Happy Birthday Chandrababu 75.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆయనే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు 75వ పుట్టిన రోజు నేడు.
రాజకీయ విమర్శల సంగతెలా వున్నా, తెలుగు నేలపై ఐటీ రంగం ఇప్పుడీ స్థాయిలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోందంటే, దానిక్కారణం చంద్రబాబు విజన్.. అన్నది నిర్వివాదాంశం.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చంద్రబాబు చవిచూశారు. వైసీపీ హయాంలో జైలు జీవితం, చంద్రబాబుకి అత్యంత కఠినమైన సందర్భం.

సంక్షోభం నుంచి అవకాశాల్ని వెతుక్కోవాలి.. అనే మాట పదే పదే చంద్రబాబు చెబుతుంటారు. అలా, వైసీపీ హయాంలో అరెస్టు సంక్షోభం నుంచి, తిరిగి అధికార పీఠమెక్కే అవకాశాన్ని దక్కించుకున్నారాయన.
Happy Birthday Chandrababu 75.. సంక్షోభం నేర్పించే పాఠం..
పిల్లనిచ్చిన మామ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు చంద్రబాబుపై వచ్చినా, ఇంకా అదే విమర్శ ఆయన్ని వెంటాడుతున్నా.. రాజకీయ జీవితంలో మరింత ఎత్తుకు ఎదుగుతూనే వున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు.
Also Read: Pragya Jaiswal: ఓసారిటు చూడొచ్చుగా.!
2019లో దారుణ పరాజయాన్ని చూసి, 2024 ఎన్నికల నాటికి మళ్ళీ బలం పుంజుకుని, ముఖ్యమంత్రి పీఠమ్మీద సగర్వంగా కూర్చున్నారు చంద్రబాబు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. సంక్షోభంలోనూ, అవకాశాల్ని వెతుక్కోవడమనేది కొందరికే సాధ్యం. ఆ విషయంలో చంద్రబాబుకి సాటి ఇంకెవరూ రారు.
తెలుగు నేలపై మమకారం..
జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపగలిగే స్థాయికి ఎప్పుడో చేరుకున్న చంద్రబాబు, జాతీయ రాజకీయాలకంటే, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని అంటుంటారు.
పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విజనరీ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.
ముందు ముందు మరింతగా రాజకీయాల్లో ఉన్నత శిఖరాల్ని చంద్రబాబు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు.!