పబ్ జీ సహా పలు చైనా యాప్‌లను ఇటీవల కేంద్రం బ్యాన్ చేయడంతో, పబ్ జీ (FauG Replaces PubG) ప్రియుల కోసం ఓ సరికొత్త బ్రాండ్ ఇండియా యాప్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఫౌజి’. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఏదో ఆషామాషీ గేమ్ కాదట ఈ ’ఫౌజి‘. ‘పబ్ జి’తో అస్సలు పోల్చకూడదట దీన్ని. ఇది పూర్తిగా స్వదేశీ గేమ్. పైగా, ఇది మన సాయుధ దళాల గొప్పతనాన్ని తెలియజేసేలా వుంటుందట. అక్షయ్‌కుమార్ ఓ రేంజ్‌లో దీన్ని ప్రమోట్ చేసేస్తున్నాడు. ఈ గేమ్ ద్వారా వచ్చే సొమ్ములో 20 శాతం సొమ్ముని ‘భారత్ కా వీర్ ట్రస్ట్’కి అందజేస్తారట.
ఈ మేరకు సోషల్ మీడియాలో అక్షయ్‌కుమార్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. గేమ్ ‘ఫౌజి’ పోస్టర్‌ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశాడు అక్షయ్‌కుమార్. బెంగళూరుకి చెందిన ఎన్‌కోర్ గేమ్స్ సంస్థ దీన్ని రూపొందించడం గమనార్హం. దీనికి అక్షయ్‌కుమార్ మెంటార్.
ఇక, అక్షయ్ ప్రకటనను చాలామంది ఆహ్వానిస్తోంటే, కొందరు మాత్రం తప్పుపడుతున్నారు. ఈ తరహా గేమ్స్ ద్వారా చిన్న పిల్లలు, యువత ‘వ్యసనపరుల్లా’ తయారవుతున్నారన్నది ఆ కొందరి ఆరోపణ. కానీ, ‘ఫౌజి’ టీమ్ మాత్రం, దీన్ని ‘పబ్ జి’తో ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చొద్దని చెబుతోందట.
‘ఫౌజి – ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్’ పేరుతో దీన్ని రూపొందించిన నిర్వాహకులు, ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రచారం భారతీయతను ప్రతి ఒక్కరిలోనూ ఉప్పొంగేలా చేస్తున్నా, ఈ తరహా ‘ఆటలు’ అస్సలేమాత్రం మంచివి కావన్న భావన చాలామందిలో కన్పిస్తోంది.
సామాజిక బాధ్యత తనకు చాలా ఎక్కువని చెప్పుకునే అక్షయ్‌కుమార్, ఇలాంటివాటిని ప్రమోట్ చేయడం అస్సలేమాత్రం బాగాలేదన్నది వారి అభిప్రాయం. ఎవరి గోల వారిదే. చైనా యాప్స్ మీద మనం ఆధిపత్యం చెలాయించాలంటే, ఇలాంటివి తప్పనిసరి.
పైగా, మన దేశం నుంచి ఇలాంటి యాప్స్ అండ్ గేమ్స్ గనుక ఇబ్బడిముబ్బడిగా రాని పక్షంలో.. వేరే ఏ దేశానికి చెందిన యాప్స్ పట్ల అయినా ‘పబ్ జి’ ప్రియులు ఆకర్షితులయ్యే అవకాశం కూడా లేకపోలేదు.