Home » డైనమిక్‌ సీఎం: జనం మెచ్చిన జ’గన్‌’

డైనమిక్‌ సీఎం: జనం మెచ్చిన జ’గన్‌’

by hellomudra
0 comments

జగన్‌ అనే నేను.. అంటూ ముఖ్యమంత్రి (YS Jagan Dynamic Chief Minister) అవ్వాలనే ఆశతో, అనేక ఆశయాలతో వైఎస్‌ జగన్‌ పదేళ్లపాటు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. పదేళ్ళు వెనక్కి వెళితే, కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రస్థానం మొదలైన వైనం గుర్తుకు వస్తుంది. చూస్తుండగానే పదేళ్ళు గడిచిపోయాయ్.

ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పని చేసిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకుంటే, దాన్ని సాధించడం సాధ్యమేనని వైఎస్ జగన్ మరోసారి నిరూపించారు. పదేళ్ల రాజకీయ జీవితంలో వైఎస్‌ జగన్‌, వందేళ్ల రాజకీయ అనుభవం సంపాదించారనడం అతిశయోక్తి కాదు.

ఎందుకంటే, ఈ పదేళ్లలో వైఎస్‌ జగన్‌ ఎదుర్కొన్నన్ని రాజకీయ ఇబ్బందులు బహుశా ఏ రాజకీయ నాయకుడు దేశంలో ఇప్పటిదాకా ఎదుర్కొని ఉండడేమో. అంతలా ఎన్నో ఎత్తుపల్లాల్ని వైఎస్ జగన్ చవిచూశారు.. నిలదొక్కకున్నారు.. ఇప్పుడు డైనమిక్ సీఎం అనే స్థాయికి ఎదిగారు.

అసలు కథ అప్పుడే మొదలైంది.. (YS Jagan Dynamic Chief Minister)

తండ్రి మరణానంతరం వారసత్వంగా ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ నియోజక వర్గాలుంటే, 150 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశమొచ్చినా, వదులుకున్న వైఎస్‌ జగన్‌ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు ప్రజలతో మమేకమవడానికే ఇష్టపడ్డారు.

ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, మరీ ముఖ్యంగా 16 నెలల జైలు జీవితం వెరసి జగన్‌ చాలా నేర్చుకున్నారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షనేతగా రాటు దేలారు. ప్రతీసారీ పరిస్థితులకు ఎదురెళ్లిన వైఎస్‌ జగన్‌, ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అసలు పాద యాత్ర ఎలా చేస్తాడు అని చాలా మంది వెక్కిరిస్తే, పాదయాత్ర ఇలా చేయాలి.. అని తెలుగునాట సరికొత్త చరిత్రను లిఖించారాయన.

మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ కాదు.. ప్రజలతో వాక్ (YS Jagan Dynamic Chief Minister)

ఉదయం మార్నింగ్‌ వాక్‌, సాయంత్రం ఈవినింగ్‌ వాక్‌ అనే విమర్శలకు ప్రజలు సరైన సమాధానమే ఇచ్చారు. అది ప్రజల కోసం వాక్‌ అనీ, ప్రజా వాక్కును ప్రతిబింబించే వాక్‌ అనీ తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. 2014లో అవే అవినీతి ఆరోపణలు. 2019లోనూ అదే కథ.

ఒకసారి పచ్చ కథలు విన్న జనం, రెండోసారి మాత్రం ఆ కథల్లోని పసుపు పైత్యాన్ని గుర్తించారు. వైఎస్‌ జగన్‌ని అధికార పీటమెక్కించారు. రాత్రికి రాత్రి జరిగిపోయిన అద్భుతం కాదిది. పదేళ్ల శ్రమ. లెక్కలేనన్ని ప్రజా పోరాటాలు, కుప్పలు తెప్పలుగా అవమానాలు.. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. అవన్నీ గతం. ఇప్పుడు జగన్‌ అనే నేను.. అంటూ పాలకుడి అవతారమెత్తుతున్నారు వైఎస్‌ జగన్‌.

అవే వైఎస్ జగన్ ముందున్న సవాళ్ళు..

నవరత్నాలు కావచ్చు, ఇంకా కుప్పలు తెప్పలుగా ఇచ్చిన ఇతర ఎన్నికల హామీలు కావచ్చు.. ఇవన్నీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌కి సంకటంగా మారతాయా.? చెప్పలేం. ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి చూస్తే, దేవుడు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేడు అనే అభిప్రాయం కలగడం సహజమే.

ఖజానా నిండడంలో కీలక భూమిక పోషించే, మధ్యం అమ్మకాలపై నియంత్రణా, నిషేధం కూడా వైఎస్‌ జగన్‌ (YS Jagan Dynamic Chief Minister) ఎన్నికల హామీల్లో ఉంది. మరి ఆ ఆదాయంపై వేటు పడితే, తద్వారా మరింత దిగజారే ఏపీ ఆర్ధిక పరిస్థితికి ప్రత్యామ్నాయమేది.?

ఇదొక్కటే కాదు, పోలవరం ప్రాజెక్ట్‌, పెన్షన్లు, రాజధాని నిర్మాణం, అభివృద్ది సంక్షేమ పథకాల కొనసాగింపు.. ఇలాంటివన్నీ కొత్త ముఖ్యమంత్రి మెడకి గట్టిగా చుట్టుకోబోతున్నాయి. మరి, ఈ సమస్యల సుడిగుండం నుండి జగన్‌ గట్టెక్కుతాడా.?

పూల బాట కాదు, ముళ్ళ బాట..

ముందే చెప్పుకున్నాం కదా.. జగన్‌ ఒకప్పుడు ముఖ్యమంత్రి కుమారుడిగా పూల బాటలో నడిచి, ఎంపీగా లోక్‌సభకు ఎంపికై ఉండొచ్చు. కానీ, ముఖ్యమంత్రి పదవిని మాత్రం తనకు తానుగా సంపాదించుకున్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చుకున్నారు. ముళ్ల బాటలో నడిచారు. పార్టీ ఫిరాయింపుల దెబ్బకి కుదేలైనా, తిరిగి కోరుకున్నారు.

ఎవరూ తన వెంట లేనప్పుడే తండ్రిని కోల్పోయిన పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ (Ys Jaganmohan Reddy), కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకకాలంలో ఎదర్కొని ధైర్యంగా నిలబడ్డారు. కాబట్టి, ముఖ్యమంత్రి పదవి అనే ముళ్ల కిరీటాన్ని వైఎస్‌ జగన్‌ చిరునవ్వుతోనే తన నెత్తిన పెట్టుకోగలరు. దాన్ని పూల కిరీటంగా మార్చుకోగల సత్తా ఆయనకుంది.

ఆల్ ది బెస్ట్ టు యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అద్భుత విజయాల్ని అందుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించాలనీ Mudra369 ఆశిస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group