థియేటర్లలో విడుదలవ్వాల్సిన సినిమా, ఓటీటీలో విడుదలయ్యింది కరోనా కారణంగా. కానీ, ట్రైలర్‌లోనే దాదాపు మేటర్ చెప్పేశారు. ఆ ట్రైలర్‌ని (Ek Mini Katha Review) ఇంట్లో పిల్లలు చూసేశారు కూడా. అంతకు మించి సినిమాలో పెద్ద మేటర్ ఏమన్నా వుందా.? అంటే, ఏమీ లేదనే చెప్పాలి.
అసలు ‘ఏక్ మినీ కథ‘ (Ek Mini Katha Review) ఎలా వుంది.? తనకు వున్న ‘చిన్న’ సమస్య, ఎంత పెద్దదిగా మారింది.? ఆ సమస్య నుంచి అతనెలా బయటపడ్డాడు.? ఇంకెందుకు ఆలస్యం.. విశేషాలు తెలుసుకుందాం పదండిక.
సంతోష్ అనే ఓ కుర్రాడికి ‘చిన్న’ప్పటినుంచీ ఓ సమస్య వుంటుంది. తన తల్లి తనను ప్రేమగా ‘చిన్నా’ అని పిలిస్తే చిరాకు పడిపోతాడతడు. కారణం ‘చిన్న’తనమే. తోటి స్నేహితుడు, స్కూల్‌లోనే తన ‘చిన్న’తనం గురించి పెద్ద మాట మాట్లాడి పరువు తీసేస్తాడు. అక్కడి నుంచి ఆ ‘చిన్న’తనం గురించి తలచుకుంటూ ఆందోళన చెందుతాడు. అసలు ఆ ‘చిన్న’తనం సంగతేంటి.? అది నిజంగానే పెద్ద సమస్య అవుతుందా.? అన్నది మిగతా కథ.
చిన్న కథ కాదు.. పెద్దలకు మాత్రమే చూపించాల్సిన కథ..
కొంతమంది కుర్రాళ్ళలో సహజంగానే వుండే మానసిక సమస్య ఇది. దీన్ని ఫన్నీ యాంగిల్‌లో చెప్పాలని దర్శకుడు అనుకున్నాడు. ఓటీటీ ట్రెండ్ కావడంతో కంటెంట్ కూడా బాగా పనికొస్తుందనే ఆలోచన చేశాడు. అయితే, ఈ కథకి కావాల్సినంత హాట్ అప్పీల్ సినిమాలో అయితే చూపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలన్న కోణంలో అడల్ట్ కంటెంట్‌ని డైల్యూట్ చేస్తూ.. అటూ ఇటూ కాకుండా పోతుందని దర్శకుడు ఊహించలేకపోయాడు.
హీరో సంతోష్ శోభన్ మాత్రం చాలా బాగా చేశాడు. హీరోయిన్ కావ్య థాపర్ కూడా వున్నంతలో బాగానే నటించి మెప్పించింది. కానీ, ఆమెకు స్కోప్ తక్కువ ఇచ్చాడు దర్శకుడు. ఇంకాస్త రొమాంటిక్ టచ్ ఈ సినిమాకి ఇచ్చి వుంటే, ఖచ్చితంగా మంచి సినిమానే అయి వుండేదేమో యూత్ ఆడియన్స్ వరకు.
మరీ ముఖ్యంగా హీరో – హీరోయిన్ మధ్య ట్రాక్స్ ఎక్కువగా వుండి వుండాల్సింది. కానీ, ఆ స్థానంలో అనవసరమైన నస ఇరికించేశాడు దర్శకుడు. అదే సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది.
లీడ్ పెయిర్ కోసం సినిమా చూడాలని, సినిమా పూర్తయ్యాక అనిపించినా, సెకెండాఫ్ నస భరించడం కొంచెం కష్టం. సెకెండాఫ్ ఎంత కత్తిరించేసినా ఉపయోగం లేనట్టు తయారైంది పరిస్థితి.
ఓ సరదా పాయింట్.. ఆ పాయింట్‌కి న్యాయం చేయగల నటీనటులు, కామెడీ పండించే హాస్య నటులు.. అన్నీ వున్నా, రచన – దర్శకత్వంలో పొరపాట్లు, గందరగోళం సినిమా గ్రాఫ్‌ని తగ్గించేశాయని చెప్పొచ్చేమో. శ్రద్ధా దాస్ పాత్ర పూర్తిగా అనవసరం.. అనిపించేస్తుంది. ఇంట్లో బంధువుల నస కూడా తగ్గించేసి వుండాల్సింది.
యువతని టార్గెట్ చేశానని దర్శకుడు అనుకుని ఈ పాయింట్ ఎంచుకుంటే, ఆ యువత కోసం రొమాంటిక్ సన్నివేశాల్ని బాగా ప్లాన్ చేసి వుంటే బావుండేది. ఓటీటీ కాబట్టి ఓకే. ఇదే సినిమా థియేటర్లలో అంటే భరించడం కష్టమే. అన్నట్టు, పాటలు బాగా తీశారు. వాటిల్లో హీరో హీరోయిన్లు చాలా బ్రైట్‌గా కనిపించారు. సుదర్శన్ నవ్వులు పూయించాడు. సప్తగిరి కాస్సేపు రిలీఫ్. బ్రహ్మాజీ తన అనుభవాన్ని రంగరించాడు.
కథ చిన్నదే.. చాలా క్రిస్పీగా ప్రెజెంట్ చేయాల్సిన సినిమాని.. (Ek Mini Katha Review) సాగదీసేసి.. పెద్ద సినిమా (లెంగ్త్ పరంగా) మార్చేశారు. అదే సినిమాకి పెద్ద సమస్య అయిపోయింది.