ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) అంటే, తెలుగు సినిమాకి ‘పవర్’ స్టార్. సక్సెస్, ఫెయిల్యూర్ అన్న తేడాల్లేకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ‘నేను సినిమాలు మానేశాను..’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినా.. తప్పదు సినిమాలు చేయాల్సిందే.. అని అభిమానులే కాదు, దర్శక, నిర్మాతలు ఆయనపై ఒత్తిడి తేవడం ప్రత్యక్షంగానే చూస్తున్నాం.
ఎవడెవడో పవన్ కళ్యాణ్‌కి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు.. అంటాడు. సినిమా పరిశ్రమకి పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) ఉన్న సంబంధం ఏంటో, సినిమా గురించి కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కడికీ తెలుసు. దటీజ్ పవన్ కళ్యాణ్. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ, సినిమా వేరు, రాజకీయం వేరు.
సినిమా వేరు.. రాజకీయం వేరు..
సినిమాల్లో అంతా నా ఇష్టం.. అంటే కుదురుతుందేమో. రాజకీయాల్లో అది కుదరదు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాలి. జనం ఏం కోరుకుంటున్నారో, అది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటించాలి. అది చేసేస్తున్నట్లు ఏమార్చాలి. ఇదే పవన్ కళ్యాణ్‌కి తెలిసి రావట్లేదు.
యాక్షన్ ఎపిసోడ్స్ తీసుకుంటే, విలన్‌ని హీరో కొట్టినట్లు చూపిస్తారు. కానీ, హీరో నిజంగా కొట్టడు. ఇదే సూత్రం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో నిజాయితీకి చోటు లేదు. అందుకే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత నిజాయితీగా ఉండాలనుకున్నా, ‘నటిస్తున్నాడు’ అనే జనం భావిస్తున్నారు. జనానికి కావల్సింది ‘ఆ’ నటన మాత్రమే.
రాజకీయాల్లో నిజాయితీ సరిపోదు..
2019 ఎన్నికలకు ముందు పవన్, ప్రజల్లోకి వెళితే జనసంద్రం కనిపించింది. ఇప్పుడూ అదే జనసంద్రం కనిపిస్తోంది. వాస్తవానికి డబ్బు ఖర్చు చేయకుండా జనాన్ని పవన్ రప్పించగలుగుతున్నారు. అలా వచ్చిన వాళ్లతో ఓట్లు ఎలా వేయించుకోవాలో.. తెలుసుకున్నప్పుడే జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాల్లో నిఖార్సయిన నాయకుడవుతాడు.
నన్ను నమ్మి ఓట్లెయ్యండి.. అని అడగాల్సింది పోయి, ‘నన్ను నమ్మితేనే ఓట్లెయ్యండి..’ అనడం ద్వారా పవన్, ప్రజలకు చేరువవలేకపోతున్నారు. ‘ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్..’ అని దేబిరిస్తే ఓట్లు పడే రోజులివి. ‘నేనలా చేయను..’ అంటే ఇంకెన్నాళ్లు ఇదే రాజకీయం చేసినా ఫలితం ఉండదు.
తదుపరి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. వ్యూహం మార్చేశాం.. నిఖార్సయిన రాజకీయం చేయబోతున్నాం.. అని చెబుతున్న పవన్ కళ్యాణ్ తనను చూసేందుకు వచ్చే అశేష ప్రజానీకంలో ఎంత మందిని ముందు ముందు తన ఓటర్లుగా మలచుకుంటారన్న దానిపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మార్చగలిగితే మాత్రం అది జనసేనాని (Janasenani Pawan Kalyan) ప్రభంజనమే అవుతుంది.