Ethanol Petrol Fuel India.. పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో, వంద శాతం పెట్రోల్ వుండటం లేదు.. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌నే ప్రస్తుతం వాడుతున్నాం.
అంటే, కల్తీ పెట్రోల్ అనే కదా అర్థం.? ఔను, కల్తీ పెట్రోలే.. కాకపోతే, ఇది అధికారిక కల్తీ. సరేగానీ, ఇథనాల్ కలుపుతున్నారు కాబట్టి, రేటు తగ్గాలి కదా.? అంటే, ఛాన్సే లేదు.
వంద శాతం పెట్రోల్ కావాలంటే, అదనంగా ఖర్చు చేయాల్సందే.. అని కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి.
సుమారుగా 165 రూపాయలు లీటరుకి ఖర్చు చేస్తే తప్ప, వంద శాతం పెట్రోల్ మార్కెట్‌లో దొరికేలా కనిపించడంలేదు. కొన్ని పెట్రోల్ బంకుల్లోనే, ఈ ప్రీమియం పెట్రోల్ దొరుకుతోంది.
మరి, వాహనాలు ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్ కారణంగా చెడిపోతున్నాయి కదా.? అంటే, అది మీ ఖర్మ.. మీ చావు మీరు చావండి.. అంటోంది కేంద్రం.
కొత్తగా తయారయ్యే వాహనాలు, ఇ20 పెట్రోల్‌కి అనుగుణంగానే రూపొందుతున్నాయి. అద్గదీ అసలు సంగతి. మరి, పాత వాహనాల పరిస్థితో.? ముందే చెప్పుకున్నట్లు ఎవరి ఖర్మ వారిదే.
ఓ వినియోగదారుడు తన కారు పాడైపోవడంపై కోర్టును ఆశ్రయిస్తే, వాహనాన్ని తయారు చేసిన సంస్థకి జరీమానా విధించింది న్యాయస్థానం.
దేశంలో పెట్రోల్ కార్లు, బైకుల వినియోగదారులంతా కోర్టును ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది.? ఏమో, అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇంతకీ, ఈ ఇథనాల్ ఎందుకు వాడుతున్నాం.? త్వరలో ఈ85 పెట్రోల్ కూడా అందుబాటులోకి రాబోతోంది కదా.? ముందు ముందు వంద శాతం ఇథనాల్‌తోనే వాహనాలు నడుస్తాయా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
ఎందుకు ఇథనాల్ అంటే, పెట్రోల్ కోసం విదేశాల మీదనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో, పెట్రోల్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు కదా.?
నిజానికి, ఇథనాల్ తయారీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సో, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల లాభదాయక వ్యవహారం కాదు.
అయినాగానీ, తప్పదు.. వేరే దేశాల మీద.. అందునా గల్ఫ్ దేశాలు, అమెరికా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు, పూర్తిగా ఇథనాల్ బేస్డ్ వాహనాలు అందుబాటులోకి వస్తే.
ఇప్పటికప్పుడు ఈ ఇథనాల్ వ్యవహారం వాహనదారులకు కష్టంగానే వుండొచ్చు. కానీ, భవిష్యత్ ఒకింత సానుకూలంగా వుంటుందనే ఆశాభావం అయితే లేకపోలేదు.
చూద్దాం.. ఏం జరుగుతుందో.!
