Table of Contents
Kurukshetra Web Series Review.. కురుక్షేత్రమంటే, కేవలం యుద్ధం మాత్రమేనా.?
శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సహించాడా.? వందలాది మంది, వేలాది మంది చావుకు కారణమైనవాడు దేవుడెలా అవుతాడు.?
ఇలాంటి ప్రశ్నల్ని, కొందరు మేతావుల నుంచి నిత్యం చూస్తూనే వుంటాం. రామాయణం, మహాభారతం.. ఇవన్నీ, కేవలం పురాణ గాధలు మాత్రమే కాదు, జీవన విధానం నేర్పేవి.!
భగవద్గీత.. ఇందులోనే ప్రపంచమంతా వుంటుందని అంటుంటారు పెద్దలు.! అది నిజం కూడా.! మహాభారతంలో, కురుక్షేత్రం.. అనేది పోరాట ఘట్టం.!
ఆ ‘కురుక్షేత్ర’ పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందింది.! అది కూడా, యానిమేషన్ బొమ్మల రూపంలో.! నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో వుంది.
18 పర్వాలు.. 18 ఎపిసోడ్లు.!
మహాభారతాన్ని 18 పర్వాలుగా చెప్పుకుంటాం. ఈ ‘కురుక్షేత్ర’ కూడా 18 ఎపిసోడ్లతో రూపొందింది. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేశారు. ఆ తర్వాత మరో 18 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి.
కురుక్షేత్ర యుద్ధం ఎలా మొదలైంది.? ఎలా పూర్తయ్యింది.? ఇదంతా ‘కురుక్షేత్ర’ వెబ్‌సిరీస్‌లో వీలైనంతవరకు వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.!

అందరూ బంధువులే.! అందరూ శక్తివంతులే.! అస్త్రశస్త్రాలు వున్న వీరాధివీరులు.. కురుక్షేత్ర యుద్ధంలో ఒకరొకరుగా నేలకొరిగారు.!
కురువంశం నాశనమైంది.. అలాగని, పాండవ వంశం ఏమైనా బాగుపడిందా.? అంటే, అదీ లేదు.! పాండవులూ వారసుల్ని కోల్పోయారు.!
యుద్ధం మిగిల్చింది ఏమిటి.?
యుద్ధం మిగిల్చేదేంటి.? ఏమీ లేదు.! ధర్మం గెలవాలి.? కానీ, ఆ ధర్మం కూడా సందర్భాన్ని బట్టి మారిపోతుంటుంది. ఏది ఎందుకు ఎలా మారిపోతుందో మనం చూస్తాం.!
శ్రీకృష్ణుడు రథ సారధి. కేవలం అర్జునుడికి మాత్రమే శీకృష్ణుడు రథ సారధి కాదు. ఈ మొత్తం కురుక్షేత్రానికే ఆయన రథ సారధి.!
ద్రౌపదికి జరిగిన అవమానం, దాన్ని సమర్థించిన.. అది చూస్తూ మౌనంగా వుండిపోయిన.. అందర్నీ బలి తీసుకుంది.! ద్రౌపదిని పణంగా పెట్టిన పాండవులకూ పుత్రశోకం మిగిలింది.

కొత్త కథేం కాదిది.! నిజానికి, ఇది కథ కాదు.! మహాభారత్.. అంటూ టీవీ సిరీస్‌ని చాలా ఏళ్ళ క్రితం చూశాం. దాన్ని మంచి, మహాభారతాన్ని గొప్పగా ఇంకెవరూ చెప్పలేరు.
ఇప్పుడీ ‘కురుక్షేత్ర’ కూడా అంతే.! కాకపోతే, ఈ జనరేషన్‌కి కాస్త అర్థమయ్యేలా, వేగంగా.. ‘కురుక్షేత్ర’ వెబ్ సిరీస్ నడుస్తుంది.!
చూడటమే కాదు.. అర్థం చేసుకోవడమూ ముఖ్యం..
‘కురుక్షేత్ర’ చూసేటప్పుడు, కుటుంబ సభ్యులందరితో కలిసి చూడటం మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళు.. కురుక్షేత్రలో, ప్రతి సంఘటన ఎందుకు జరిగిందో వివరించగలగాలి.
భీష్ముడు, ద్రోణాచార్యుడు.. ఎందుకు కౌరవుల పక్షాన నిలిచారు.? నారాయణి సైన్యం సంగతేంటి.? నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం.. వీటి శక్తి ఏంటి.? ఇవన్నీ నేటి తరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు.
అశ్వథ్థామ హతః కుంజర’ గురించీ చక్కగా వివరించారు. చివర్లో బాలరాముుడు – కృష్ణుడి మధ్య సాగే సంభాషణలూ ఆలోచింపజేస్తాయి.
అర్జునుడి తనయుడైన అభిమాన్యుడి వీరోచిత పోరాటం స్ఫూర్తినిస్తుంది. ధర్మరాజు అర్థ సత్యం ఎందుకు చెప్పాల్సి వస్తుందనేదీ ఆసక్తికరమైన ఘట్టం.
యక్ష ప్రశ్నలు, శల్య సారధ్యం.. ఇవన్నీ నేటి తరానికి ఈ వెబ్ సిరీస్ ద్వారా మరింత బాగా అర్థమవుతాయి. అయితే, ఆ యక్ష ప్రశ్నలన్నిటి గురించీ ప్రస్తావించి వుండాల్సింది. కొన్నిటి ప్రస్తావన మాత్రమే వుంది.
అత్యద్భుతంగా డిజైన్ చేశారు..
ప్రతి సన్నివేశం హృద్యంగా సాగింది. పోరాట దృశ్యాల్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా మాటలు.. తెలుగులోనూ చాలా బాగా రాశారు.
ఒక్కటే లోటు.! అదేంటంటే, శ్రీకృష్ణుడు.. మరింత అందంగా వుండి వుంటే బావుండేది. వీఎఫ్ఎక్స్ సరిగ్గా చేయలేదేమో ఆ పాత్రకి.. అనిపిస్తుంది.
నిజానికి, ఇంకా అద్భుతంగా ‘కురుక్షేత్ర’ని డిజైన్ చేసే అవకాశముంది ఆధునిక టెక్నాలజీ సాయంతో. మరింత వివరంగా కూడా తీర్చిదిద్దొచ్చు.
Also Read: ‘గుడి’సేటి ప్రోటోకాల్.! సనాతన ధర్మం అనుమతిస్తుందా.?
పద్ధెనిమిది ఎపిసోడ్లు సరిపోవు.! 180 ఎపిసోడ్లుగా చూపించినా, సరిపోనంత ‘గొప్ప విషయం’ కురుక్షేత్రలో వుంటుంది.! ఆ కోణంలో చూస్తే, ఒకింత నిరాశ తప్పదు.
ఏదిఏమైనా, ఈ తరానికి అంత తీరిక వుండదు కాబట్టి, ‘కురుక్షేత్ర’.. ఈ జనరేషన్ కోసమే ‘క్రిస్ప్’గా తెరకెక్కించారని అనుకోవచ్చు. ఈ విషయంలో టీమ్ ప్రత్యేక అభిమానలు అందుకుంటుంది వీక్షకుల నుంచి.
