషిని కలవనీయదని కనీసం కలగన్నామా.? ఇంగ్లీషు సినిమాల్లో చూసుంటాం కానీ, అది నిజమవుతుందని ఎవరూ (Corona Virus Deadliest Monster) అనుకోలేదు.
కానీ, 2020 ప్రపంచాన్ని గడగడలాడించేసింది. ‘హ్యాపీ న్యూ ఆయర్ 2020’ అంటూ సంబరాలు చేసుకున్నాం.. కానీ, ఆ 2020లోకి ఎంటర్ అయ్యాకనే తెలిసింది.. ఈ ఏడాది అత్యంత ప్రమాదకరమైనదని. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు కరోనా వైరస్ దెబ్బకి.
గబ్బిలాల నుంచి వచ్చిందా.? ఇంకేదన్నా జీవి నుంచి వచ్చిందా.? ల్యాబ్‌లలో తయారైందా.? అసలేంటీ కరోనా వైరస్.? ఇప్పటికీ, ఈ ప్రశ్నకు సరైన సమాధానమే దొరకలేదు. రోజులు గడిచిపోతున్నాయ్.. నెలలు గడిచిపోతున్నాయ్.. ఇంతవరకు కరోనా వైరస్ సోకినవారికి వైద్య చికిత్స చేసేందుకు సరైన మందు అందుబాటులోకి రాని పరిస్థితి.
వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్..
కానీ, వ్యాక్సిన్ వెంట పరుగులు పెడుతున్నాం. ఆ వ్యాక్సిన్‌ని ఎంత విశ్వసించగలం.? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేశాయి. ఇంతలోనే, కరనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (Covid 19 New Strain) కలకలం రేగుతోంది.
మరి, ఆ స్ట్రెయిన్‌ని కూడా ఇప్పుడు అందుబాటులో వున్న వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా? అంటే, మళ్ళీ సమాధానం లేని ప్రశ్నే ఇది. 2020 దాటేసి, 2021లోకి అడుగు పెట్టబోతున్నాం. తలుపు తియ్యాలంటేనే భయంగా వుంది.. 2020 నుంచి 2021లోకి అడుగు పెట్టడమంటే, ఏమో.. ఇంకెలాంటి కొత్త విపత్తుని మానవాళి చూడాల్సి వస్తుందోనన్న భయం.
‘కరోనా వైరస్.. ఇదే తొలి మహమ్మారి కాదు.. చివరిదీ కాదు..’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అయితే, ‘న్యూ నార్మల్’ అలవాటు చేసుకోవాల్సిందే.. ప్రపంచం ఇదివరకటిలా ఎప్పటికీ మరదని తెగేసి చెబుతున్నారు.
కొత్త జీవితం.. తప్పదంతే..
మాస్క్ లేకుండా బయటకు వెళ్ళలేం.. ఇప్పటిదాకా వున్న ఆంక్షల్ని సడలించుకుని, స్వేచ్ఛగా తిరగలేం.. అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం వున్నట్లే కనిపిస్తోంది. ‘ఇప్పుడున్నట్టే వున్నా కాస్తో కూస్తో నయమే.. మరింత భయంకరం అంటే ఊహించలేం..’ అంటూ మానవాళి బిక్కుబిక్కుమంటోంది.
ఒకరకంగా చెప్పాలంటే, ఇది స్వయంకృతాపరాధం. వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే అడ్డుకట్ట వేసి వుంటే, అది ప్రపంచానికి పాకేసి వుండేది కాదు.! కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. జరుగుతూనే వుంది. అత్యవసర వినియోగం కాదు.. అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్ వినియోగం అందుబాటులోకి రావాలి.. అదే సమయంలో, సరైన మందులూ (Corona Virus Deadliest Monster) అందుబాటులోకి రావాలి.
మానవాళి కోరుకుంటున్నది ఇదే. 2021 మొదట్లోనే ఆ ఉపశమనం (Corona Virus Deadliest Monster) మనందరికీ దక్కుతుందని ఆశిద్దాం.