Table of Contents
గౌతమ్ గంభీర్.. (Gautam Gambhir) ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు భారత క్రికెట్ అభిమానులకు బోల్డంత ధైర్యం వచ్చేది.. ఎంతటి క్లిష్టతరమైన మ్యాచ్‌లో అయినా టీమిండియాని (Team India) గెలిపించేయగలడని.!
దూకుడుతోపాటు, నిలకడ కలిగిన బ్యాట్స్‌మెన్ అయిన గంభీర్, క్రీజ్‌లో వున్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు హడల్. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు గంభీర్ బ్యాటింగ్‌కి బెంబేలెత్తేవారు. క్రీజ్‌లో కుదురుకుపోవడంలో అయినా, బంతిని బలంగా హిట్ చేయడంలో అయినా గంభీర్ దిట్ట.
అవును, గౌతమ్ గంభీర్ మ్యాచ్ విన్నర్. లేకపోతే, గంభీర్ బ్యాట్ నుంచి 10 వేల పరుగులకు పైగా ఎలా దూసుకొస్తాయి. టీమిండియాకి గంభీర్ కారణంగా అద్భుతమైన విజయాలు ఎలా అందుతాయి. టీమిండియాకి అద్భుతమైన ఓపెనర్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.. టీమిండియాకి అపూర్వ విజయాల్ని అందించాడు.
సౌరవ్ గంగూలీకే తప్పలేదు..
ఫామ్‌లో వున్నప్పుడు ఆకాశానికి ఎత్తేయడం, ఫామ్ కోల్పోతే పాతాళానికి తొక్కేయడం క్రికెట్‌లో మామూలే. సౌరవ్ గంగూలీ (Saurav Ganguly) లాంటి పవర్ వున్న క్రికెటర్‌కే తప్పలేదు.. గౌతమ్ గంభీర్‌కి తప్పుతుందా.? ఒక్కసారి ఫామ్ కోల్పోయాడన్న అభిప్రాయం రాగానే, గంభీర్‌ని పక్కన పడేశారు.
ఫామ్ లేకపోవడం అనేది తాత్కాలికమేననీ, ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో మళ్ళీ దూకుడు ప్రదర్శిస్తాడనీ అందరికీ తెలుసు. కానీ, గంభీర్‌కి ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. అవకాశాల స్థానంలో అవమానాలు ఎదురొచ్చాయి.
రిటైర్మెంట్.. భావోద్వేగం..
రిటైర్మెంట్ ప్రకటిస్తూ, తీవ్రమైన భావోద్వేగానికి గౌతమ్ గంభీర్ లోనయ్యాడు. నన్ను ప్రతిసారీ ‘అవమానం’ వెక్కిరించేది.. అయినాసరే, పుంజుకోవాలనుకున్నాను. ఈ క్రమంలో మళ్ళీ అవమానాలే ఎదురయ్యాయి.
‘నువ్విక పనికిరావు..’ అనే ఆత్మన్యూనత కలిగిన ప్రతిసారీ సత్తా చాటేందుకు ప్రయత్నించారు.. దురదృష్టవశాత్తూ ఓడిపోయానేమో. కానీ, టీమిండియాకి అద్భుతమైన విజయాల్ని అందించాననే తృప్తి ముందు ఆ అవమానాలు, ఆత్మన్యూనత.. అన్నీ ఓడిపోతాయ్.. అని గంభీర్ పేర్కొన్నాడు.
నిజమైన ఫైటర్ గంభీర్
గంభీర్ అంటే ఫైటర్. ప్రత్యర్థి సవాల్ విసిరిన ప్రతిసారీ, సత్తా చాటేవాడు. వన్డే, టెస్ట్, టీ20.. ఇలా ఏ ఫార్మాట్ అయినా గంభీర్ రూటే సెపరేటు. మైదానంలో ఎలా ఫైట్ చేశాడో, మైదానంలోకి వెళ్ళేందుకూ అలాగే ఫైట్ చేయాల్సి వచ్చింది.
ఆ ఫైటర్ గొప్పతనమేంటో, రిటైర్మెంట్‌ని ఆయన ప్రకటించాకనే అందరికీ తెలిసొచ్చింది. ‘నీ విజయాలు ఇవీ.. నీ గొప్పతనం ఇదీ..’ అని ప్రతి ఒక్కరూ ఇప్పుడు గంభీర్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ పొగడ్తల్ని గంభీర్ కోరుకోలేదు.. టీమిండియా జెర్సీ వేసుకుని.. మైదానంలో పౌరుషం చాటాలనుకున్నాడు. కానీ, క్రికెట్‌లో రాజకీయాలకు అతని కెరీర్ బలైపోయింది.
నిన్న మిథాలీ రాజ్.. నేడు గౌతమ్ గంభీర్.. (Gautam Gambhir)
క్రికెట్‌లో సమ అన్యాయం జరుగుతోందనడానికి మిథాలీ రాజ్‌పై (Mithali Raj) ఇటీవల కీలకమైన సమయంలో వేటు వేయడమే నిదర్శనం. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
నిజానికి, ఇలా క్రికెట్‌కి అవమానకర రీతిలో దూరమైనవారెందరో వున్నారు. కొందరి పేర్లు మాత్రమే బయటకొస్తుంటాయి. ‘ఆణిముత్యాలు’ అనదగ్గ క్రికెటర్లు.. తక్కువ కాలంలోనే క్రికెట్ తెర నుంచి మాయమైపోయారు. అతి కొద్ది మంది మాత్రమే, సత్తా చాటుతున్నారు. కొందరు కొంతకాలం నిలదొక్కుకున్నా.. అవమానకర రీతిలో.. ఇదిగో, ఇలా బయటకు రావాల్సి వస్తోంది.
ఈ రాజకీయానికి మందు వుందా.?
క్రికెట్‌లో రాజకీయాలు ఓపెన్ సీక్రెట్. అబ్బే, రాజకీయాలేమీ లేవని క్రికెట్ పెద్దలు బుకాయించొచ్చుగాక. కానీ, ఆ రాజకీయాలు క్రికెట్‌ని సర్వనాశనం చేసేస్తున్నాయి. తమ పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా, జట్టు కోసం.. దేశం కోసం.. క్రికెట్‌ని దైవంగా భావించే ఎందరో క్రికెటర్లు అవమానాలకు గురవుతున్నారు. క్రికెట్ పెద్దలు, పండితులు.. ఈ విషయమై ఒకటికి వందసార్లు పునరాలోచించుకోవాల్సిందే.