Table of Contents
ఫోర్బ్స్ (Forbes) 2018 లిస్ట్ బయటకు వచ్చింది. ఇండియాలో ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల లిస్ట్‌లో టాప్ ఛెయిర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి (Salman Khan) దక్కింది. టాలీవుడ్ నుంచి నెంబర్ వన్ స్థానం పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ (Forbes Pawan Kalyan) దక్కించుకున్నాడు.
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ‘రౌడీ’ విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) టాప్ 100 లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. టాప్ టెన్ లిస్ట్‌లో మన తెలుగు సినీ ప్రముఖులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
నెంబర్ వన్ సల్మాన్‌ఖాన్
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు బుల్లితెరపై వ్యాఖ్యాతగా పలు షోలు.. ఇవి కాక, వాణిజ్య ప్రకటనలు.. ఇవీ సల్మాన్ ఖాన్ సంపాదనా మార్గాలు. బుల్లితెరపై అత్యధిక పారితోషికాలు, సినీ నటుడిగా రికార్డు స్థాయి రెమ్యునరేషన్.. వెరసి, సల్మాన్‌ఖాన్‌ని సంపాదన పరంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. మొత్తం 253.26 కోట్లతో సల్మాన్‌ఖాన్ టాప్ ఛెయిర్‌ని దక్కించుకున్నాడు. సినీ ప్రముఖుల్లో నెంబర్ టూ స్థానం అక్షయ్‌కుమార్‌కి దక్కింది. అక్షయ్‌కుమార్ 185 కోట్లతో మొత్తం లిస్ట్‌లో మూడో స్థానం దక్కించుకున్నాడు.
కింగ్ కోహ్లీదే నెంబర్ టూ
టాప్ 100 లిస్ట్‌లో నెంబర్ టూ పొజిషన్ కింగ్ కోహ్లీదే. క్రికెటర్‌గా, పలు ప్రోడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) సంపాదన అత్యద్భుతం. మొత్తంగా అతని సంపాదన 228.09 కోట్లు అని ఫోర్బ్స్ తేల్చింది. మరో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra singh Dhoni) కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే, ధోనీ స్థానం 5, సంపాదన 101.8 కోట్లు. క్రికెటర్లలో రెండో స్థానం. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడండోయ్. అతనిది 9వ స్థానం.
వయసు మీద పడ్తున్నా సంపాదనలో మొనగాడే!
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan).. బాలీవుడ్ మెగా స్టార్.. బిగ్-బి.. సంపాదనలో మేటి. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు ప్రకటనలు, మరో వైపు బుల్లితెర.. ఇలా అమితాబ్ సంపాదన కోసం ఎంచుకుంటున్న మార్గాలు అన్నీ ఇన్నీ కావు. 100 కోట్లకు జస్ట్ 4 కోట్ల దూరంలో మాత్రమే నిలిచాడు. అమితాబ్ బచ్చన్ సంపాదన 96.17 కోట్లు కాగా, టాప్ 100లో అమితాబ్ ర్యాంక్ 7. అమితాబ్ కంటే ముందున్నాడు అమీర్‌ఖాన్. అమీర్‌ఖాన్ ర్యాంకు 6 కాగా, సంపాదన 97.5 కోట్లు.
టాప్ టెన్‌లో కొత్త జంట
బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే (Deepika Padukone), బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh).. ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం విదితమే. ఈ ఇద్దరికీ ఫోర్బ్స్ లిస్ట్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కింది. రణ్‌వీర్ సింగ్ కంటే, దీపికా పడుకొనేది మెరుగైన ర్యాంక్. దీపికది నాలుగో ర్యాంక్ కాగా, రణ్‌వీర్ సింగ్ 8వ స్థానం దక్కించుకున్నాడు. దీపిక సంపాదన 112.8 కోట్లు కాగా, రణ్‌వీర్ 84.67 కోట్లతో లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. అజయ్ దేవగన్‌కి 10వ స్థానం దక్కింది. అతని సంపాదన 74.5 కోట్లు.
ప’వన్’ కళ్యాణ్ – నెంబర్ వన్ (Forbes Pawan Kalyan)
పేరులోనే ‘వన్’ వుంది మరి.. అందుకే పవన్‌కళ్యాణ్, ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడా.! అది సబబు కాదేమో. కోట్ల కొలదీ సంపాదన వచ్చే సినీ రంగాన్ని వదిలేసి, పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఈ ఏడాది పవన్‌కళ్యాణ్ హీరోగా ఒకే ఒక్క సినిమా వచ్చింది. అదే ‘అజ్ఞాతవాసి’ ఆ సినిమా పరాజయం పాలయ్యింది. అయినా, సంపాదనలో పవన్ టాలీవుడ్ నుంచి టాప్ పొజిషన్ దక్కించుకోవడం గమనార్హం. ఓవరాల్ లిస్ట్‌లో పవన్ ర్యాంక్ 24.
నెంబర్ టూ ఎన్టీఆర్, నెంబర్ త్రీ మహేష్
టాలీవుడ్ నుంచి ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ప్రముఖుల్లో పవన్‌ది మొదటి స్థానం అయితే, రెండో స్థానంలో ఎన్టీఆర్ (Young Tiger NTR) (ఓవరాల్ ర్యాంక్ 28) నిలిచాడు. మూడో స్థానంలో మహేష్‌బాబు (Super Star Mahesh Babu) (ఓవరాల్ లిస్ట్‌లో 33వ ర్యాంక్) వున్నాడు. పవన్ (Forbes Pawan Kalyan) సంపాదన 31.33 కోట్లు కాగా, ఎన్టీఆర్ సంపాదన 28 కోట్లు, మహేష్‌బాబు 24.33 కోట్లు సంపాదించారని ఫోర్బ్స్ చెబుతోంది. నాగార్జున (ర్యాంక్ 36) ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు 22.25 కోట్లతో. చిత్రంగా దర్శకుడు కొరటాల శివ (ర్యాంక్ 39) 20 కోట్లతో ఓవరాల్ లిస్ట్‌లో 39వ స్థానం దక్కించుకోగా, అల్లు అర్జున్‌కి 15.67 కోట్లతో 64 వస్థానం దక్కింది.
రౌడీతో మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ఈ ఏడాది ‘రంగస్థలం’ (Rangasthalam) హిట్‌తో మంచి జోరు మీదున్నాడు. అతని సంపాదన 14 కోట్లు కాగా, ఫోర్బ్స్ లిస్ట్‌లో 72వ స్థానం దక్కింది. ఇదే స్థానంలో ‘రౌడీ’ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా నిలిచాడు. చరణ్‌లానే 14 కోట్ల సంపాదనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు విజయ్ దేవరకొండ.
ఏదిఏమైనా, ఈ లిస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిస్ట్‌లో ప్రభాస్ పేరే లేకపోవడం, మరికొందరు ప్రముఖులు సంపాదనలో దూసుకుపోతున్నా వారికి చోటు కల్పించకపోవడం గురించిన చర్చ జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, లిస్ట్‌లో ముందున్న హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.