Hridaya Poorvam Telugu Review.. మోహన్‌లాల్ అంటే ఎలా వుండాలి.? బీభత్సమైన ఫైట్లు చేసెయ్యాలి కదా.? ప్చ్, చేయలేదాయె.!
మాళవిక మోహనన్ అంటే, తెర నిండా గ్లామర్ పండించెయ్యాలి కదా.? ప్చ్, ఆమె కూడా గ్లామర్ జోలికి పెద్దగా వెళ్ళలేదాయె.!
ఎడా పెడా కామెడీ సీన్స్ వుండాలి కదా.? ప్చ్, కామెడీ కూడా మరీ అంత ఎక్కువ లేదాయె.! కంట తడి పెట్టించేంత ఎమోషనల్ సీన్స్ ఏమైనా వున్నాయా.? అంటే, దానికీ ఆస్కారమివ్వలేదు.

పోనీ, సినిమా వేగంగా వుందా.? అంటే, ప్చ్.. స్లో స్లో..గానే నడిచిందాయె. తెలియని కథా.? అంటే, అదీ కాదు.!
అయినాగానీ, సినిమా సూపర్ హిట్టు.! ‘హృదయ పూర్వం’ సినిమా మలయాళంలో తెరకెక్కి, అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని అలరించింది.
Hridaya Poorvam Telugu Review.. అసలేంటి కథా కమామిషు..
సందీప్ (మోహన్ లాల్), గుండె సంబధిత సమస్యతో బాధపడుతుంటాడు. అతనికి, గుండె మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుంది.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి, గుండెను సేకరించి సందీప్‌కి ఆ గుండెను అమర్చుతారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుమార్తె ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళతాడు సందీప్.
అక్కడ జరిగే సంఘటనలు, ఆ సంఘటనలతో హీరో ఎమోషనల్‌గా కనెక్ట్ అవడం.. ఇదంతా మిగతా కథ.

ఎవరెలా చేశారు.? గుండె మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన పేషెంట్ కదా.. సినిమాలో ఎలాంటి వీరోచిత పోరాటాలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది మోహన్ లాల్‌కి.
చివర్లో ఓ చిన్న ఫైట్ వుంటుంది లెండి. అది కాస్త ఊరట, మోహన్ లాల్ నుంచి ఫైట్స్ ఆశించే ఓ వర్గం ఆడియన్స్‌కి.
గుండె తాలూకు ఓనర్ కుమార్తె పాత్రలో మాళవిక మోహనన్ నటించింది. పాత్రకు ఎంత అవసరమో, అంతవరకే.. అన్నట్లుగా కొలతలు వేసుకుని మరీ, సహజంగా కనిపించింది మాళవిక మోహనన్.

మిగతా పాత్రలు కూడా అంతే. ఏ పాత్రకి ఆ పాత్ర.. సినిమాకి ఎంత అవసరమో, అంతే చేశారు. నటీనటులే కాదు, సాంకేతిక వర్గం కూడా అంతే.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్ని విభాగాలూ, సినిమా కోసం చాలా బాగా పని చేశాయి. దాంతో, మంచి ఔట్పుట్ వచ్చినట్లయ్యింది.
అంతా గుడ్.. కానీ, చిన్న చిన్న లోటుపాట్లూ వున్నాయ్. ఎడిటర్ ఇంకాస్త బాగా పని చేసి వుంటే, అరగంట వరకు, కోత విధించేయొచ్చు.. తద్వారా నిడివి తగ్గేది.

చాలా చాలా మంచోడిగా, కొంచెం కోపిష్టిగా మోహన్‌లాల్ పాత్రని రాసుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రలో, మోహన్ లాల్ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది.
తల్లిని ప్రేమిస్తాడా.? కూతుర్ని ప్రేమిస్తాడా.? అన్న డౌట్ కలుగుతుంటుంది అప్పుడప్పుడూ. చివరికి, ఆ ఇద్దరిలో ఎవరినీ హీరోకి కలపకుండా మంచి పనే చేశాడు దర్శకుడు.
అవయవదానం కొత్త జీవితాన్నిస్తుందనే విషయాన్ని దర్శకుడు చెప్పాలనుకున్నాడా.? ప్చ్.. అదేం కాదు, సినిమాకి అదో చిన్న పాయింట్ అంతే.! సరదా సరదాగానే నడిపించేశాడు దర్శకుడు సినిమాని.

నిర్మాణపు విలువలు బావున్నాయి. ఓటీటీలో ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకునే ఆప్షన్ వుంది కాబట్టి, మనమే ఎడిటింగ్ చేసుకున్నట్లుంటుంది పరిస్థితి.
Also Read: పుస్తెలమ్మినాగానీ.. ఇకపై ‘పులస’ దొరకడం కష్టమే.!
ఓవరాల్‌గా, ‘హృదయ పూర్వం’ ఓ మంచి సినిమానే.! తీరిక దొరికితే, ఫాస్ట్ ఫార్వార్డ్ చేయకుండానే సినిమాని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
