2019 ఎలక్షన్స్ రిజల్ట్స్: లైవ్ అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్ (2019 Elections Results Live Updates) కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మే 30వ తేదీన వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
మరోపక్క, ప్రస్తుత ముఖ్యమంత్రి (2019 Elections Results Live Updates), తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాస్సేపట్లో గవర్నర్ నరసింహన్‌కి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలున్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్, అసెంబ్లీలో అడుగు పెడతారా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా నగిరిలో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించే దిశగా రోజా దూసుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే సృష్టిస్తోంది. ఎక్కడా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల జాడ కన్పించడంలేదు.
పవన్ కళ్యాణ్ అభిమానులకి నరాలు తెగే ఉత్కంఠ..
నరాలు తెగిపోతున్నాయ్.. టెన్షన్ భరించలేకపోతున్నారు.. గాజువాకలో పవన్ గెలిచేశారంటూ మొదట అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత డీలాపడ్డారు. భీమవరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ గెలిచారనీ, గబ్బర్ సింగ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేయడమే కాదు, భీమవరం నియోజకవర్గంలో ముందస్తు పండగ కూడా చేసుకున్నారు. కానీ, ఇంకా అక్కడ కౌంటింగ్ పూర్తి కాలేదు.. పవన్ కళ్యాణ్ ఇంకా వెనుకబడే వున్నారని సాయంత్రం 5 గంటల సమయానికి తేలుతున్న వాస్తవం.
పులివెందులలో వైఎస్ జగన్ విజయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jaganmohan Reddy) పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, పాముల పుష్పశ్రీవాణి తదితరులు విజయం సాధించారు.
సినీ నటి సుమలత ఘనవిజయం
కర్నాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి సుమలత విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, సినీ నటుడు నిఖిల్ గౌడ నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. అయితే, తన భర్త దివంగత నటుడు, మాజీ మంత్రి అంబరీష్ ఇమేజ్ ఆమెకు బాగా కలిసొచ్చింది.
నగిరిలో మళ్ళీ వికసించిన రోజా
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో మళ్ళీ గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటి రోజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా 2014లో ఆమె శాసనసభ సభ్యురాలిగా గెలిచిన సంగతి తెల్సిందే. ఈసారి కూడా ఆమె గట్టి పోటీ ఎదుర్కొన్నా, సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆమెకు వైఎస్ జగన్ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే.
కుప్పంలో చంద్రబాబు విజయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), సొంత నియోజకవర్గం కుప్పంలో విజయం సాధించారు. కానీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రపదేశ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితం కావాల్సి వుంటుంది. ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడానికి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తోంది.
మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి గెలుపు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో సంచలనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy), లోక్ సభ ఎన్నికల్లో్ మాత్రం ఘనవిజయాన్ని అందుకున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులతోపాటు, రేవంత్ రెడ్డి అభిమానులూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. మరో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) సైతం నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఘనవిజయాన్ని అందుకోవడం గమనార్హం. ఈయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
ఓడిపోయిన ప్రకాష్ రాజ్ (2019 Elections Results Live Updates)
సినీ నటుడు ప్రకాష్ రాజ్, తన సొంత రాష్ట్రం కర్నాటక నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిలిసిందే. బెంగళూరు సెంట్రల్ నుంచి ఆయన పోటీ చేశారు. ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పొలిటికల్ పంచ్ లు బాగానే పేల్చినప్పటికీ, ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా, ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు.
