ప్రివ్యూ: ‘యాత్ర’

 ప్రివ్యూ: ‘యాత్ర’

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి (Mammooty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యాత్ర’ (Yatra Preview). దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) కాంగ్రెస్‌ (Congress Party) నేతగా వున్న సమయంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ పాదయాత్రని ఇప్పుడు సినిమాగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ (Praja Prasthanam) పాదయాత్ర అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు ఓ చారిత్రక ఘట్టం. తెలంగాణలోని చేవెళ్ళ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది.

ఆనాటి ఆ పాదయాత్ర తాలూకు విశేషాల్ని సినిమాగా తెరకెక్కించడమంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అంతటి బృహత్‌ కార్యాన్ని భుజానికెత్తుకున్నాడు యంగ్‌ డైరెక్టర్‌ మహి వి రాఘవ (Mahi V Raghav). విజయ్‌ చిల్లా (Vijay Chilla), దేవిరెడ్డి శశి (Devireddy Sashi) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 8న ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

యాత్ర – ఓ చరిత్ర (Yatra Preview)

‘సినిమాలో రాజకీయ అంశాలు కేవలం 30 శాతమే వుంటాయి, మిగతాదంతా ఎమోషన్‌ చుట్టూనే సాగుతుంది’ అని దర్శకుడు మహి వి రాఘవ్‌ అంటున్నాడు. ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన ‘యాత్ర’ను తెరకెక్కిస్తూ, అందులో రాజకీయాలు తక్కువగా వుంటాయని అంటే ఎలా?

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రపై చాలా రాజకీయ విమర్శలొచ్చాయి. వాటిని చూపించకుండా, కేవలం ‘ఎమోషన్స్‌’ ఆధారంగా సినిమా నడిపించడం అన్న మాటే నమ్మ శక్యంగా అన్పించడంలేదు. అయితే, సినిమా విడుదలకు ముందు తాను ఈ మాట చెప్పి ఎవర్నీ మభ్యపెట్టలేననీ, తాను వాస్తవమే చెబుతున్నానని మహి వి రాఘవ చెబుతుండడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మామూలుగా బయోపిక్‌లో అన్నీ నిజాలే వుంటాయనుకోవడం పొరపాటు. నిజాలు కొన్ని, నిజంలా అనిపించేవి కొన్ని బయోపిక్‌లో వుంటాయని మహి వి రాఘవ్‌ అసలు విషయాన్ని చెప్పేశాడు. బయోపిక్‌ అయినా సినిమాటిక్‌ లిబర్టీ తప్పనిసరి. లేకపోతే, అది మామూలు సినిమాలా కాకుండా, జస్ట్‌ డాక్యుమెంటరీలా మిగిలిపోతోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంత ఉపయోగం? (Yatra Preview)

ఇటీవల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్రతో పోల్చితే ఇంకా సుదీర్ఘంగా సాగింది ఈ ప్రజా సంకల్ప యాత్ర. అయితే, రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకీ జగన్‌ పాదయాత్రకీ చాలా తేడాలున్నాయి. ప్రత్యేక కారణాలతో ప్రతి శుక్రవారం జగన్‌ తన యాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది.

జనంలో మమేకమయ్యే తీరు విషయంలోనూ జగన్‌కీ, వైఎస్సార్‌కీ తేడాలున్నాయంటారు ఆయన అభిమానులు. ఆ తేడాల సంగతి పక్కన పెడితే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈ ‘యాత్ర’ సినిమా పొలిటికల్‌ మైలేజ్‌ పెంచుతుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.

నిజానికి ‘యాత్ర’ ప్రేక్షకులు దాదాపుగా వైఎస్సార్సీపీ అభిమానులే వుంటారేమో. అందుకే, ఓ ఎన్నారై అమెరికాలో ఈ సినిమా చూసేందుకోసం ఏకంగా 6116 డాలర్లను వెచ్చించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా నాలుగు లక్షల ముప్ఫయ్‌ ఏడు వేల రూపాయలు.

‘ప్రత్యర్థులపై’ రాజకీయ విమర్శలు వుండవా?

‘రాజశేఖరా.. నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు’ అని ఓ పాత్రధారి వైఎస్‌ పాత్రధారిని ఉద్దేశించి డైలాగ్‌ చెబుతాడు. ఈ ఒక్క డైలాగ్‌ చాలు, సినిమాలో రాజకీయం ఏ స్థాయిలో వుందో చెప్పడానికి.

‘ప్రజాభిమానం ముందు పదవులు ఎంత?’ అని అర్థం వచ్చేలా వైఎస్‌ పాత్రధారి అయిన మమ్ముట్టి చెప్పే డైలాగ్‌ కూడా రాజకీయ ప్రాధాన్యత కలిగి వున్నదే. అయితే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరి ప్రస్తావనా ఇప్పటిదాయా ‘యాత్ర’ (Yatra Preview) ప్రోమోస్‌లో కన్పించడంలేదు. బహుశా ఇది పబ్లిసిటీ స్ట్రాటజీ అయి వుండొచ్చునన్న అభిప్రాయాలున్నాయి.

మమ్ముట్టి, అనసూయ, జగపతిబాబు…

‘యాత్ర’ సినిమాలో చెప్పుకోదగ్గ నటీనటులే వున్నారు. మమ్ముట్టి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడమే ఓ చారిత్రక ఘట్టం అనుకోవాలేమో. అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రో కన్పిస్తోంది. జగపతిబాబు, వైఎస్సార్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో నటిస్తుండడం గమనార్హం.

పాదయాత్ర, వైఎస్‌ మరణం.. ఈ అంశాల చుట్టూనే కథ సాగుతుందని మహి వి రాఘవ్‌ చెప్పిన దరిమిలా, అందరి ఆసక్తీ జగన్‌ పాత్రపై పడింది. అది మాత్రం ఇప్పటికి సస్పెన్సే. వైఎస్‌ మరణానికి సంబంధించి ఆయన కుటుంబమే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన దరిమిలా, మహి వి రాఘవ్‌ ఆ అనుమానాలకు ఈ సినిమా ద్వారా నివృత్తి ఏమన్నా కల్పించాడా? అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే.

Digiqole Ad

Related post

Leave a Reply