Table of Contents
తెలుగింట గోంగూరకు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.? గోంగూర (Gongura Kichen Queen) అనే పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. గోంగూరను ఇష్టపడని తెలుగు వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంటల్లో ఎలాగైనా ఇట్టే ఇమిడిపోతుంది గోంగూర. గోంగూర అంటే, కేవలం ఓ ఆకు కూర మాత్రమే కాదు.. అనేక పోషకాల నిధి.. అని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, గోంగూర విచ్చల విడిగా అందుబాటులోకి వస్తుంది. సీజనల్‌గా వచ్చేది కదా.. ఖచ్చితంగా తినాల్సిందే. పైగా వానా కాలం వంటకాల్లో గోంగూరకి మరింత ప్రత్యేకత వుందండోయ్.
రోగనిరోధక శక్తిని పెంచుతుందిలా..
ఇక గోంగూరలో రుచే కాదు, పోషకాలూ అధికంగానే ఉంటాయి. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి అనే మాట అందరికీ బాగా అలవాటైపోయింది. ఆ రోగ నిరోధక శక్తిని పెంచే ఐరన్ గోంగూరలో అత్యధిక శాతం ఉంది.
Also Read: ఆయుర్వేద వైద్యం VS మోడ్రన్ మెడిసిన్.!
గోంగూర తింటే వేడి చేస్తుందన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ, దీనిలోని ఐరన్ శరీర ఉష్ణోగ్రతను సమ పాళ్లో ఉంచేందుకు దోహదం చేస్తుంది. సో ఓవర్ హీట్ చేస్తుందన్న అనుమానం తూచ్ అని చెప్పాలి.
బాలింతలకు ప్రత్యేకం..
మీకు తెలుసా.? 100 గ్రాముల గోంగూరలో 46 కెలోరీలు ఉంటాయట. బాలింతలకు గోంగూర వేడి చేస్తుందని అస్సలు పెట్టరు. కానీ, బాలింతలు గోంగూరను తినడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. మహిళల్లో వచ్చే రెగ్యులర్ యూరినరీ ఇన్ఫెక్షన్లకు గోంగూర మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు, ఈ సీజన్‌లో నోటి పూతతో చాలా మంది బాధపడుతుంటారు. వాటి కోసం విటమిన్ బి టాబ్లెట్లు ఎక్కువగా వాడేస్తుటారు. కానీ, గోంగూరలోని రిబోఫ్లెవిన్ నోటి పూత సమస్యను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్న మాట.
జుట్టు రాలిపోతోందా.? గోంగూర ట్రై చేసి చూడండి..
ఇప్పుడు అందరికీ కామన్ ప్రాబ్లమ్ జుట్టు రాలిపోవడం.. గోంగూరను తరచూ తీసుకుంటే, ఈ సమస్య నుండి కాస్తయినా ఉపశమనం పొందవచ్చు. గోంగూరలో సి విటమిన్‌తో పాటు పీచు పదార్ధం మెండుగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
కుండీల్లోనూ తేలిగ్గానే పెరుగుతుంది..
ఆకు కూరలను నిల్వ ఉంచడానికి మార్కెట్లో కెమికల్ స్ర్పేలు వాడతారు. దాంతో ఆరోగ్యానికి మంచిది కావనే అభిప్రాయముంది. కానీ, గోంగూరను ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్‌లోనూ గోంగూర ఈజీగా పెరుగుతుంది. ఒక ట్రేలో గోంగూర విత్తనాలు వేస్తే చాలు.. కుప్పలు తెప్పలుగా మొక్కలు వస్తాయి. ఆకులు చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టి, ఓ చిన్న ఫ్యామిలీకి సరిపడా గోంగూరను ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా ఇంట్లో పెంచేసుకోవచ్చు.
Also Read: రంగుల ప్రపంచంలో ‘మత్తు’ గమ్మత్తు.!
వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా గోంగూర అన్ని కూరల్లోనూ ఇమిడిపోతుంది. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర మటన్, గోంగూర బిర్యానీ.. ఇలా ఏదైనా చేసుకోవచ్చు.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్.. అంటారు కదా.. గోంగూర (Gongura Kichen Queen) ఆరోగ్యానికి మంచిది కదా.. అని రోజూ తినేయడం మాత్రం మంచిది కాదండోయ్. దేనికైనా లిమిట్ ఉండాల్సిందే తప్పదు.