Crime Investigation Law Punishment.. దేశంలో చట్టాలున్నాయా.? న్యాయ వ్యవస్థ సరిగ్గా పని చేస్తోందా.? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తరచూ చూస్తున్నాం.!
సామాన్యుల్లో పోలీస్ వ్యవస్థ పట్లా, న్యాయ వ్యవస్థ పట్లా తేలిక భావం పెరిగిపోవడానికి కారణాలనేకం.! దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో ‘తీర్పు’లు ఆలస్యమవడమే అందుక్కారణం.
తీర్పు త్వరగా వచ్చినా సమస్యే ఇక్కడ.! ప్రముఖులు అరెస్టయితే, పోలీస్ వ్యవస్థ అలానే న్యాయ వ్యవస్థ మీద విమర్శలు.. ఆ ప్రముఖులకు బెయిల్ వచ్చినా, అదే పద్ధతి.!
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పటికీ, ఆ హత్య కేసులో అసలు దోషులెవరన్నది తేలలేదు.
అంతకన్నా ముందెప్పుడో తెరపైకొచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఏళ్ల తరబడి విచారణ ‘కొనసాగడం’తోనే సరిపోతోంది.!
Crime Investigation Law Punishment.. సినీ ప్రముఖుల కేసుల్లోనూ..
చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్.. ఇలా, చాలామంది సినీ ప్రముఖులపై కేసులు ఇటు పోలీస్ వ్యవస్థపైనా అటు న్యాయ వ్యవస్థపైనా.. విమర్శలకు తావిచ్చాయి.
మలయాళ సినీ పరిశ్రమలో ఓ నటిపై లైంగిక దాడి, ఆ కేసులో ప్రధాన నిందితుడికి ఇటీవల లభించిన క్లీన్ చిట్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
‘నిందితుడిపై నేరం నిరూపించలేకపోయారు’ అంటూ, న్యాయస్థానం తేల్చి చెప్పింది. దాంతో, నిందితుడికి ‘క్లీన్ చిట్’ లభించినట్లయ్యింది.
ఈ కేసుకు సంబంధించి, బాధితురాలు తనకు పూర్తి న్యాయం జరగలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఓ కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించారనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: రఫేల్ కంటే తేజస్ శక్తివంతమైన యుద్ధ విమానమా.?
ఇక్కడో ముఖ్యమైన విషయం ప్రస్తావించుకోవాలి. చట్టాల్లోని లొసుగుల్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నారు కొందరు. అదే సమయంలో, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి.. విచారణ సంస్థలపై ఒత్తిడి.. వెరసి, కేసుల విచారణ ముందుకు సాగడం లేదన్నది బహిరంగ రహస్యం.!
రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక, తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి, నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకుంటాయి.
పోలీస్ వ్యవస్థలో ఖాళీల మాటేమిటి.? సీబీఐ వంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. న్యాయ వ్యవస్థలో ఖాళీల భర్తీ వ్యవహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇన్ని సమస్యల నడుమ.. ఇచ్చట న్యాయం జరగదు.. నేరం నిరూపించబడదు.. అనే అసహనం, నేటి సమాజంలో పెరిగితే, అందులో వింతేముంది.?
– yeSBee
