Table of Contents
Simhachalam Wall Collapse.. నమో నారసింహా.! ఈ మాట మన నోటి వెంట వస్తే చాలు, ఎలాంటి ప్రమాదాలూ మన దరి చేరవు.. అని భక్తులు నమ్ముతుంటారు.!
సింహాద్రి అప్పన్న.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘తిరుపతి’ లాంటి పుణ్య క్షేత్రం.! తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచీ పెద్దయెత్తున భక్తులు సింహాద్రి అప్పన్నని దర్శించుకుంటుంటారు.
వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నంతనే తమ కష్టాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం.
విశాఖ నగరానికి కూత వేటు దూరంలో.. ఆ మాటకొస్తే, ఇప్పుడు బాగా విస్తరించిన విశాఖ నగరంలోనే వుందీ సింహాచల క్షేత్రం.
Simhachalam Wall Collapse.. చందనోత్సవంలో విషాదం..
ఏటా చందనోత్సవం రోజున, ఇసుకేస్తే రాలనంత జనం సింహాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటుంటారు. ఏడాది పొడుగునా, చందనం రూపంలోనే దర్శనమిస్తారు సింహాద్రి అప్పన్న.
ఒకే ఒక్క రోజు.. అదీ, చందనోత్సవం రోజున.. నిజ రూపంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ క్రమంలో దేవస్థానం భక్తుల కోసం కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తుంటుంది.

ఈ ఏడాది కూడా అలానే దేవస్థానం ఏర్పాట్లు చేసిందిగానీ, దురదృష్టవశాత్తూ 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఓ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
నాసిరకం గోడ కట్టారన్నది ప్రాథమికంగా నిర్దారణ అయిన అంశం. పూర్తిస్థాయి విచారణ జరిగి, వాస్తవాలు ఎప్పటికి వెలుగు చూస్తాయన్నది ఆ సింహాద్రి అప్పన్నకే తెలియాలి.
అభివృద్ధి ఓ వైపు.. నిర్లక్ష్యం ఇంకో వైపు..
దేవస్థానాల్లో అభివృద్ధి పనులు కొత్తేమీ కాదు. సింహాచలంలోనూ గత కొన్నాళ్ళుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే, ఓ గోడ కట్టారు.. అది కూలడంతోనే ప్రమాదం జరిగింది.
కొండ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎంత అప్రమత్తంగా వుండాలి.? ఆ అప్రమత్తత, జాగ్రత్త.. ఇవేవీ లేకపోవడమే, 8 మంది భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైంది.
షరామామూలుగానే ఈ ఘటన జరిగాక, శవ రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం పాతిక లక్షల నష్ట పరిహారం ప్రకటిస్తే, పాతిక లక్షలు సరిపోదు, కోటి రూపాయలు కావాలంటూ డిమాండ్లు తెరపైకొచ్చాయి.
హిందూ ధర్మంపై కుట్ర జరుగుతోందా.?
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, హిందూ ధర్మంపై దాడి జరుగుతోంది.. కొందరు కుట్రపూరితంగా ఇలాంటి ఘటనలకు తెరవెనుకాల స్కెచ్ వేస్తున్నారన్న అనుమానాలు మామూలే.
పుకార్లు సృష్టించి తొక్కిసలాటలు జరిగేలా చేయడం.. అనేది పాత పద్ధతి.. అనుకోండి.. అది మళ్ళీ వేరే చర్చ.
ఏది ఏమైనా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. సింహాచలం ఘటనలో ఇంజనీరు, కాంట్రాక్టరు సహా, దేవస్థానం అధికారులందర్నీ బోనులో నిల్చోబెట్టాల్సిందే.
Also Read: Vaibhav Suryavanshi చిన్నోడు.. చిచ్చర పిడుగు! చితక్కొట్టేశాడు!
ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ ఘటనకు సంబంధించి నిజానిజాల్ని భక్తుల ముందుంచుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
భక్తుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఓ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి ఘటనల నేపథ్యంలో.
మీడియాని అడ్డం పెట్టుకుని కుట్రలు పన్నుతున్న అలాంటి అసాంఘీక శక్తుల పని పట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది.