సీక్రెట్ ఏమీ లేదు.. చెప్పడానికి కొంత ఇబ్బందికరం అంతే. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ (Uppena) సినిమా క్లయిమాక్స్ ఏంటి.? అంటే, దాని గురించి మాట్లాడుకోవడం కష్టమే. అలాగే, ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha Shocking Concept Like Uppena) అంటూ తెరకెక్కుతోన్న సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
అసలు విషయం ఏంటన్నది, హీరో తన స్నేహితుడితోనూ, డాక్టర్‌తోనూ చెబుతాడు.. దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. అదేంటన్నది అందరికీ అర్థమయిపోయే వుంటుంది. హీరోగారికి ఓ చిన్న సమస్య వుంది. కాదు కాదు, చాలా పెద్ద సమస్య. ‘చిన్న’దే ‘పెద్ద’ సమస్య అయ్యిందిక్కడ.
మరి, ఆ సమస్య పెట్టుకుని హీరోయిన్‌తో ఎలా ప్రేమలో పడతాడు.? ఆ తర్వాత ఏమవుతుందన్నది అసలు సినిమా. అన్నట్టు, ‘నువ్వు పనిచేసే చోట అమ్మాయిలతో జాగ్రత్త’ అని తండ్రి, తన కొడుకుని హెచ్చరిస్తాడు. ‘అక్కడ అమ్మాయిలెవరుంటారు.? వర్కర్స్ తప్ప..’ అంటాడు హీరో. దానికి హీరో తండ్రి ఇచ్చే రియాక్షన్ ఇంకో లెవల్‌లో వుంది.
‘పేపర్ బాయ్’ ఫేం సంతోష్ శోభన్ (Santosh Sobhan) హీరోగా నటిస్తున్న సినిమా ఇది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్. ‘సైజుతోనే సమస్య’ అని చూపించడానికి సినిమా పోస్టర్స్ కూడా ‘స్కేల్’ కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. హీరో మరీ అమాయకంగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ గడుసుగానే కనిపిస్తోంది.
సరే, సినిమా ఎలా వుంటుంది.? అన్న ప్రశ్న పక్కన పెడితే, కొత్త కాన్సెప్టుల ముసుగులో ఏవేవో కథలు వచ్చేస్తున్నాయి. ‘ఇది చిలిపితనం, ఇది జుగుప్సాకరం’ అన్న తేడాలేమీ లేవు. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలొచ్చేస్తున్నాయ్.. కొన్ని ఆడుతున్నాయి, కొన్ని ఓడుతున్నాయి.
చెప్పే కథలో (Ek Mini Katha Shocking Concept Like Uppena) జెన్యూనిటీ వుంటే, ఖచ్చితంగా హిట్టవుతుంది.. ఆ కాన్సెప్ట్ ఎంత కొత్తగా వున్నా.. అదెంత ఇబ్బందికరమని ముందస్తుగా విమర్శలు వచ్చినా. అందుకు ‘ఉప్పెన’ సినిమానే నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే తొలి సినిమా ‘ఉప్పెన’తో అంత పెద్ద సాహసం చేశాక.. పెద్ద విజయాన్ని అందుకున్నాక ఈ తరహా సినిమాలు పోటెత్తకుండా వుంటాయా.?
అయితే, ఈ సాహసాలు ఇంతకు ముందూ జరిగాయి.. కానీ, ఉప్పెన మాత్రం హృదయానికి హత్తుకునేలా వుంది. మరి, ‘ఏక్ మినీ కథ’ ఏమవుతుందో!