‘ఇలా బంధించబడి వుంటానని అనుకోలేదు. నన్ను దయచేసి బయటకు పంపెయ్యండి..’ అని మొన్నటికి మొన్న తొలి వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జునని బతిమాలుకుంది గంగవ్వ (Gangavva Worrying In Bigg Boss Telugu 4). కానీ, ‘నువ్వు హౌస్‌లో వుండాలో, వద్దో తేల్చేది ప్రేక్షకులే’ అని పాత మాటే చెప్పాడు కింగ్ నాగ్.
అయితే, హౌస్‌లో ఆ తర్వాతి నుంచీ గంగవ్వ జస్ట్ ‘గెస్ట్ రోల్’ పోషిస్తూ వస్తోంది. క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం దెబ్బతింటూ వస్తోన్న విషయం అందరికీ అర్థమవుతోంది. తాజా ఎపిసోడ్‌లో గంగవ్వ చాలా నీరసంగా, భయం భయంగా కనిపించింది. ‘నేను ఇక్కడ వుండలేను.. నీ కాల్మొక్తా బాంచన్..’ అంటూ కన్ఫెషన్ రూములో బిగ్‌బాస్‌ని అత్యంత దయనీయంగా వేడుకోవడం అందరికీ కంటతడి పెట్టించేసింది.
‘డాక్టర్లున్నారు.. నీ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు..’ అంటూ బిగ్‌బాస్ ఆమెకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో గంగవ్వను ఇంకా ఆ ఇంట్లో అలాగే బంధించి వుంచడం ఎంతవరకు సబబు.? అని గంగవ్వ సపోర్టర్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.
షో నియమ నిబంధనలు ఎలా వున్నాసరే, మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఓ కంటెస్టెంట్ తాను ఆ హౌస్‌లో వుండలేను మొర్రో.. అని మొత్తుకుంటోంటే, ఇంకా ఎందుకు అందులో వుంచడం.? మరోపక్క, ‘గంగవ్వా వెళ్ళి పడుకో.. ఎవరి గోలా లేని చోట పడుకో.. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోం..’ అని కంటెస్టెంట్స్ చెబుతోంటే, ‘మీరంతా నా దగ్గర వుంటేనే నాకు కొంచెం ధైర్యంగా వుంటుంది’ అని గంగవ్వ చెప్పడం గమనార్హం.
ఆమె మానసికంగా ఎంత ‘వీక్’ అయిపోయిందో ఈ మాటలే సాక్ష్యం. నో డౌట్, గంగవ్వకి బోల్డంత ఫాలోయింగ్ వుంది. హౌస్‌లో ఆమె వుండడం నిర్వాహకులకి అవసరం.. కారణం ఆమెకున్న ఫాలోవర్సే. కానీ, ఆమె ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన విషయం కదా.
‘నాగ్‌ని బతిమాలితే కుదరదన్నాడు.. బిగ్‌బాస్‌ని ఉద్దేశించి ‘నీ కాల్మొక్తా బంచన్’ అని వేడుకున్నా ససేమిరా అన్నాడు..’ అంటూ బిగ్‌బాస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కొత్త వివాదాలకు తావిచ్చేలా వుంది.