ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ (Dream 11 IPL 2020) త్వరలో ప్రారంభం కాబోతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ షురూ కాబోతోంది.. బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులకు లభించనుంది. నిజానికి, ఈపాటికి సీజన్ ముగిసిపోయి వుండాలి. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన విషయం విదితమే.
ఈసారి ఐపీఎల్, యూఏఈలో జరగబోతోంది. టైటిల్ స్పాన్సర్ కూడా మారడం గమనార్హం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ‘వివో’ సంస్థను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పించిన దరిమిలా, కొత్త టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 దూసుకొచ్చింది.
ఇవన్నీ ఓ ఎత్తు.. జట్లు, ఐపీఎల్ కోసం ఎలా సమాయత్తమవుతాయి.? మైదానంలో ఐపీఎల్ హోరు ఎలా వుంటుంది.? అభిమానులు ఇదివరకటిలా ఐపీఎల్‌ని ఆదరిస్తారా.? లేదా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఐపీఎల్, విదేశాల్లో జరగడం ఇదే కొత్త కాదు.
కానీ, కరోనా నేపథ్యంలో పరిస్థితులు మారాక, భారత క్రికెటర్లు ఆడుతున్న తొలి క్రికెట్ సీజన్ ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కరోనా భయాలు తొలగిపోలేదు. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు, ఐపీఎల్‌లో పాల్గొంటారు. దాంతో, ఏ క్షణాన కరోనా ఎవరి మీద ఎలా దాడి చేస్తుందో చెప్పలేం.
ఏ ఆటగాడైనా సీజన్ మొదటి నుంచి చివరి దాకా జట్టుకి అందుబాటులోనే వుండగలడా.? అన్నదానిపైన భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఐపీఎల్ పోటీల్ని నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రాక్టీస్ కోసమే చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కానీ, మైదానంలోకి ఆటగాళ్ళు వెళ్ళాక పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పలేం. కరోనా నేపథ్యంలో కొత్త నిబంధనలు ఖచ్చితంగా వుంటాయి. వాటికి అనుగుణంగా ఆటగాళ్ళు నడచుకోవాల్సి వుంటుంది. బంతికి ఉమ్మిని రుద్దడం అనేది ఇప్పటికే నిషేధం. ఆట మధ్యలో ఆటగాళ్ళ ఆలింగనాలు సాధ్యమవుతాయా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
మంచి ఫావ్‌ులో వున్న ఆటగాడు కరోనా బారిన పడితే, ఆ జట్టు పరిస్థితి ఏంటో మరి.! కెప్టెన్ గనుక కరోనా బారిన పడితే అంతే సంగతులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి. అయినాగానీ, ఐపీఎల్ అత్యద్భుతంగా జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సగటు క్రికెట్ అభిమాని కూడా అదే ఆశిస్తున్నాడు.
ఏదిఏమైనా ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఐపీఎల్ (Dream 11 IPL 2020) అత్యద్భుతంగా జరగాలని ఆకాంక్షిద్దాం.