Kuna Ravikumar TDP Kalinga.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్ని శాసించే స్థాయిలో వున్న కళింగ సామాజిక వర్గానికి, ‘కూటమి’ మంత్రి వర్గంలో చోటు కల్పించలేదంటూ ఆ సామాజిక వర్గ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్‌కి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కాళింగ సామాజిక వర్గం అల్టిమేటం జారీ చేసింది.
మంత్రి వర్గాన్ని ప్రకటించేవరకూ కూన రవికుమార్‌కి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగిందనీ.. ఏ కారణం వల్ల కూన రవికుమార్‌కి మంత్రి పదవిని చంద్రబాబు ఇవ్వలేదో తమకు అర్థం కావడంలేదనీ కాళింగ సామాజిక వర్గ ప్రముఖులు శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం కష్ట నష్టాలకోర్చిన కూన రవికుమార్
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని కాళింగ భవన్‌లో భేటీ అయిన ఆ సామాజిక వర్గ ప్రముఖులు, 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం తర్వాత, జిల్లాలో టీడీపీ జెండా వదలకుండా, ధైర్యంగా నిలబడి, పార్టీ కార్యకర్తల్లో కూన రవికుమార్ ధైర్యం నింపారన్నది కాళింగ సామాజిక వర్గ ప్రముఖుల వాదన.

జిల్లాకి చెందిన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడులకు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయనీ, ఆ ఇద్దరి గెలుపులో కాళింగ సామాజిక వర్గ ఓట్లు కీలక భూమిక పోషించాయని అంటున్నారు కాళింగ సామాజిక వర్గ ప్రముఖులు.
శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు కూన రవికుమార్, బెందాళం అశోక్ అసెంబ్లీకి ఎన్నిక కాగా, వారిలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడం కాళింగ సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు సామాజిక వర్గ సమావేశంలో తీర్మానించారు.
Kuna Ravikumar TDP Kalinga.. ఉద్యమిస్తామంటున్న కాళింగ సామాజిక వర్గం..
కారణాలు ఏవైనాగానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కాళింగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనీ, కూన రవికుమార్‌కి మంత్రి పదవి ఇవ్వాలన్నది ఆ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్‌గా కనిపిస్తోంది.
వైసీపీ హయాంలో కూన రవికుమార్ మీద అనేక అక్రమ కేసులు బనాయించబడ్డాయనీ, అయినా వైసీపీ బెదిరింపులకు తలొగ్గకుండా టీడీపీ జెండాని ధైర్యంగా పట్టుకునే వున్నారనీ, అలాంటి కూన రవికుమార్‌కి అన్యాయం జరగడం తమకు బాధ కలిగిస్తోందని కాళింగ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ ఎన్నికల్లో కాళింగ సామాజిక వర్గం మొత్తం, టీడీపీకి అండగా నిలబడిందన్న విషయాన్ని టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మర్చిపోతే ఎలాగన్నది ఆ సామాజిక వర్గ ప్రముఖుల ఆవేదన.
వెంటనే స్పందించి, కూన రవికుమార్‌కి న్యాయం చేయకపోతే ఉద్యమబాట పడతామనీ, మంత్రి పదవి తమ సామాజిక వర్గ హక్కు అనీ అంటున్న కాళింగ సామాజిక వర్గాన్ని శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read: మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక, అదీ సంచలన విజయంతో అధికార పీఠమెక్కాక.. పదవుల విషయమై ఆవావహుల నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు వుండొచ్చుగాక. ఈ పరిస్థితుల్ని కూటమి పార్టీలు సంయుక్తంగా అధిగమించాల్సి వుంటుంది.