Ghee Adulteration Laddu Prasadam.. కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసు విచారణ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ‘సీబీఐ – సిట్’ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన దరిమిలా, అందులోని వివరాలపై సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
కల్తీ జరిగిందనేది ఓ వాదన. కల్తీ జరిగి వుండొచ్చుగానీ.. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా జంతువుల కొవ్వుని నెయ్యిలో వాడలేదని తేలింది.. అన్నది మరో వాదన.
ఇక్కడ విషయం సుస్పష్టం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడబడింది.
Ghee Adulteration Laddu Prasadam.. వైఎస్సార్సీపీ వితండవాదం..
కానీ, నెయ్యిలో కల్తీ కోసం జంతువుల కొవ్వు వాడలేదు.. అంటూ, వితండవాదం తెరపైకొచ్చింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నుంచి.
వైఎస్సార్సీపీ హయాంలోనే కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. పాలను వాడకుండా, కెమికల్స్ ఉపయోగించి నెయ్యి తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదే అంశాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీటులోనూ ప్రస్తావించినట్లు వార్తా కథనాల్ని చూస్తున్నాం.
సో, కల్తీ జరిగినట్లే కదా.. జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టి, కల్తీ జరగలేదంటూ వైసీపీ చేస్తున్న వితండవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
హత్య జరిగిందిగానీ..
అంటే, హత్య జరిగింది.. కాకపోతే, అందరూ ఆరోపిస్తున్నట్లు గొడ్డలితో నరికి చంపలేదు.. పదునైన కత్తితో గొంతు కోసి చంపేయడం జరిగింది.. అన్నట్లుంది వ్యవహారం.
లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది. అది మహా పాపం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. దీన్ని ముమ్మాటికీ, హిందూ సమాజంపై జరిగిన కుట్ర పూరితమైన దాడిగానే చూడాలి.
హిందువుల మనోభావాల్ని దెబ్బ తీయడం.. అలాగే, హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బ తీయడం.. అనే స్పష్టమైన.. అత్యంత కుట్ర పూరితమైన ఆలోచనలతోనే లడ్డూని కల్తీ చేయడం జరిగిందన్నమాట.
