Table of Contents
కంగనా రనౌత్ (Kangana Ranaut) అంటే యాక్టింగ్ ‘క్వీన్’ (Queen). కెరీర్ మొదట్లో కేవలం ఎక్స్‌పోజింగ్ కోసమే అన్నట్లుండేవి ఆమె పాత్రలు. ఆమెను అలాంటి పాత్రల కోసమే దర్శక నిర్మాతలు ఎంపిక చేసేవారు. కానీ, ఎప్పుడైతే హీరోయిన్‌గా నిలదొక్కుకుందో, ఆ తర్వాత రూట్ మార్చేసింది. పూర్తిగా నటనకు ప్రాధాన్యత వున్న పాత్రల్నే ఎంచుకుంటూ వస్తోంది. అలా ఆమె నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలొచ్చాయి. అందులో ‘మణికర్ణిక’ (Manikarnika) కూడా ఒకటి కాబోతోంది.
ఝాన్సీకీ రాణి.. మణికర్ణిక.. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు దేశం కోసం ప్రాణాలొదిలారు. బ్రిటిష్ పాలకులతో పోరాడి కొందరు ప్రాణాలర్పించారు. అలాంటివారిలో ఝాన్సీ లక్ష్మీబాయి పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ ఝాన్సీ లక్ష్మీబాయినే ఈ ‘మణికర్ణిక’. అవును, ఝాన్సీకీ రాణి మణికర్ణిక.
క్వీన్.. మణికర్ణిక (Manikarnika).. కంగనా.!
ఏదన్నా సినిమాకి కంగనా ఒప్పుకుందంటేనే, ఆ సినిమాలోని పాత్రని ముందే ఔపోసన పట్టేసిందని అర్థం. ‘మణికర్ణిక’ (Manikarnika)గా ఫస్ట్ లుక్‌తోనే కంగనా రనౌత్ ఫుల్ మార్క్స్ కొట్టేసింది. పెర్ఫామెన్స్ పరంగా కంగనా రనౌత్‌కి వంకలు పెట్టలేం. ఆ స్థాయిలో వుంది ‘మణికర్ణిక’ ట్రైలర్.
ఒక్క మాటలో చెప్పాలంటే, ట్రైలర్‌లోనే మొత్తం సినిమా చూపించేశారనడం అతిశయోక్తి కాదు. తల్లిగా, పోరాటయోధురాలిగా కంగనా రనౌత్‌ని ట్రైలర్‌లో చూసినవారెవరైనా ‘కంగనా.. టాప్ క్లాస్ పెర్ఫామెన్స్’ అనకుండా వుండలేరు.
మన క్రిష్.. మణికర్ణిక దర్శకుడు..
మన క్రిష్.. అదేనండీ, రాధాకృష్ణ జాగర్లమూడి (Radha Krishna Jagarlamudi) ఈ ‘మణికర్ణిక’ చిత్రానికి దర్శకుడు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఔట్‌పుట్ తీసుకురావడమెలాగో క్రిష్‌కి బాగా తెలుసు. ‘కంచె’ (Kanche) సినిమా చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ (Gauthami Putra Sathakarni) సినిమా కూడా అంతే.
అందుబాటులో వున్న బడ్జెట్‌తోనే అద్భుతాలు చేయగల దిట్ట క్రిష్. అలాంటి క్రిష్‌కి తగిన బడ్జెట్ దొరికితే ఎలా వుంటుందో తెలుసా.? ఇంకెలా వుంటుంది, ‘మణికర్ణిక’లా వుంటుంది.
క్రిష్‌ని (Krish) డామినేట్ చేసిన కంగనా..
ట్రైలర్ చూస్తే, క్రిష్ మేకింగ్ కంటే.. కంగనా యాక్టింగ్ డామినేట్ చేసినట్లు అన్పిస్తుంటుంది. అది కొంత నిజమే. ఇంకో విషయమేంటంటే, క్రిష్ ఈ సినిమాని మధ్యలో వదిలేశాడన్న విమర్శలున్నాయి. అదీ ‘ఎన్‌టిఆర్ బయోపిక్’ (NTR Biopic) కోసం అనేది గాసిప్స్ సారాంశం. కానీ, అది నిజం కాదు.
కంగనా రనౌత్, సెట్స్‌లో ‘అతి’ చేస్తుండడంతో క్రిష్ గౌరవంగా తప్పుకోవాల్సి వచ్చింది. క్రిష్ లేకపోవడంతో, కొంత సినిమా కంగనా తన సొంత దర్శకత్వంలో తెరకెక్కించేసింది.
కంగనా వేలు పెట్టింది.. కానీ, అదెంత.?
వాస్తవానికి ‘మణికర్ణిక’ సినిమాకి సంబంధించి చాలా మార్పులు జరిగాయి.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత. చాలా సీన్స్‌ని కంగనా రీ-షూట్ చేసింది. ఈ క్రమంలో కొందరు నటీనటులు కూడా మారిపోయారు.
కంగనా రనౌత్ ‘అతి’ తట్టుకోలేక ఈ సినిమాకి సోనూ సూద్ గుడ్ బై చెప్పేశాడు. సోనూ సూద్ (Sonu Sood) అంటే, సిన్సియారిటీకి కేరాఫ్ అడ్రస్. అలాంటి సోనూ సూద్ ఈ సినిమా నుంచి తప్పించుకోవడమంటే అది చిన్న విషయం కాదు.
వివాదాలు ఔట్.. మణికర్ణిక సూపర్ హిట్.!
వివాదాలెలా వున్నా, ‘మణికర్ణిక’ ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచి, దేశభక్తి ఉప్పొంగే డైలాగులు, రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ ఎపిసోడ్స్.. వీటన్నిటికీ మించి కంగనా రనౌత్ పెర్ఫామెన్స్ వెరసి ‘మణికర్ణిక’ ఓ అద్భుతం అనదగ్గ స్థాయిలోనే వుంది.
2019 జనవరి నెలాఖరున ఈ ‘మణికర్ణిక’ ప్రేక్షకుల ముందుకు రానున్న దరిమిలా, సినిమా కోసం కంగనా చేసిన మార్పులేంటో, క్రిష్ రూపొందించిన సీన్స్‌ని ఎంతవరకు కంగనా వుంచిందో తెలియాలంటే అప్పటిదాకా వేచి చూడాల్సిందే.