Maranamass Telugu Review.. డార్క్ కామెడీ జోనర్‌లో ఈ మధ్య ఎక్కువగా సినిమాలొస్తున్నాయ్. థ్రిల్లింగ్ డార్క్ కామెడీ జోనర్‌లో వచ్చిన సినిమానే ‘మరణమాస్’.
తెలుగు సినీ అభిమానులకి ఓటీటీ ద్వారా సుపరిచితుడయ్యాడు మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్. ఇంటిల్లిపాదీ ఇష్టపడే రోల్స్ చాలానే చేసేశాడు బాసిల్ జోసెఫ్.
ఓటీటీ వరకూ అయితే, బాసిల్ జోసెఫ్‌కి తెలుగునాట సినీ అభిమానులు ఎక్కువే. అందుకే, ఓటీటీలో బాసిల్ జోసెఫ్ సినిమా వచ్చిందంటే, ఒకింత ఆసక్తి చూపిస్తున్నారు… తెలుగు సినీ అభిమానులు.
మరణమాస్ కథ కమామిషు ఏంటంటే, ఓ సీరియల్ కిల్లర్.. అతన్ని వెంటాడే పోలీసులు, ఓ కామెడీ హీరో.. అతనికో ప్రియురాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వుంది.
Maranamass Telugu Review.. అరటి పండు కిల్లర్..
వృద్ధుల్ని చంపేసి, నోరు చీరేసి, నోట్లో అరటి పండు పెడుతుంటాడో సీరియల్ కిల్లర్. ఎందుకలా చేస్తాడు.? ఆ సీరియల్ కిల్లర్ ఎలా పట్టుబడ్డాడన్నది మిగతా కథ.
ఊళ్ళో చిలిపి కుర్రాడు ‘లూక్’ (బాసిల్ జోసెఫ్). ఎంతటి చిలిపితనం అంటే, అతని చిలిపితనాన్ని భరించలేక, ఊరంతా చందాలు పోగేసి మరీ, అతన్ని వేరే దేశానికి పంపెయ్యాలని చూస్తారు ఊరి జనం.
అతన్ని ప్రేమిస్తుందిగానీ, ప్రేమలో కన్‌ఫ్యూజన్ జెస్సీ (అనిష్మా అనిల్ కుమార్)కి. ఓ బస్సు డ్రైవర్, ఆ బస్సుకే కండక్టర్‌గా పని చేసే వ్యక్తి.. ఓ పోలీస్ అధికారి.. ఇలా తారాగణం పెద్దదే.

తెలుగు సినీ జనాలకి తెలిసిన మొహం అంటే, ఇందులోని పోలీస్ అధికారి. చాలాకాలం క్రిందట ‘పసివాడి ప్రాణం’ సినిమాలో విలన్‌గా చేశాడు లెండి. విలన్ అంటే, చిన్న విలన్.
అతని పేరు బాబు ఆంటోనీ. పలు తెలుగు సినిమాల్లో నటించాడుగానీ, అతన్ని గుర్తించడం కష్టం. అలా మారిపోయాడతడు.
థ్రిల్లర్‌కి కామెడీ కలిపి బాగానే ఎంగేజ్ చేయగలిగారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. ఇవన్నీ సినిమాకి తగ్గట్టుగానే వున్నాయ్. నిర్మాణపు విలువలు బానే వున్నాయ్.
ఓటీటీలో వచ్చే ఇలాంటి సినిమాలకి డబ్బింగ్ బాగా చెబుతున్నారు.. డైలాగ్స్ కూడా బాగానే రాస్తున్నారు. బోల్డంత ఫన్ జనరేట్ అవుతోంది.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
కామెడీ మాత్రమే అనుకుంటే పొరపాటు.. బీభత్సమైన యాక్షన్ సీన్స్ కూడా చివర్లో వున్నాయ్. అవేం ఫైట్లు బాబోయ్.. అనిపించకమానదు.
హింస సంగతి సరే సరి.! కామెడీగా రన్ చేసి, హింస, రక్త పాతం ఏంటి.? అంటే, అందులో మళ్ళీ కామెడీనే. బోరింగ్ సన్నివేశాల్లేవని కాదు. మలయాళ సినిమాల్లో కొంత స్లో పేస్ మామూలే.
ఓవరాల్‌గా చూసుకుంటే, ఓటీటీలో టైమ్ పాస్ మూవీ.. ఈ ‘మరణమాస్’. తెలుగులోనూ ఇలాంటి సినిమాల్ని మన హీరోలు ట్రై చేయొచ్చు కదా డైరెక్టుగా.?
అసలెందుకు సీరియల్ కిల్లర్, వృద్ధుల్ని చంపేసి, అరటి పండుని నోట్లో పెడతాడు.? కారణం తెలిస్తే, షాకవుతారు.!