సంక్రాంతి శుభాకాంక్షలు.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి.. సంక్రాంతి అంటే ఒక్క పండగ కాదు, మూడు నాలుగు పండుగల కలయిక. బోగి పిడకలతో మొదలై, ముక్కనుమతో ముగుస్తుంది సంక్రాంతి. బోగి, సంక్రాంతి, కనుమ.. ఆ తర్వాత ముక్కనుమ.. ఇలా నాలుగు రోజుల సాంబరాలతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది.
నిజానికి, సంక్రాంతి సంబరాలు దాదాపు నెల రోజులపాటు సాగుతాయి. డిసెంబర్ నెలలో మొదలై, ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయిగానీ, ఇప్పుడున్న స్పీడ్ యుగంలో.. అంత ఓపిక, తీరిక ఎవరికి వున్నాయ్ సంబరాల్ని అన్ని రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు.!
సంక్రాంతి శుభాంక్షలు.. సంతోషాల రంగవల్లులు..
ఇక, సంవత్సరమంతా ఎవరు ఎక్కడ ఎలాంటి పనుల్లో నిమగ్నమైపోయినా, సంక్రాంతికి సొంతూరుకి వెళ్ళడం చాలామందికి ఆనవాయితీ. పుట్టిన ఊరుని గుర్తు చేసుకోవడం, సొంతూరిలో స్నేహితులు, బంధువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం.. సంక్రాంతి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చేమో.

డూడూ బసవన్నల సందడి.. కోడి పందాల హంగామా.. చెప్పుకుంటూ పోతే, సంక్రాంతి ముచ్చట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ ఇంట్లో చూసినా, పిండి వంటలు చవులూరిస్తాయి సంక్రాంతి నేపథ్యంలో. భోగిపళ్ళ సందడి, రంగవల్లులతో నిండిపోయే వాకిళ్ళు, పశువులకు చేసే ప్రత్యేక పూజలు.. ఇలా సంక్రాంతి ప్రత్యేకతలు చాలానే.!
మకర సంక్రాంతి.. ఇదీ ప్రత్యేకం..
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం.. అందుకే, ఇది అత్యంత పవిత్రమైన పండుగగా పెద్దలు అభివర్ణిస్తారు. ముక్కోటి దేవతలు మకర సంక్రాంతి మొదలు ఆరు నెలల వరకు.. అంటే, ఉత్తరాయణ పుణ్య కాలంలో ఇంకాస్త ఉత్సాహంగా భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చుతారన్నది పెద్దలు చెప్పే మరో ఆసక్తికరమైన మాట.
సంక్రాంతి అంటే, పెద్దల పండగ.. మన పూర్వీకుల్ని మననం చేసుకునే పండుగ కూడా. పిల్లలకు పెద్దల ప్రాముఖ్యతను తెలియజేసేదే ఈ పెద్ద పండుగ. పెద్దవాళ్ళు పిల్లలుగా మారి సరదాగా అల్లరి చేసే పండగగానూ పెద్ద పండుగను అభివర్ణించొచ్చు.
Also Read: శ్రీకూర్మం.. కూర్మావతారంలో శ్రీ మహా విష్ణువు కొలువుదీరిందిక్కడే.!
ఈ సంక్రాంతి మనందరి జీవితాలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిద్దాం. ముద్ర డాట్ కామ్.. తరఫున మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.