King Kohli.. పొమ్మనలేక పొగ పెట్టడం అంటే ఏంటో బీసీసీఐకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. జట్టుకి ఎంత గొప్ప సేవలైనా అందించనీ.. అవమానాలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొనాల్సిందే. మైదానంలో ప్రత్యర్ధి ఆటగాళ్ల కంటే ప్రమాదకరమైన సమస్య భారత క్రికెటర్లకు బీసీసీఐతోనే ఎదురవుతూంటుంది.
ఒకరా.? ఇద్దరా.? లెక్క తీస్తే పదుల సంఖ్యలో ఉంటారు బాధితులు. ఎందుకంటే, బీసీసీఐ వేధింపులకు గురి కాని ఆటగాడంటూ ఎవరూ వుండరు. సౌరవ్ గంగూలీ (Saurav Ganguly) లాంటి మేటి ఆటగాడికే తప్పలేదు. నవజ్యోత్ సింగ్ సిద్దూ నుంచి, ఇప్పటిదాకా.. అంతకు ముందూ, ఇక పైనా.. క్రికెట్ అంటే అవమానం. అవమానం అంటే క్రికెట్. ఇది ఇంతే. ఈ తీరు మారదంతే.
King Kohli.. కోహ్లీ ఒక్కడే కాదు..
అన్నట్లు ఇక్కడ కొందరు ఆటగాళ్లూ అలాంటోళ్లే. వాళ్లు సుద్దపూసలేం కాదు. ఇతరుల్ని అవమానించి, అహంకారంతో విర్రవీగినవారే. చివరకి వాళ్ల కథ కూడా అమానవీయంగానే ముగుస్తుంది. విరాట్ కోహ్లీ ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

టీ 20, వన్డే కెప్టెన్సీల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా టెస్ట్ కెప్టెన్సీని వదిలేయాల్సి వచ్చింది. వుంటే, మూడు ఫార్మేట్లకీ కెప్టెన్సీ చేయాలనీ, లేదంటే, కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలనీ కోహ్లీకి షరతు విధించింది బీసీసీఐ. దాన్ని సహించలేకపోయాడు కోహ్లీ.
తప్పు.. అటూ ఇటూ.!
ఈ మొత్తం వ్యవహారంలో అటు బీసీసీఐ చెత్త రాజకీయం, ఇటు విరాట్ కోహ్లీ అహంకారం.. రెండూ సబబు కాదు. ఇదే, ఈ దారుణమైన వైఖరే భారత క్రికెట్‌ని ఎప్పటికప్పుడు కింద పడేస్తోంది. దేశంలో టాలెంట్ వున్న ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ, టాలెంట్ మరుగున పడిపోవడానికి కారణం ఈ క్రికెట్ రాజకీయమే.
Also Read: కెప్టెన్ కోహ్లీ తప్పుకున్నాడా.? తప్పించేశారా.?
కోహ్లీ (Virat Kohli) అంటే, ‘భారత క్రికెట్’ అనే పుస్తకంలో ఓ అద్భుతమైన పేజీ. దాన్ని సింపుల్‌గా చింపేసింది బీసీసీఐ. అదే సమయంలో భారత క్రికెట్ (Indian Cricket) అనే ఓ వజ్రాన్ని కోహ్లీ బద్దలుకొట్టేశాడు తన అహంకారంతో. తప్పు ఇద్దరిది. అంతిమంగా నష్టపోయేది క్రికెట్.
రిటైర్మెంట్ తీసుకుంటూ, గంగూలీలాంటి చాలా మంది చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కోహ్లీ పరిస్థితి చూస్తుంటే, ఆటకు కూడా అవమానకరమైన రీతిలోనే రిటైర్మెంట్ ప్రకటించక తప్పేలా లేదు.