Table of Contents
‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘అంతరిక్షం’ (Antariksham Preview) సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ‘ఘాజీ’తో తన విలక్షణతను సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) చాటుకుంటే, ‘కంచె’ (Kanche) సినిమాతో ప్రయోగాల విషయంలో తనకున్న ఆసక్తిని చాటుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej).
హైద్రాబాదీ అమ్మాయే అయినా బాలీవుడ్ సినిమాలతో సత్తా చాటిన అదితిరావు హైదరీ, ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ‘సమ్మోహనం’ (Sammohanam) అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ ఈసారి ‘అంతరిక్షం’ సినిమాతో సత్తా చాటబోతోంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, వీలు చిక్కినప్పుడల్లా ప్రయోగాత్మక సినిమాలకు ఓటేస్తున్న వరుణ్ తేజ్, ‘అంతరిక్షం’ సినిమాతో భళా అన్పించుకుంటాడా.?
అసలేంటి ఈ అంతరిక్షం (Antariksham Preview).!
అంతరిక్షంలోకి పంపిన ఓ శాటిలైట్‌తో సాంకేతిక సమస్య తలెత్తుతుంది. దాన్ని సరిదిద్దేందుకు భూమ్మీదనుంచి కొందరు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళతారు. అక్కడ వారికి ఎదురయ్యే సమస్యలేంటి.? సమస్యను చక్కదిద్దే క్రమంలో భారతీయ వ్యోమగాములు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు.? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో దొరుకుతుంది. ఈ సినిమాలో వరుణ్ సరసన, బాలీవుడ్ భామ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) హీరోయిన్‌గా నటిస్తోంది.
నీటిలో అలా.. అంతరిక్షంలో ఇలా.!
‘ఘాజీ’ సినిమా కోసం సబ్‌మెరైన్ సెట్ వేయించేసి, అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు సంకల్ప్ రెడ్డి. హైద్రాబాద్‌లో ‘ఘాజీ కోసం వేసిన ఆ సెట్ గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఈసారి మాత్రం స్టూడియోలో భారీ సెట్స్ వేశారు.
అంతరిక్షం (Antariksham Preview) అంటే, అక్కడ వుండేది శూన్యమే కదా. అక్కడ భార రహిత స్థితిలో వుండాల్సి వస్తుంది. ఆ ఫీల్ రావాలంటే, రోప్స్‌తో నటీనటుల్ని గాల్లో వేలాడదీయాలి. ఇందుకోసం నటీనటుల్ని చాలా కష్టపెట్టిన దర్శకుడు.. ఈ ఆలోచన చేసి, దాన్ని అమలు చేయడానికి తానెంత కష్టపడి వుండాలి.!
బాబోయ్.. ఇవేం కాస్ట్యూమ్స్..
హీరో వరుణ్ తేజ్ దిట్టంగా కనిపిస్తాడు. దాంతో బరువైన కాస్ట్యూమ్స్ అతనికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, హీరోయిన్ అదితి రావు హైదరీ విషయంలో అలా కాదు కదా.! సున్నితత్వానికి కేరాఫ్ అడ్రస్ అనేలా వుంటుంది అదితి (Adithi Rao Hydari). అయినాసరే, ఆమె కూడా బరువైన కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చింది.
ఆస్ట్రోనాట్ గెటప్ వేయాల్సి వచ్చినప్పుడు తొలుత లైట్ తీసుకున్నా, ఆ తర్వాత ఆ కాస్ట్యూమ్ బరువు మోయాల్సి వచ్చినప్పుడు షాక్‌కి గురయ్యిందట ఈ అందాల భామ. సెట్స్‌లో పలుమార్లు చాలా ఇబ్బంది పడ్డాననీ, అయితే ఆ కష్టం ఎంతో ఇష్టంతో కూడుకున్నదనీ అదితి రావు హైదరీ చెబుతోంది. అన్నట్టు, ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నటిస్తోన్న విషయం విదితమే.
తొలి తెలుగు సినిమా ‘అంతరిక్షం’
స్పేస్ నేపథ్యంలో ఎక్కువగా హాలీవుడ్ (Hollywood) సినిమాలు చూస్తుంటాం. తమిళంలో ఇటీవలే ‘టిక్ టిక్ టిక్’ (Tik Tik Tik) అంటూ ఓ సినిమా చేశారు స్పేస్ నేపథ్యంలో. తెలుగులో మాత్రం ఇదే తొలిసారి. అలా ‘అంతరిక్షం’ సినిమా అరుదైన ఘనతను దక్కించుకుంది. వందల కోట్లు ఖర్చు చేసి రూపొందించే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, ‘అంతరిక్షం’ సినిమాని లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రెడిట్ పూర్తిగా దర్శకుడు సంకల్ప్ రెడ్డికే ఇవ్వాల్సి వుంటుంది.
మోగా ప్రయత్నం..
మామూలు ప్రయత్నం కాదిది. మహా ప్రయత్నం.. మెగా ప్రయత్నం.. అంతకు మించిన సాహసం. దర్శకుడి మెదడులో మెదిలిన అద్భుతమైన ఆలోచన.. ఆ ఆలోచనకి జై కొట్టిన నిర్మాత.. ఈ సాహసంలో భాగస్వాములయ్యేందుకు కష్టపడ్డ నటీనటులు.. ఇలా ఒకరేమిటి, ప్రతి ఒక్కరి సాహసానికి మంచి ఫలితం రావాలని ఆశిద్దాం.