Table of Contents
Fake Swamiji సాములందు దొంగ సాములు వేరయా.! ఔను, స్వామీజీల ముసుగులో బోల్డంతమంది దొంగ స్వాములు కనిపిస్తారు.
నిజానికి, దొంగ స్వామీజీలే అధికం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మానవాళి శ్రేయస్సు కోరే స్వామీజీలు చాలా చాలా తక్కువమందే వుంటారు.
‘నేనే దేవుడ్ని..’ అని ఏ స్వామీజీ చెప్పినా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. దేవుడి సేవకు అంకితమయ్యేవారు నిఖార్సయిన స్వామీజీలు. దేవుడి పొటో వెనకాల పెట్టుకుని.. ఆ దేవుడికి వెన్ను చూపిస్తూ, జనంతో మాట్లాడేవాడ్ని దేవుడని ఎలా అనుకోగలం.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
ఏదీ సామీ ఈ రాజకీయం.?
ఓ స్వామీజీ తాజాగా మీడియా ముందుకొచ్చి, ‘మాకు రాజకీయాలు పడవు.. మేం రాజకీయాలు చేయం..’ అని తెగేసి చెప్పాడు. అసలు స్వామీజీలు రాజకీయాలు చేయడమేంటి సిగ్గు లేకపోతే సరి.! కానీ, స్వామీజీలే ఇప్పుడు రాజకీయాల్ని శాసిస్తున్నారు.
ఔను, స్వామీజీల దగ్గరే రాజకీయ నాయకుల సొమ్ములు సేఫ్‌గా వుంటున్నాయి. అక్కడే దాస్తున్నారు రాజకీయ నాయకులు తాము ఆర్జించిన అక్రమ సంపాదనని. కోటాను కోట్ల రూపాయలు స్వామీజీల ఆశ్రమాల్లో దాయడం వెనుక ‘సెక్యూరిటీ’ అనేది కీలకమైన అంశం.
ఇదిలా వుంటే, స్వామీజీల చుట్టూ రాజకీయ నాయకులు తిరుగుతారా.? లేదంటే, ఆ స్వామీజీలని రాజకీయ నాయకులే పుట్టిస్తారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. రెండూ జరుగుతాయిక్కడ.
స్వామీజీలు తమ భక్తులకి ఫలానా పార్టీకి ఓటెయ్యండని ఉపదేశించిన సందర్భాలు కోకొల్లలు.
Fake Swamiji.. అయినా స్వామీజీలకు ఆ ఆర్భాటాలెందుకు.?
అసలు స్వామీజీల ఆశ్రమాలకు కోట్ల రూపాయలతో హంగులెందుకు.? దేవుడి ఆశీర్వాదం పేదోడికైనా, గొప్పోడికైనా ఒకేలా వుండాలి. కానీ, ఆ దేవుడి సేవ చేస్తున్నామని చెప్పుకునే స్వామీజీలు సామాన్యులకు కనిపించరు.. డబ్బున్నోళ్ళకి మాత్రమే ఈ దొంగ స్వామీజీల ‘ఆశీర్వచనాలు’ లభిస్తాయ్.!
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. చెప్పేటోడు సిద్ధాంతి.. అంటారు.! కానీ, ఇక్కడ వినేటోడు అమాయక భక్తుడైతే, చెప్పేటోడు దొంగ స్వామీజీ.. అనాలేమో.!
స్వామీజీల మీద ఆరోపణలు రావడమట, వాటిని స్వామీజీలు ఖండించడమట.. ఈ క్రమంలో కొందరు స్వామీజీలు తమలో తాము కొట్టుకోవడమట, అడ్డగోలు ఆరోపణలు చేసుకోవడమట. ఏం ఖర్మ పట్టిందిరా సామీ.. హిందూ దర్మానికి.!
జనాల అమాయకత్వమే స్వామీజీలకు ఆక్సిజన్.!
ఆత్మ లింగాలంటూ మోసాలు చేసేవాళ్ళు.. నిమ్మకాయలతో మ్యాజిక్కులు చేసేవాళ్ళు.. అహో, మోసపోయేవాళ్ళుంటే, మోసం చేయడానికి చాలామందే వున్నారు స్వామీజీల రూపంలో.
Also Read: పెద్దాయనా.! అట్టా ఎట్టా సచ్చిపోయినవ్.!
స్వామీజీల చుట్టూ డబ్బున్నోళ్ళే ఎందుకు తిరుగుతారు.? ఆ డబ్బున్నోళ్ళకే స్వామాజీల నుంచి ప్రత్యేకమైన ‘సౌకర్యాలు’ ఆశీర్వచనాల పేరుతో ఎందుకు లభిస్తాయి.? వంటి ప్రశ్నలకు సమాధానం వెతకగలిగితే ఎవడు దొంగ స్వామీజీ అన్నది తేలిపోతుంది.
మోసపోయేవాడున్నంతకాలం మోసాలు జరుగుతూనే వుంటాయి.! మోసం చేసేవాడిది (Fake Swamiji) మాత్రమే కాదిక్కడ తప్పు.. అమాయకత్వంతోనే అయినా మోసపోయేవాడిదే అసలు తప్పంతా.!