సినిమాని ఇలాక్కూడా తీయొచ్చా.? అనిపిస్తుంటాయి కొన్ని సినిమాలు. ఆ కోవలోకే ‘హీరో’ సినిమా కూడా చేరుతుంది. హీరోయిన్‌ని చంపాలనుకునే హీరో కథ ఇది. హీరో, హీరోయిన్‌ని ఎందుకు చంపాలనుకుంటాడు.? ఇంతకీ చంపాడా.? లేడా.? హాస్య భరితమైన ఈ రక్తసిక్త కథా చిత్రం ‘హీరో’ (Hero Review In Telugu) ముచ్చట్లు తెలుసుకుందాం పదండి.
హీరో (రిషబ్ శెట్టి), హీరోయిన్ (గనవి లక్ష్మణ్)ని చంపడానికి స్కెచ్ వేస్తాడు. ఇందుకోసం ఓ కారడవిలో ఉన్న బంగ్లాకు వెళ్తాడు. అక్కడ ఓ కరడు కట్టిన విలన్ ఉంటాడు. ఆ విలన్ తన ప్రత్యర్ధి కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్కన్ని చంపే ప్రయత్నంలో ఉంటాడు. ఆ విలన్ దగ్గరే భార్యగా బంధీ అయిపోతుంది హీరోయిన్.
ఇంతకీ హీరో వేసుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా.? హీరోయిన్, విలన్ చెర నుండి బయట పడిందా.? విలన్ తన ప్రత్యర్ధి కుటుంబంలో మిగిలిన ఆ ఒక్కణ్ణి గుర్తించాడా.? లేదా.? అన్నది మిగతా కథ.
హీరో ఇలాక్కూడా వుంటాడా.?
చూడ్డానికి హీరో ధిట్టంగానే ఉన్నాడు. కానీ, ఫైటింగులే చేయడు. కామెడీ బాగానే చేస్తాడు. అంత పిరికోడు కాబట్టే హీరోయిన్‌ని చంపేద్దామనుకుని ప్లాన్ వేస్తాడు. ప్రేమించిన అమ్మాయి తనను వదిలేసిందన్న కోపంలో ఆమెను చంపడానికి హీరో వెళ్లడమేంటీ.? పైగా బార్బర్ షాపులో పని చేసే హీరో ఖరీదైన బుల్లెట్ మీద వెళ్లి మరీ విలన్‌కి హెయిర్ కట్ చేయడమేంటీ.?
విలన్ గ్యాంగ్ విషయానికి వస్తే, నిర్ధాక్షిణ్యంగా మనుషులను చంపేస్తారు. కానీ, ఒక్కొక్కడూ ఒక్కో టైపులో కామెడీ చేస్తాడు. చంపడమూ కామెడీనే. తినడమూ, తిరగడమూ కామెడీనే వీళ్లకి. ఈ విలన్ కొంపలో ఓ పెంపుడు మొసలి ఒకటి. ఆ మొసలికి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్ ఒకడు.
మిన్ను విరిగి మీద పడుతున్నా, రుచికరమైన వంటలు తయారు చేయడం తప్ప దేన్నీ పట్టించుకోని వంట కుర్రోడు.. ఇలా పాత్రలు తక్కువే. అన్ని పాత్రలూ అవసరమైన కామెడీని పండించాయి. ఒకటి, రెండు పాత్రలు తప్ప అన్ని పాత్రలూ రక్తపాతం సృస్టించేశాయి.
హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రకు ఎంత అవసరమో అది చేశాడు. కామెడీ చేశాడు. కష్టపడి పరుగెత్తాడు. అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన ఫైటింగులూ చేశాడు. ఇంకేవేవో చేసేశాడు. మొత్తంగా ఓ ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్ అనుకోవచ్చు.
హీరోయిన్.. ఈ సినిమాకి అసలు సిసలు హీరో..
హీరోయిన్ గనవి లక్ష్మణ్ (Ganavi Laxman) బాగా చేసింది. హాస్యం, ఆవేదన సహా చాలా యాంగిల్స్ ఈజీగా చూపించేసింది. పాపం అడవుల్లో బాగా పరుగెత్తించేశారు. కష్టపడి పరుగెత్తేసింది కూడా. నిజానికి ఈ సినిమాకి హీరో అంటే ఆమె పాత్రనే.
విలన్ కనిపించింది కాస్సేపే అయినా, డిఫరెంట్‌గా ఆకట్టుకున్నాుడు.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కాస్త నెమ్మదించినట్లు అక్కడక్కడా అనిపించినా రక్తసిక్తమైన కామెడీతో ఆ స్లో అన్న భావన తేలిగ్గా మర్చిపోతాం. క్లైమాక్స్ ఒకే భవనంలో చాలా సేపు నడుస్తుంది.
రక్తం ఏరులై పారుతూనే ఉంటుంది. తుపాకీ గుళ్లు పేలుతూనే ఉంటాయి. కామెడీ మాత్రం ఆగదు. ఎక్కడా వల్గారిటీకి చోటివ్వలేదు. ఆధ్యంతం సరదాగా సాగిపోతుంది. ఇంతకీ, సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేంటీ.? తెలీదు. హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటీ.? తెలీదు. కామెడీని రక్తసిక్తం చేసేశారెందుకు.? (Hero Review In Telugu) అదీ తెలీదు.