Table of Contents
100 సీట్లలో గెలుస్తాం.. అని చెప్పి, 88 సీట్లకే పరిమితమయ్యారని ఎవరైనా అనగలరా.? తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) అంతటి అద్భుత విజయం సాధించింది. అలాంటిలాంటి విజయం కాదు. ఏడెమిది నెలల పదవీ కాలాన్ని కాదనుకుని, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (Kalvakuntla Chandrasekhar Rao).. సంచలన విజయాన్ని అందుకుని, రెండోసారి ముఖ్యమంత్రి (KCR) పీఠమెక్కుతున్నారు.
విజయం ఎప్పుడూ ప్రత్యేకమే. 2014 ఎన్నికలంటే, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో 70 సీట్లను టచ్ చేయలేకపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ చాలా తీవ్రంగా వుంది. అయితే, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనీ, తెలుగుదేశం పార్టీ సహకారం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో వుందనీ, బీజేపీ సైతం తెలంగాణ కోసం ప్రయత్నించిందనీ.. ఇలా సవాలక్ష ఈక్వేషన్స్ పనిచేశాయి.
ఖమ్మం కొంచెం తేడా కొట్టిందిగానీ..
కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి సోలో పెర్ఫామెన్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి డబుల్ డిజిట్ దక్కించుకుందిగానీ, 20 సీట్లను కూడా పూర్తిగా సాధించలేక చతికిలపడింది. తెలుగుదేశం పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది.
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా లోపాల కారణంగానే ఓడిపోయాం..’ అని కేసీఆర్ (KCR) చెప్పారంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఈసారి తెలంగాణలో ఏ స్థాయి విజయాన్ని కేసీఆర్ (KCR) అంచనా వేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ప్రజా కూటమి, తెలంగాణ రాష్ట్ర సమితిపై కాస్త పై చేయి సాధించింది. పార్టీ ఫిరాయింపులు మొదలైతే, ఖమ్మం కూడా పూర్తిగా టీఆర్‌ఎస్ గూటికి చేరిపోతుంది. మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడం ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌కి మింగుడుపడని విషయం.
వీళ్ళా.? ముఖ్యమంత్రి అభ్యర్థులా.?
రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. కానీ, అందరూ ఓటమి పాలయ్యారు. కొడంగల్‌లో రేవంత్ (Revanth Reddy) ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు.
మామూలుగా అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పట్ల టీఆర్‌ఎస్ కొంత మెతకగానే వ్యవహరిస్తుంటుంది. ఆయన ఓడిపోవడం ఇంకో ఆశ్చర్యకర ఫలితం. కేసీఆర్‌ని పలు సందర్భాల్లో ఓవర్ ది బోర్డ్ వెళ్ళి సవాల్ చేసిన డీకే అరుణ సైతం పరాజయం పాలయ్యారు. అధిష్టానానికి వీళ్ళెవరూ మొహం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు అంచనాలు తల్లకిందులైపోయాయ్
తెలంగాణలో టీడీపీ (Telugu Desam Party) గెలిచి, ఇక్కడేమన్నా నేను ముఖ్యమంత్రినవుతానా.? అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యల్లో ఇంకో కోణం వుంది. ‘మా పార్టీ గెలవకపోయినా ఫర్వాలేదు, టీఆర్‌ఎస్ మాత్రం గెలవకూడదు’ అనేదే ఆ ఇంకో కోణం. కానీ, టీడీపీ (TDP) రెండు సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ 19 సీట్లకు పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం 88 సీట్లు కొల్లగొట్టింది. గ్రేటర్ హైద్రాబాద్‌లో టీడీపీకి స్పేస్ లేదని ఈ ఎన్నికలు తేల్చేశాయి.
పాపం సుహాసిని
హరికృష్ణ (Hari Krishna) కుమార్తె సుహాసిని పొలిటికల్ కెరీర్‌కి ఆదిలోనే శుభం కార్డు వేసేశాయి ఈ ఎన్నికలు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyanram) తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాకుండా జాగ్రత్తపడటం మంచిదైంది. బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రచారం అభాసుపాలైపోయింది మరి. భవ్య ఆనంద ప్రసాద్ (Bhavya Ananda Prasad) గానీ, మరొకరుగానీ గ్రేటర్ హైద్రాబాద్‌లో టీడీపీకి ఉపయోగపడలేదు.
వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ (KCR)
తెలంగాణలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ కేసీఆరే అభ్యర్థి అని కవిత, ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు కూడా చెప్పారు. తెలంగాణలో అందరిదీ దాదాపు ఇదే అభిప్రాయం. ఎన్నికల్లో గెలిచాక కూడా ఇదే మాట అంటున్నారు. అభ్యర్థులెవరన్నదీ చూడలేదు, కేసీఆర్‌ని (KCR) గెలిపించడమే లక్ష్యంగా ఓటర్లు పెట్టుకున్నారు.. గెలిపించారు కూడా.
ఎన్నికలో గెలిచాక, కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. ఇకపై జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర రాజకీయాలు దేశానికి అవసరం అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వేలు పెట్టినట్లే, తానూ ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోతున్నట్లూ ప్రకటించారు.
అభినందనల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర సమితి విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇంకా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా అభినందనలు తెలిపినవారిలో వున్నారు.
రాజకీయాల్లో అంచనాలు అన్ని సందర్భాల్లోనూ నిజం కావు. సవాలక్ష సెంటిమెంట్లను అధిగమించారు కేసీఆర్. ముందస్తు ఎన్నికల్లో ఓటమి తప్పదన్న హెచ్చరికల్ని ఆయన లెక్క చేయలేదు. చరిత్రను తిరగరాశారు. తెలంగాణకి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొడితే ప్రత్యర్థికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి.. అదే జరిగిందిప్పుడు. కేసీఆర్ బంపర్ విక్టరీ కొట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ ముద్ర డాట్ కామ్ శుభాకాంక్షలు.