Hanuman Guntur Kaaram OTT ‘హనుమాన్’ సినిమాని సంక్రాంతి పండక్కి థియేటర్లో చూసేందుకు వెళితే, ప్చ్.. టిక్కెట్లు దొరకలేదు.!
ప్రతిసారీ సంక్రాంతికి ఓ సినిమా చూడటం అలవాటు.! చిన్నప్పటినుంచీ వస్తున్న ఈ అలవాటు ప్రకారం, సినిమా థియేటర్ దాకా అయితే వెళుతున్నాంగానీ, ఈ మధ్య టిక్కెట్లు అస్సలు దొరకట్లేదాయె.!
గతంలోలా ఒకటి, రెండు థియేటర్లలో కాదు.. ఎన్ని థియేటర్లుంటే, అందులో సగానికి పైగా ఒకే సినిమా ప్రదర్శితమవుతోంది.
‘ఒకే రోజు నలభై షోలు’ అంటూ ఓ పెద్ద సినిమాకి సంక్రాంతి రోజున, హైద్రాబాద్‌లో.. అదీ మల్టీప్లెక్స్ ఛెయిన్‌లో ప్రచారం జరిగింది.
Hanuman Guntur Kaaram OTT.. థియేటర్లు దొరక్క..
‘హనుమాన్’కి సింగిల్ స్క్రీన్లు దొరకడమే కష్టమయ్యింది. ఆ పెద్ద సినిమా బొక్క బోర్లా పడి, ‘హనుమాన్’ ఓవర్ ఫ్లోస్ ద్వారా గట్టెక్కాల్సిన పరిస్థితి వచ్చింది లెండి.. అది వేరే సంగతి.
అన్నట్టు, ‘హనుమాన్’ చూడ్డానికి వెళ్ళి, టిక్కెట్టు దొరకలేదని చెప్పాను కదా.. అక్కడికే వస్తున్నా.! ‘గుంటూరు కారం’ సినిమాకి టిక్కెట్లు అందుబాటులోనే వున్నాయ్.
‘వెళ్దామా.?’ అని పిల్లల్ని అడిగితే, ‘వద్దు..’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఏం చేద్దాం.? అనడిగితే, ‘రేపు చూద్దాంలే..’ అన్నారు. దాంతో, కాస్సేపు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో సరదాగా గడిపేసి, ఇంటికి వచ్చేశాం.
మరుసటి రోజు, మళ్ళీ యధాతథంగా థియేటర్ దగ్గరకి వెళితే, సంక్రాంతి రోజు సిట్యుయేషన్, కనుమ రోజు కూడా కనిపించింది.
ఆన్‌లైన్‌లో టిక్కెట్టు బుక్ చేసుకోవచ్చు కదా.? అన్న డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కాదు.! ఎందుకో, థియేటర్ దగ్గరకు వెళ్ళాకే టిక్కెట్ తీసుకుందామనిపించింది.
ముందే టిక్కెట్ బుక్ చేసుకుంటే, ఆ సమయానికి వేరే ఏదన్నా పని పడితే ఏంటి సంగతి.? ఇదీ నా సమస్య. నాలాంటి చాలామందికి ఈ సమస్య వుండొచ్చు.
రెండో రోజూ టిక్కెట్లు దొరక్కపోవడంతో, విసుగు సహజంగానే వచ్చేసింది. ఇంకో ప్రయత్నం చెయ్యాలనిపించలేదు.
ఓటీటీలో వచ్చేస్తుంది లే.!
సెలవులు అయిపోయాయ్.. వర్క్ మోడ్‌లో పడిపోయాం. ‘హనుమాన్’ సినిమాకి ఈ వీకెండ్‌లో వెళదామా.? అంటే, ఎందుకు దండగ.. ఓటీటీలో వచ్చేస్తుందిలే.. అని పిల్లలూ లైట్ తీసుకున్నారు.
‘గుంటూరు కారం’ సహా ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ థియేటర్లు ఖాళీగా వున్నప్పుడు, వాటిల్లో కొన్ని ‘ఆటలు’ అయినా, ‘హనుమాన్’కి కేటాయించొచ్చు కదా.? అని పిల్లల నుంచి ఓ డౌట్ వచ్చి పడింది.
సినిమా ఈక్వేషన్స్ వేరేలా వుంటాయ్.! ఓవర్ ఫ్లోస్ కోసం కక్కుర్తి కూడా వుండొచ్చు. ‘హనుమాన్’కి సరిగ్గా థియేటర్లు పడుంటే, ఈ సంక్రాంతికి హనుమాన్ ప్రభంజనం వేరే లెవల్‌లో వుండేదేమో.!
అన్నట్టు, మిగతా మూడు సినిమాల్ని అసలు పిల్లలు కన్సిడర్ చేయలేదు. ఓటీటీలో వస్తే, అప్పుడు ‘ఆలోచిద్దాం’ అనేశారు.! పిల్లలంటే, ఐదేళ్ళో. పదేళ్ళో వయసున్న పిల్లలనుకునేరు.. ఇంటర్మీడియట్ పిల్లలు.!
చివరగా..
‘ఆ కుర్చీని మడతబెట్టి..’ అంటూ ‘గుంటూరు కారం’ సినిమా కోసం డిజైన్ చేసిన పాట విషయమై పిల్లలు, ‘అత్యంత అసహ్యం.. ఆ సినిమా ఓటీటీలో అయినా చూడకపోవడమే మంచిది..’ అని అన్నారంటే, పిల్లలు అమితంగా అభిమానించే దర్శకుడు ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ స్థాయికి దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. మహేష్ అయినా, ఆ చెత్త మాటని, జుగుప్సాకరమైన పదజాలాన్ని ఎలా అంగీకరించినట్టు.?
– yeSBee